English | Telugu
భారీ వర్షాలతో కళకళలాడుతున్న డ్యామ్‌లు
Updated : Oct 23, 2019
రాష్ట్రమంతా భారీ వర్షాలతో ముంచెత్తుతోంది.కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండటంతో పది గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి చేస్తూనే డ్యామ్ గేట్ల నుంచి కూడా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఔట్ ఫ్లో రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్కులు ఉంది. ఈ సీజన్ లో ఇలా డ్యామ్ గేట్లు ఎత్తడం ఏడోసారి కావడం విశేషం. సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలానికి వరద కొనసాగుతుండడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు అధికారులు. మధ్యాహ్నానికే ఔట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఓ అడుగు తక్కువగా మాత్రమే ఉంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పద్నాలుగు పాయింట్ మూడు టీఎంసీల నీరుంది. ఈ సీజన్ లో శ్రీశైలానికి రికార్డు స్థాయిలో పన్నెండు వందల ముప్పై ఆరు టిఎంసిల నీరు వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాల వల్ల ఈ సారి ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.
కర్నాటకలో భారీ వర్షాలతో తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద వహిస్తోంది. ప్రస్తుతం ముప్పై మూడు గేట్లు ఎత్తి లక్షా యాభై వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వంద టీఎంసీల నీటి మట్టంతో కళకళలాడుతోంది. ఇటు శ్రీశైలం నుంచి సాగర్ కు వరద పోటుతో దిగువకు నీటి విడుదల పెరిగింది. సాగర్ పన్నెండు క్రస్ట్ గేట్లు, పన్నెండు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో రెండు పాయింట్ రెండు నాలుగు లక్షలు ఉంది. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ మూడు వందల పన్నెండు టీఎంసీలు అయితే ప్రస్తుతం మూడు వందల పది టీఎంసీల నిల్వ ఉంది. ఇన్ ఫ్లో మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడిచి పెడుతున్నారు. ఒక సీజన్ లో సాగర్ గేట్లు పదకొండు సార్లు ఎత్తడం రికార్డు అంటున్నారు. శ్రీశైలం నుంచి ప్రస్తుత వర్షాకాలం ఏడు వందల ఎనభై టీఎంసీల వరద వచ్చింది.పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.