Facebook Twitter
“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” తొమ్మిదవ భాగం


“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” తొమ్మిదవ భాగం
6 వ అధ్యాయం

 


   ఏకశిలా నగరము నందు ప్రతాపరుద్ర చక్రవర్తి కూడనూ సభ ఏర్పాటు చేశాడు.
   మంత్రి శివదేవయ్యగారు ఆశీనులయ్యాక అందరూ తమ తమ ఆసనాల్లో సర్దుకున్నారు.
   "ప్రభూ! సమయం చూసుకుని పగ తీర్చుకునుటకై దేవగిరి రాజు పశ్చిమాన లక్ష గుర్రములు, రెండు లక్షల పదాతి దళముతో.. మహారాష్ట్ర దేశాధీశుడు లక్ష అశ్వంబులను, పదాతి వర్గంబును.. తక్కిన రాజులు కూడ తమ తమ బలములలో అచట నిలిచారు." ఒక నాయకుడు లేచి విన్నవించుకున్నాడు.
   "ఢిల్లీ సుల్తాను సేనాని ఏకశిలానగరమునకు ఉత్తర భాగమున విడిది చేసి ఉన్నాడు.. సైనిక బలం చాలా ఉంది." మరొక సేనాని..
   "కటకము నుంచి ఆ రాజు యాభై వేల గజ బలంబు, ఏడు లక్షల పదాతి దళముతో ఈశాన్యమునకు వచ్చుచున్నాడు.." ఇంకొక సేనాని..
   "మూడు దిక్కులా దాడి చేస్తున్నారన్నమాట." శివదేవయ్య సాలోచనగా అన్నారు.
   "పశ్చిమమునకు మా తమ్ముడు అన్నమదేవుని పంపుదాము. కటకం రాజు మీదికి  నరపతి రాయలు , ఉత్తరమున సుల్తానును మా మూల బలము ఎదుర్కుంటారు. చూచెదము.."

   ప్రతాపరుద్రుడు తన ఏకాంత మందిరములో సమాలోచనలో ఉన్నాడు, మంత్రి శివదేవయ్య గారితో.
   శివదేవయ్యగారు వృద్ధులైపోయారు. అయిననూ ధృఢంగా ఉన్నారు.
  "ప్రభూ!" అదే సమయములో ఆతృతగా పిలుస్తూ రాణీ విశాలాక్షీ దేవి వచ్చింది. వెనుతిరిగి ఉన్న శివదేవయ్యగారిని చూసి వెనుకకు మరలబోయింది.
  "రండి దేవీ! మన శివదేవయ్యగారే.." చక్రవర్తి పిలిచాడు.
   రాణీ వాసపు స్త్రీలు అంతఃపురము నందు పరాయి పురుషుని కంట పడుట సాంప్రదాయం కాదు. కానీ శివదేవయ్యగారు వేరు. ఆ సంగతి మహారాణీకి వివాహమయిన క్రొత్తల్లోనే తెలిసింది.
   ఒక రోజు..
   చక్రవర్తి ఏకాంతంగా రాణీగారితో ఉన్న సమయంలో శివదేవయ్యగారు వేంచేశారు. రాణీ లోనికి నిష్క్రమిస్తూ ఉండగా ప్రతాపరుద్రుడు వారించాడు.
  "దేవీ! శివదేవయ్యగారు మన ప్రధాన మంత్రి. తాతగారు, గణపతి దేవుని కాలం నుండీ మనలను సన్మార్గమున నడిపిస్తున్నారు. నన్ను ఊయలలో వేసినప్పటి పసితనములోనే నాకు పట్టాభిషేకమొనర్చిన వారు. వారు సాక్షాత్ పరమశివుని ప్రతి రూపమని తిక్కన సోమయాజులవారే మా తాతగారితో చెప్పారట. అందుచే మీరు నిస్సంకోచముగా లోనికి రావచ్చును. వీరిని పూజించిన సకల శుభములూ కలుగును."
   మహారాణీ, భర్త చెప్పినట్లు, శివదేవయ్యగారిని ఈశ్వరుని వలెనే భావించి పూజిస్తూ ఉంటుంది.
   "స్వామీ! మీరునూ ఇచ్చటనే ఉన్నందుకు రవ్వంత ఉపశమనముగా నున్నది." గురువుగారి పాదాలనంటి నమస్కరించి అన్నది విశాలాక్షీ దేవి.
   "ఏమయింది తల్లీ?" శివదేవయ్యగారు అభిమానంగా చూస్తూ అడిగారు.
    ఓదార్పు మాట వినగానే రాణీ కన్నులలో నీరు చిప్పిల్లినది.
   "ఎందులకంత వ్యాకులపాటు తల్లీ?"
   "స్వామీ! పద్మాక్షి అమ్మవారి ఆలయంలో ఖడ్గ ఖేటకములు కాన వచ్చుట లేదు. నాకు భయముగా నున్నది."
   శివదేవయ్య మౌనము వహించారు.
   "ఎవరో దొంగలు కాజేసి ఉంటారు. మరల చేయిద్దాము.. యుద్ధం సద్దు మణిగాక." ప్రతాప రుద్రుడు అనునయించాడు.
   విశాలాక్షీ దేవి గురువుగారిని చూసింది. వారు ఇంకా మౌనముగానే ఉన్నారు కన్నులు మూసుకుని.
   "స్వామీ!" ప్రతాపరుద్రుడు పిలిచాడు.
   "అమ్మాయ్! నాకు అర్ధమయింది నీ భయము. మానవమాత్రులం మనమేం చెయ్యగలం. విధి వ్రాత."
   అప్పుడు ప్రతాప రుద్రునకు గురుతుకు వచ్చింది. ఆ కత్తి డాలులను అమ్మవారు తమ వంశపు తొలి రాజైన మాధవ వర్మకి స్వయముగా ఇచ్చిందనీ, ఇస్తూ ఇస్తూ వెయ్యి సంవత్సరములు మీ సామ్రాజ్యమును రక్షిస్తానని అందనీ ఒక నమ్మకం.
   సాలోచనగా శివదేవయ్యగారిని చూశాడు చక్రవర్తి.
   "అవును వేయి వర్షములు ముగిసినవి. ఇంక మనకు దైవబలము ఉండదు."
   "కానివ్వుము స్వామీ! విధి నెవ్వరూ తప్పించ లేరు కదా! దైవ లిఖితమేదయితే అదియే జరుగును."
   మహారాణీ విశాలాక్షీదేవి మ్లాన వదనముతో పూజా మందిరమునకు వెడలింది.
  
   కొద్ది దినములలోనే మూడు దిక్కులా యుద్ధము చేసి, ఓరుగల్లు సైనికులు శతృవులను తరిమి కొట్టారు. అప్పటికి తాత్కాలికంగా ఢిల్లీ సుల్తాన్ సైన్యం కూడా వెనుతిరిగారు.
   దేవగిరి రాజు, కటక్ రాజు కూడ కప్పములు చెల్లించి వారి పట్టణములకు తరలారు.
   ఆ యుద్ధములలో వేల కొలది గుర్రములు, వందల కొలదీ గజములు, సైనికులు మృతి చెందారు.
   ప్రతాప రుద్రుడు తన రాతి కోట చుట్టూ మట్టి గోడ నిర్మించాడు. దాని చుట్టూ కందకం త్రవ్వించాడు. కోట పటిష్ఠమయిన పిదప సైన్యాన్ని బలపర్చ సాగాడు. నాయంకరులందరికీ వర్తమానాలు పంపి, తమ తమ బలములతో సిద్ధము గానుండ మన్నాడు.
   తన రాజ్యాన్ని శతృవుల దాడి ఎదురుకొనుటకు రక్షణ ఏర్పరచుకుంటూనే, ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ అప్రమత్తంగా రాజ్య పాలన సాగిస్తున్నాడు.
   ఒక రోజు ప్రతాప రుద్ర చక్రవర్తి సభలో నుండగా వేగులు వార్త తీసుకొచ్చారు.
   "ప్రభూ! ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీని, అల్లుడు జునా ఖాన్ చంపేసి, సింహాసనం మీద కూర్చున్నాడు. అల్లవుద్దీన్ ఖిల్జి గా పేరు మార్చుకుని, సరిహద్దు నుంచి మంగోలులను తిప్పికొట్టాడు."
   సభలోని వారు సంతోషంగా చూశారు. హిందూ దేశానికి కొత్త బెడద తప్పింది కదా!
   "అంతే కాదు.. దక్షిణదేశ దండయాత్రలు ప్రారంభించాడు. ఉల్లూఖాన్, నుస్రత్ ఖాన్లను గుజరాత్ మీదికి పంపి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు."
   అప్పుడు కలిగాయి సభలో భయాందోళనలు..
   నలుప్రక్కలా గుసగుసలు..
   చక్రవర్తి సాలోచనగా చూస్తున్నాడు.
   "అవును ప్రభూ! మనం కూడా అప్రమత్తులమై ఉండాలి. గుజరాత్ దండయాత్రలో మాలిక్ కపూర్ అని ఒక బానిసని కొన్నారు. అతడిని.." వేగు సంశయిస్తూ ఆగాడు. సభలో అటువంటివి చెప్పవచ్చునో లేదో..
   "ఫరవాలేదు. చెప్పు. అతడిని ఏం చేశారు?" చక్రవర్తి ప్రోత్సహించాడు. చర్మం వలిచి ఉంటారు. ఆ రాక్షసులు చేసే పని అదే కదా! పట్టుబడిన వారిని.. ఒక్కసారిగా చంపరు.
   "సేనానులు పట్టుబడితే వేరే రకమైన శిక్షలుంటాయి ప్రభూ!. కానీ ఇతడు బానిస కదా.. నపుంసకుడ్ని చేశారు. దానితో అతనికి, మనుషుల మీద, వ్యవస్థ మీద పగ, ప్రతీకారం పెరిగాయి. అన్నివిధాలుగా శరీరాన్ని ధృఢ పరచుకుని, యుద్ధాలలో రాటుదెలి, సేనాని అయ్యాడు. బహు నిర్దయుడు. ఏ మాత్రం కరుణ అనేది అతడి నిఘంటువులో లేదు."
   "అంటే అతడిని.."
   "దక్షిణ దేశం మీదికి పంపుతున్నారు. దేవగిరి మీదికి అతడు దండెత్తి,  అక్కడి రాజు రామచంద్రుడిని ఓడించాడు. అతడు తన కూతురుని, అల్లాఉద్దీన్ ఖిల్జికిచ్చి పెళ్లి చేసి, సామంతుడిగా లొంగిపోయాడు.
   దానితో వారి బలం రెట్టింపైనట్లయింది. ఏ క్షణంలో నైనా మన మీదికి రావచ్చు."
   "మన మీదికా! అప్పుడు మన చేతిలో పరాభవింపబడి వెనుతిరిగిన వైనం గుర్తు లేదా?" పోతుగంటి మైలి సేనాని లేచి అడిగాడు.
   ఉప్పరపల్లి వద్ద జరిగిన యుద్ధంలో అతడు, రేచర్ల వెన్న సేనాని కలిసి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ముష్కురుల సైన్యాన్ని తిప్పి కొట్టారు. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని మైలి సేనాని తేలికగా మాట్లాడాడు. కత్తి యుద్ధంలో.. ఖడ్గాన్ని అత్యంత వేగంగా తిప్పడంలో నకులుడికి సమానుడని పేరు తెచ్చుకున్నాడు అతడు.
   "అవును సేనానీ! ఆ అనుభవంతోనే మరింత యుద్ధ నైపుణ్యం సంపాదించి, సైన్యాన్ని పటిష్ఠం చేసుకున్నాడు మాలిక్ కాఫర్. అతడు కర్కోటకుడు. పొంచి పొంచి మీద పడడంలో పెద్దపులికి సాటి ప్రభూ! అతడిని ఏమాత్రం తక్కువ అంచనా వేయ కూడదు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర దేశంలో చాలా రాజ్యాలని జయించాడు. ఇప్పుడు దక్షిణా పధాన్ని తన సామ్రాజ్యంలో కలుపుకోవాలని పట్టుదల మీద ఉన్నాడు." నెమ్మదిగానైననూ స్థిరమైన కంఠ స్వరంతో సెలవిచ్చాడు ఆ చారుడు.

   వేగుల వార్తలు వినగానే ప్రతాపరుద్రుడు అప్రమత్తుడయ్యాడు. తన సేనానులందరికీ వర్తమానం పంపాడు.
   సామ్రాజ్యం అంతా అట్టుడికిపోతోంది. మూల మూలలా, గ్రామ గ్రామాలా యుద్ధ వాతావరణం. ఎక్కడికక్కడ ప్రజలు గుంపులుగా చేరి అదే చర్చ. యువకులందరినీ వారి వారి శక్తిని, కౌశల్యాన్నీ గమనించి సైన్యంలోని అనేక విభాగాల్లోకి చేర్చుకుంటున్నారు.
   అద్దంకి ప్రభువుల వలెనే ఇతర నాయంకరులు కూడా చర్చలు జరిపి, ప్రతాపరుద్రునికి సహాయ పడడానికి నిశ్చయించుకున్నారు. అద్దంకి, గుడ్లేరు.. చుట్టుప్రక్కల గ్రామాలనుండి యువకుల సేకరణ ఇంకా ఉధృతమయింది. తల్లిదండ్రులు, భీతి చెందిన చూపులతో.. తమ బంగారు కొండలని ఒడలంతా తడిమి, కన్నీళ్లతొ సాగనంపుతున్నారు.
   పోతమాంబ, పేరమ్మలను కూడా సంసిద్ధం చేశాడు ఎర్రన.
   కానీ.. అతడిని, తండ్రికి సహాయంగా ఉంటూ.. అక్కడి స్త్రీలని, వృద్ధులని కాచుకొమ్మని చెప్పాడు అద్దంకి సేనాని.
   "ముష్కురులు మమ్ము దాటి ఇచ్చటికి వచ్చిన మీరే ఎదుర్కొనాలి. అంతవరకూ రాకపోవచ్చును. కానీ.. ఒక వేళ అట్లయినచో.. మనము ఇచ్చట కూడనూ రక్షణ ఏర్పరచుకోవలె. వారు స్త్రీలు, పసివారు, వృద్ధులు అని చూడరు. విచక్షణ ఏమాత్రం లేదు."
   యుద్ధానికి వెళ్ళే ముందు కొందరు యువతులకు కూడా శిక్షణ ఇప్పించాడు సూరనార్యుడు.
   "మహారాణి రుద్రమదేవి పౌరుషం కొంతయినా ఆమె ప్రజలకి ఉండాలి. ఏ పరిస్థితి నైనా ఎవరైనా తట్టుకోవాలి. ఒక్క స్త్రీ కూడా తురుష్కుల చేతికి చిక్క కూడదు. రాజపుత్ర వనితలని ఆదర్శంగా తీసుకోవాలి."
   ప్రతీ పల్లె, ప్రతీ వాడ యుద్ధ సన్నిద్ధులై పోయారు.
   కారం, కత్తి పీట చేతికి అనువుగా నుంచుకుంటున్నారు ప్రతీ ఇంటిలో.

   ఢిల్లీ సుల్తాన్ మదమడుద్దాం
   పులి పిల్లల్లా మీద పడదాం
   పిల్లి కూనల్లా పరుగెత్తి పోవాలి
   మాలిక్ కాపర్కు మారో మారో
   ఓరుగల్లు వీధుల్లో సైనికులు కవాతు చేస్తుంటే పిల్లలు పాటలు పాడుతూ, పిడికిళ్ళు బిగించి గాలిలో యుద్ధం చేస్తున్నారు.
   భయపడినంతా అయింది. 1309 వ సంవత్సరం ఆశ్వీయుజ మాసంలో మాలిక్ కాపర్ అపారమైన సైన్యంతో ఢిల్లీ నుండి బయలు దేరాడని వార్త వచ్చింది.
   అయితే పుష్యమాసం మధ్యకి సబ్బినాడు ప్రాంతానికి రావచ్చు. రెండు మాసముల పైననే వ్యవధి ఉంది. డెబ్బది ఏడు మంది నాయంకరులు తమ సైన్యాలతో ఓరుగల్లుకు వచ్చేశారు.
   తొమ్మిది లక్షల మంది విలుకాళ్ళు, ఇరవై వేల అశ్వబలం, వేయి గజబలం సేకరించాడు ప్రతాప రుద్రుడు.
   దేవగిరి రాజు సైన్యాన్ని కూడా కలుపుకుని సంక్రాంతి పండుగ అయిన ఐదవనాడు ఓరుగల్లు కోటని ముట్టడించాడు మాలిక్ కాపర్.. ఇరవై రోజులు భీకర యుద్ధం జరిగింది.
   ఢిల్లీ సైనిక బలం అనంత సముద్రం లాగ.. అలలై ఎగసి పడుతూనే ఉంది. వారి సంఖ్య ముందు కాకతీయ సైనికులు పిల్ల కాలువల్లాగ పక్కకి పారిపోసాగారు.
   సిరిపురం, హనుమకొండ కోటలు ముష్కురుల స్వాధీనాలయ్యాయి.
   వరంగల్ కోట మాత్రం దుర్భేధ్యమై మాలిక్ కాపర్ చేత చిక్కలేదు. కోట గోడ మీద వందల మంది విలుకాళ్లు, ఢిల్లీ సైన్యాన్ని తరిమి కొడుతున్నారు ప్రతీ రోజూ. సూర్యోదయం అవుతూనే సైనికులు కోటకి రావడం.. చావు దెబ్బలు తిని పారిపోవడం..
   కాకతీయులకి ఎత్తైన కోటగోడ.. దాని మీది బురుజులు సానుకూలమయ్యాయి. వాళ్ల గురి అరుదుగా తప్పు తోంది. పగ వాళ్ళ బాణాలు బురుజులకి తగిలి వాన చినుకుల్లా కిందికి రాలి పోసాగాయి.
   రోజు రోజుకీ వందల కొద్దీ శతృ సైనికులు కూడా చినుకుల్లాగే రాలిపోతున్నారు.
   ఇది పని కాదనుకుని వ్యూహం మార్చాడు మాలిక్ కాపర్.
   మరునాడు కోట వద్దకు ఒక్క సైనికుడు కూడా రాలేదు. కాకతీయులు ఆశ్చర్యపోయి.. ఒక్క క్షణం శతృవు వెన్ను చూపాడేమో అనుకున్నారు. కానీ మాలిక్ కాపర్ అంత సులభంగా ఓటమి ఒప్పుకోడని కాకతీయ సేనానులందరికీ తెలిసినదే.
  వారి ఊహ, వారి భయం నిజమే.
  కర్కోటకుడైన కాపర్ పట్టణంలోని ప్రజల మీద పడ్డాడు.

   ఆక్రందనలు.. నేల దద్దరిల్లిపోయేలాగ వినిపిస్తుంటే భూమాత విలవిల్లాడి పోతోంది.
   పసిబిడ్డల రోదనలు చెవులు పగిలేలా వినిపిస్తుంటే ఆకాశం ఆక్రోశిస్తోంది.
   స్త్రీలు జుట్లు విరబోసుకుని వీధులలో పరుగులు పెడుతుంటే..  వెంట వెంట తరుముతూ తురుష్క సైనికుల వికటట్టహాసాలు చేస్తున్నారు.. రోజుకి లెక్కింపలేనన్ని మాన భంగాలు.. అన్నన్నే అమాయకుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
   ధాన్యాగారాల దోపిడీలు. ఇళ్లల్లో జొరబడి, వృద్ధులని బైటికీడ్చి ఎత్తి బట్టల మూటల్లా విసిరెయ్యడాలు.. నిత్య కృత్యాలైపోయాయి.
   అందరూ ఎక్కడెక్కడో దాచుకున్న నాణాలను, ఇళ్ళన్నీ చిందర వందర చేసి బయటికి లాగి వీధుల్లో చెల్లా చెదురుగా చల్లి.. ఏడుస్తున్న బడుగు జనం చేతనే ఏరించి, మూటలు కట్టించి తమ వీపుకు కట్టించు కుంటుంటే.. నిస్సహాయతతో నేల కొదిగి పోతున్నారు అమాయకులు.
   స్త్రీలు.. యుద్ధ వాతావరణం ఎదుర్కొనడానికి, నేల మాళిగల్లో దాచుకున్న నగలను మొరటుగా ఉన్న తమ మెడల్లో వేళ్ళాడేసుకుని, అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతున్నారు.
   పంటల మీదికి అడవి జంతువుల్లా పడి తొక్కి సర్వనాశనం చేస్తూ.. ప్రజలని బలవంతంగా రప్పించి, వినోద కార్యక్రమంలా ఆనందించ మంటున్నారు.
   నాలుగు రోజులు గడిచాయి.. ఓరుగల్లు, హనుమకొండ.. పరసరాలలో ఉన్న పల్లెలు.. స్మశానాల కంటే హీనంగా తయారయ్యాయి. బ్రతికి ఉన్న శవాల్లాగ తిరుగుతున్నారు ప్రజలు.
                                 ……….
   ప్రతాపరుద్రునికి ఇంక తట్టుకొనగల శక్తి నశించింది.
   ఏ పాపం ఎరుగని.. అన్నెం పున్నెం ఎరుగని ప్రజలు.. వారినెందుకు బాధించాలి?
  వారికి ప్రతాపరుద్రుడు రాజైతేనేం.. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజైతేనేం.. వారికి కావలసింది, కడుపునిండుట.. కంటినిండా నిదురించగల రక్షణ.
   రాజీకి రాక తప్పలేదు రాజునకు.
   కాపర్‍కి కబురు చేశాడు.. కప్పం కడతానని.. సువిశాల కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి, అల్లావుద్దీన్ ఖిల్జీకి సామంతులుగా ఉంటారనీ..
   అపార ధనరాశులను వెయ్యి ఒంటెలమీద ఢిల్లీకి తరలించాడు మాలిక్ కాపర్. ఏనుగులను, అశ్వాలను, ఒంటెలను తోడ్కొని విజయ కేతనం ఎగరేస్తూ ఢిల్లీ పయనమయ్యాడు.
   మాలిక్ కాపర్‍కు ఘనస్వాగతం లభించింది అల్లావుద్దీన్ ఖిల్జీ కోటలో!
   అప్పుడే కాకతీయ సామ్రాజ్య పతనానికి నాంది పడింది.

……… ( ఇంకా వుంది) ………..

 

 

 

 

.... మంథా భానుమతి