English | Telugu

విశాఖ కరోనా కేసుల లెక్కపై భిన్నాభిప్రాయాలు.. కావాలనే దాస్తున్నారా?

ఏపీ కొత్త రాజధానిగా ప్రభుత్వం ఎంపిక చేసిన విశాఖపట్నంలో పది రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మగలరా ? అవును ఇదే నిజమంటోంది వైసీపీ సర్కారు. అంతర్జాతీయ విమానాశ్రయం కలిగిన విశాఖపట్నంలోనే కరోనా తొలి నాళ్లలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా నమోదవుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటివరకూ సాగర తీరంలో నమోదైన కేసుల సంఖ్య 20 మాత్రమే. అందులోనూ 10 మంది ఇప్పటికే చికిత్స పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మరో పది మంది మాత్రమే ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్నారు. రేపోమాపో వీరిని కూడా విడుదల చేసే అవకాశముంది.

విశాఖపట్నంలో కొత్త రాజధాని రాబోతున్న నేపథ్యంలో అంత కంటే ముందే వచ్చేసిన కరోనా వైరస్ ప్రభావాన్ని ఎలా తగ్గించాలా అని ఏపీ ప్రభుత్వం ఆలోచించని రోజు లేదు. ఇప్పటికే అక్కడ విమ్స్ ప్రత్యేక కోవిడ్ 19 ఆస్పత్రితో పాటు క్వారంటైన్ చర్యలు కూడా ఘనంగా సాగుతున్నాయి. దీంతో అక్కడ నిత్యం ఒక్క కొత్త కేసు కూడా నమోదు కావడం లేదు. ఇదీ వైసీపీ ప్రభుత్వ వాదన. కానీ అక్కడ పరిస్ధితి అంత గొప్పగా ఉందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. నిన్నటికి నిన్న కేజీహెచ్ లో పేషెంట్లకు కరోనా చికిత్స అందిస్తున్న ఐదుగురు నర్సులకు కోవిడ్ 19 లక్షణాలు కనిపించాయి. వీరికి నిబంధనల ప్రకారం రోజువారీ డ్యూటీలు చేయించాల్సి ఉండగా, అదనపు గంటలతో పాటు అదనపు రోజుల్లోనూ సేవలకు వాడుకుంటున్నారు. దింతో వీరికి కోవిడ్ 18 లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు. పని చేయకపోతే ఉద్యోగాలు పోతాయన్న భయంతో నర్సులు రోజువారీ విధులకు హాజరవుతూ కరోనా బారిన పడినట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది.

ఇదే కోవలో విశాఖ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ లక్షణాలతో జనం ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కొత్త కేసే నమోదు కాలేదని చెబుతోంది. ఇదే అంశంపై ఇవాళ మాట్లాడిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ప్రభుత్వ లెక్కలపై అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. త్వరలో విశాఖకు రాజధానిని తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం కావాలనే కరోనా ప్రభావాన్ని తక్కువ చేసి చూపుతోందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. స్ధానికంగా జరుగుతున్న ఇతర పరిణామాలను బట్టి చూసినా ప్రభుత్వ వాదనపై అనుమానాలు తప్పడం లేదు. కానీ రాష్ట్రంలోనే కరోనా లేదని చెప్పే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నియంత్రణ చర్యలకు దిగినట్లు.. విశాఖలోనూ పరిస్ధితి అదుపు తప్పితే అప్పుడు వాస్తవాలు ఒప్పుకోక తప్పదనే వాదన వినిపిస్తోంది.