English | Telugu

ఆగని కరోనా కేసులు.. యాక్టివ్ కేసుల‌లో టాప్ 5 లోకి భార‌త్!

భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ ఐదువేల‌కు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజులో మరోసారి 5,000 కంటే అధికంగా కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,609 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,359కి చేరింది. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3435కి చేరింది. 48,735 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 63,624 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

కరోనా యాక్టివ్ కేసుల విష‌యంలో ప్రపంచంలో టాప్ 5 దేశాలలో భారత్ చేరింది. ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రెజిల్, ఫ్రాన్స్‌, భారత్ లలో అత్య‌ధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. అమెరికాలో 1.1 మిలియన్లకు పైగా కరోనా కేసులు ఉన్నాయి. రష్యాలో 2.20 లక్షలకు పైగా, బ్రెజిల్‌లో 1.57 లక్షలకు పైగా, ఫ్రాన్స్‌లో 90 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లో 63 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. అయితే భారత్ లో మిగతా దేశాలతో పోలిస్తే రికవరీ రేటు ఎక్కువగా ఉంది. అలాగే, కరోనా మరణాల రేటు కూడా తక్కువగా ఉంది.