
మట్టిరేణువులను పోగేసుకొని
సుడిగుండంలా గాలితో కలిసి
నిన్ను చుట్టేయాలన్నంత
తాపత్రయం నాది...
నాకు చేరువలో ఉన్నట్టున్నా
ఎప్పుడూ తీరం చేరని
కెరటంలా ఎగిసి..
పడిపోయే నిట్టూర్పు నీది..
మస్తిష్కంలోని భావాలను
మనసుకొయ్యపై ఆరేసుకున్న ప్రతీ నిశిరాత్రి
మదిరాల్చే మౌనపు కన్నీటిలో
పదే పదే నానిపోయి పచ్చిగానే తెల్లారేది..
పెదవులపై ఎండిపోని మౌనాలు
మనసును ఉబలాటపెడుతున్నపుడు
నీ నిశ్శబ్ధాలే మదిలో శబ్ధాలై
ఆ భావాలు నిన్ను చేరాలని ఆశపడేవి..
ఎటువైపునుంచి ఏ అపాయం వస్తుందోనని
అన్నివైపులా కాచుకొని ఎప్పుడూ
ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉండే పక్షిని చూస్తే
ఇప్పుడు నన్ను అనుక్షణం దాటేయాలనుకునే
నీ చూపులే కళ్ళల్లో మెదులుతాయి..
ఆ చూపులు కరిగి రాలిపోకుండా
బలవంతంగా కుక్కుకుంటున్న ఆ కన్నీళ్ళకేం తెలుసు...
దగ్గరే కనిపిస్తున్నట్టుండే కొండలా
మనమెప్పుడూ దగ్గరవ్వలేని దూరాలమని!
.jpg)
----- సరిత భూపతి



