English | Telugu
తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు...
Updated : Oct 23, 2019
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు, రహదారులు, చెరువులను తలపిస్తుండటమే కాక పలుచోట్ల ఇళ్లు, పంటలు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణానదీ పరివాహక గ్రామా ముత్యాల వద్ద కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో భవానీ ముక్తేశ్వరాలయం నీట మునిగిపోయింది. వర్షాల కారణంగా ఆలయం రెండు నెలల్లో నాలుగు సార్లు నీట మునిగింది. మచిలీపట్నంలో కూడా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ఇళ్ళల్లోకి వరద నీరు చేరుకుంది. రోడ్ల మీద మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోవడంతో చిరు వ్యాపారు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఆలయం నీటమునిగిపోయింది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా లోని తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ ముప్పై మూడు గేట్లను ఎత్తివేసి లక్షా నలభై ఏడు వేల క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేయటంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రాలయం నది దగ్గర భక్తులు స్నానాలకు వెళ్లద్దని శ్రీమఠం అధికారులు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అమలాపురంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. హౌసింగ్ బోర్డు కాలనీ లోని పలు ఇళ్లు నీట మునిగాయి. స్పందించి మున్సిపల్ సిబ్బంది నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపించారు. కోనసీమలోని పదహారు మండలాల్లో ఎనభై ఐదు సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొవ్వూరులో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెల్టా మండలాల్లో వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు చనిపోతాయనీ ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న నలభై ఎనిమిది గంటలు మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఏపీ తీరానికి సమీపంగా వస్తోంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.