తన భర్త కనిపంచడం లేదంటూ మాధవి అనే మహిళ ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివాసముండే తాము కరోనా బారిన పడ్డామని.. అయితే తామంతా కోలుకుని ఇంటికి తిరిగి రాగా తన భర్త మధుసూదన్ జాడ మాత్రం తెలియలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 27న తన భర్తను కింగ్ కోఠి ఆసుపత్రిలో చేర్చుకున్నారని, ఆ తర్వాత ఏప్రిల్ 30న గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. తన భర్త గురించి ఆరా తీయగా ఆసుపత్రి సిబ్బంది పొంతన లేకుండా సమాధానం చెప్పారని, ఒకసారి చనిపోయాడని, మరోసారి వెంటిలేటర్ పై ఉన్నాడని సమాధానం ఇచ్చినట్టు ఆమె తెలిపారు. తరువాత మే 1న తన భర్త చనిపోయాడని, మే 2న అంత్యక్రియలు పూర్తి చేశామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని, అయితే ఆ విషయంలో తమ నుంచి అనుమతి తీసుకోలేదని, మృతదేహాన్ని గుర్తించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మహిళ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
కాగా, ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందిస్తూ మే 1న మధుసూదన్ చనిపోయినట్టు నిర్దారించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే నాటికే ఆయన ఆరోగ్యం క్షిణించిందని.. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన 23 గంటల్లోనే చనిపోయాడని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు చెప్పే డెడ్ బాడీని పోలీసులకు అప్పగించామని చెప్పారు. కుటుంబ సభ్యుల నుండి తీసుకున్న సంతకాలు కూడా తమ రికార్డ్స్‌లో ఉన్నాయని అన్నారు. కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకి ముందుకు రాకపోతే ఆ కార్యక్రమాలను జీహెచ్ఎంసీ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.