English | Telugu
జలియన్‌వాలా దురంతానికి వందేళ్లు...
Updated : Apr 13, 2020
జలియన్ వాలాబాగ్ ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట పేరు. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 20 వేల మంది ప్రజలు ఆ తోటలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
1919 రౌలట్ చట్టం భారత పౌరులను ఎటువంటి విచారణ జరపకుండా శిక్షించే అధికారం అధికారులకు సంక్రమింపజేసింది. ఆనాడు ఆ చట్టాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లో హర్తాళ్ జరిగినప్పుడు ఉద్యమకారులు సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది. అందుకు నిరసనగా జరిగిన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపగా 20 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల సంస్మరణార్థం, పోలీసుల చర్యలకు నిరసనగా అమృతసర్ స్వర్ణ దేవాలయం దగ్గర గల జలియన్‌వాలా బాగ్‌లో 1919 ఏప్రిల్ 13 న ప్రజలు పెద్దయెత్తున సమావేశం ఏర్పాటు చేశారు. దీన్ని నిషేధిస్తూ పంజాబ్ ప్రభుత్వం చేసిన ప్రకటన తగినంతగా ప్రచారం కాలేదు. అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు శాంతియుతంగా జరుపుకుంటున్న సమావేశంపై ఒక్కసారిగా బ్రిటీష్ సైనికులు కాల్పుల దాడి చేశారు.
1920లో గాంధీజీ పిలుపు మేరకు ‘సహాయ నిరాకరణ ఉద్యమం’ ప్రారంభమయింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారేందుకు ఈ ఘటనే ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. దీనికి నిరసననగా బ్రిటిష్ వారు తనకు ఇచ్చిన ‘సర్’ బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ తిరిగి ఇచ్చేశారు.