Facebook Twitter
పొగడ్తా? అభినందనా?

పొగడ్తకి .. అభినందనకి తేడా ఏంటో తెలుసుకుందాం.. వైభవపురం జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేసేవాడు ఉత్తముడు.  జమీందారు విశ్వాసాన్ని  పొందిన ఉద్యోగుల్లో అతనొకడు.    ఒకరోజు  ఉత్తముడి  కొడుకు సూర్య   దివాణం చూడడానికి వస్తానంటే  అతణ్ణి తనతో తీసుకెళ్లాడు.  అతడికి పన్నెండేళ్ళు వయస్సు.  కానీ   చురుకైనవాడు.   వాళ్లిద్దరూ వెళ్లేసరికి జమీందారు  ఎవరో కొత్త వ్యక్తితో  మాట్లాడుతున్నారు.  జమిందారుకు నమస్కరించి   విధి నిర్వహణలో నిమగ్నమయ్యాడు  ఉత్తముడు. కొడుకును ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు.  అప్పుడే  గ్రామస్తుడొకడు వచ్చి   జమీందారుకి నమస్కరించి   ఇంట్లో బియ్యం నిండుకున్నాయని , సాయం చెయ్యమని   కోరాడు. పది రోజులకు సరిపడే  బియ్యం   అతడికివ్వమని సిబ్బందిని    ఆదేశించాడు జమీందారు.  జమీందారుకి నమస్కరించి వెళ్లిపోయాడు గ్రామస్తుడు.    

జమీందారు  పక్కనున్న వ్యక్తి   మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు దేవుని చూసినట్టుంది.  దాన కర్ణుడు, శిబి చక్రవర్తి,  బలి చక్రవర్తి అంశతో పుట్టారు తప్ప మామూలు మనిషి  కాదు మీరు.   చేతికి ఎముక లేదన్నట్టు దానం చేయడం మీ దగ్గరే  చూశాను.  మీవంటి దానశీలితో మాట్లాడడం  సంతోషంగా ఉంది .  మిమ్మల్ని పొందడం  మీ ప్రజల అదృష్టం  అన్నాడు.   అతడి మాటలకు  జమీందారు   సంతోషించాడు.  అంతటితో ఆగకుండా   మీరు చేసిన దానధర్మాల గురించి బయటకు చెప్పకపోవడం గొప్పతనం. మీ వంటి  గుప్తదానాలు చేసేవారిని  ఇంతవరకు చూడలేదు   అన్నాడు. జమీందారు  సంతోషం రెట్టింపు అయింది. 
అంత చిన్న సాయానికి  అదే పనిగా జమీందారుని పొగడడం ఉత్తముడికి నచ్చలేదు.  సొంత  పనేదో చేయించుకోవడానికి అతడొచ్చాడని గ్రహించాడు.     పొగుడుతున్న  వ్యక్తిని   చూసి   జమీందారు గారికి పొగడ్తలు  నచ్చవు.   ఇక ఆపండి  అన్నాడు ఉత్తముడు. 
ఆ వ్యక్తి ముఖం మాడిపోయింది.  అతడిని ఆపి మంచి పని చేశావన్నట్టు  ఉత్తముడివైపు  మెచ్చుకోలుగా చూశాడు జమీందారు. 

 కాసేపటికి అక్కడకి కొందరు వ్యక్తులు  వచ్చి,   జమీందారుకి నమస్కరించి వాళ్లలో ఉన్న  మల్లయోధుడిని  చూపిస్తూ   ఇతడి పేరు భీముడు. మొన్న రాజధానిలో  జరిగిన  మల్ల యుద్ధ పోటీలలో ప్రథమ బహుమతి పొందాడు. అంతేకాకుండా  తిరుగు ప్రయాణంలో  బాటసారులను  దోచుకుంటున్న  దొంగల ముఠాను  ఎదిరించాడు.   ఎందరో బాటసారుల ధన.. మాన ప్రాణాలను కాపాడాడు. అతడిని   మీ చేతుల మీదుగా సత్కరించాలని  తీసుకొచ్చాము  అన్నారు.   వారి మాటలకు జమీందారు సంతోషించి   భీముడు వంటి మల్లయోధుడు మా దివాణంలో  ఉండడం  అదృష్టం.  అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నాను.  మరెందరో  యువకులు  భీముడిని ఆదర్శంగా తీసుకొని మల్ల యోధులు, సైనికులుగా మారాలి. అందుకని భీముడి సన్మానం   నాలుగు గోడల మధ్య కాకుండా విశాలమైన వేదిక మీద.. ప్రజల మధ్య జరిపిద్దాం  అని వాగ్దానం చేసాడు.  ఉత్తముడు వారి  మధ్యకు వెళ్లి   జమీందారు  చెప్పినట్టు  భీముణ్ణి ఘనంగా  సత్కరించాలి.   ప్రజల మధ్య సత్కరించడమే అతడికి  సరైన గౌరవం. ఆ సన్మానం చూసి మరెందరో  యువకులు ప్రేరణ  పొందాలి. మల్ల వీరులు కావాలి. భీముడి  ధైర్య సాహసాలను వర్ణిస్తూ   గొప్ప  సన్మాన పత్రం కవుల చేత రాయించి బహూకరిద్దాం. తదుపరి  ఏర్పాట్లన్నీ పూర్తి  చేసి మిమ్మల్ని పిలుస్తాం  అని చెప్పాడు.  భీముడి అభిమానులు సంతోషంగా    వెళ్లిపోయారు. 

ఉత్తముడు  తిరిగి ఆసనం దగ్గరకు వచ్చి కూర్చోగానే సూర్య  నాన్నా   నాదొక సందేహం. ముందొక  వ్యక్తి  జమీందారు దానగుణం గురించి మాట్లాడుతుంటే  పొగడ్తలు ఆపమన్నారు. ఇప్పుడు భీముడి ధైర్య సాహసాలను అదే పనిగా మీరు పొగిడారు.  ఎందుకలా  అనడిగాడు. 
ఉత్తముడు  మొదట మాట్లాడిన  వ్యక్తిది  కేవలం పొగడ్త.  అందుకే  వద్దన్నాను. భీముడు గురించి మేము మాట్లాడింది అభినందన.  ఇది తప్పు కాదు  అని వివరణ ఇచ్చాడు.  పొగడ్తకి,  అభినందనకి తేడా ఉందా?  రెండూ ఒకేలా  ఉన్నాయి కదా అనడిగాడు సూర్య . 
ఉత్తముడు అవసరమైన దానికంటే  ఎక్కువగా వర్ణించి ఎదుటి వ్యక్తిని మునగ చెట్టు ఎక్కించడం పొగడ్త. అవతల వారి నుండి ఏదో ఆశించైనా లేదంటే    పని జరిపించుకోడానికైనా  అలా పొగుడుతారు. నిజానికి  జమీందారు చేసిన  చిన్న సాయానికి అంత పెద్ద పొగడ్త  అక్కరలేదని భావించాను. అందుకే  అతణ్ణి వారించాను అని చెప్పాడు. అభినందన కూడా  మునగ చెట్టు ఎక్కించడం లాగే అనిపించింది  అన్నాడు  సూర్య. 
ఎంతమాత్రమూ కాదు. మల్ల యోధుల పోటీల్లో  ప్రథమ బహుమతి  పొందిన భీముడి ప్రతిభను,  బాటసారులను కాపాడడం కోసం  ప్రాణాలకు తెగించి  పోరాడిన అతడి  ధైర్యసాహసాలను తప్పక ప్రశంసించాలి.  సమాజం కోసం పాటుపడే వారిని అభినందించినప్పుడే వారి  సేవలకు తగిన  గుర్తింపు దొరుకుతుంది. అందుకే  జమీందారుతో పాటు నేనూ  అభినందించాను. అభినందన అంటే ఉన్నదానికి విశేషణాలు అద్దటం . నిజానికి మంచి పనికి అభినందన ఎంతో అవసరం.  వారికి ప్రోత్సాహం అవుతుంది.  మరెన్నో మంచి పనులు చేయడానికి దోహదపడుతుంది.   భీముడిని చూసి మరెందరో   ప్రేరణ పొందుతారు  అన్నాడు  ఉత్తముడు. అయితే పొగడ్త మంచిది కాదా” అనడిగాడు సూర్య. గోరంతలు కొండంతలుగా చూపడమే పొగడ్త. అది మనిషి ఎదుగుదలకు అవరోధం అవుతుంది.  అహంభావం పెరగడానికి కారణమవుతుంది.  కాబట్టి పొగడ్త స్వీకరించకూడదు అని బదులిచ్చాడు  ఉత్తముడు. 

ఇప్పుడు నాకు పొగడ్తకి,  అభినందనకి తేడా తెలిసింది. చిన్న చిన్న విషయాలకు లభించే పొగడ్తలకి పొంగి పోకుండా కష్టపడి చదివి గొప్ప స్థాయికి వెళతాను.  అప్పుడు మీ నుండి  అభినందన అందుకుంటాను  అని చెప్పాడు సూర్య.దాంతో   ఉత్తముడు..  సూర్య  తల  నిమురుతూ సంతోషం వ్యక్తపరిచాడు. ప్రతి ఒక్కరు  పొగడ్తల వాళ్ళ నష్టమే తప్ప ఒరిగేది  ఏమి లేదని తెలుసుకోవాలి.