English | Telugu
వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. టీడీపీ ప్రతిపక్ష హోదా పోవడం ఖాయమా?
Updated : May 21, 2020
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నాయకులను టీడీపీకి రాజీనామా చేయించి.. వైసీపీలో చేర్పించేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ లకు వైసీపీ అధిష్టానం బాధ్యతలను అప్పజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొందరు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెబుతుండగా.. మరి కొందరు మాత్రం అధికార పార్టీ నేతలతో మాటలు కలుపుతున్నారట. ముఖ్యంగా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారట. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కూడా వైసీపీలో చేర్పించేందుకు కరణం ప్రయత్నిస్తున్నారని వారితో ఆయన టచ్‍లో ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ మాజీ ఎమ్మెల్యేలతో నిత్యం చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రధానంగా టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వీరిపై ఒత్తిడి ఉందంటున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై టీడీపీ అధిష్టానం కూడా అలెర్ట్ అయిందని, వారితో అధినేత మాట్లాడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మే 30 కి వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతుంది. మే 30 లోపు పార్టీలో చేర్చుకుని చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుని హోదా లేకుండా చేయాలనే యోచనలో అధికారపార్టీ ఉందంటున్నారు. అందులో భాగంగానే ముందుగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిందని అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ 23 మందిలో ఇప్పటికే ముగ్గురు పార్టీ ఫిరాయించారు. మరో ముగ్గురు కనుక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుని హోదాపోతుంది. దానికి జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముహూర్తంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఆరోజు టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇదంతా పధకం ప్రకారం వైసీపీ ఆడుతోన్న మైండ్ గేమ్ అని కూడా టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ పార్టీ మారేందుకు సిద్దంగా లేరని అంటోంది. మరి అధికార పార్టీ నిజంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందా? ఆ ఆకర్ష్ కు టీడీపీ నేతలు ఆకర్షితులవుతారా? తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాలి.