Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” ఎనిమిదవ భాగము


“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” ఎనిమిదవ భాగము



 ఎర్రపోత సూరి మనవడిని ఆప్యాయంగా చూసి కొనసాగించాడు.
   "అదే.. పరి పరి విధముల చింతించాడు తిక్కన. ఎవరిని సాయమడగాలి? తిక్కరాజ సోదరుల కంటెను బలవంతులయి ఉండవలె. మనుమసిద్ది యన్ననూ, రాయబారమేగుచున్న తాను యన్ననూ ఇఛ్ఛ కలిగి యుండవలె. తమ మీద గౌరవముండవలె.
   ఇంకెవరున్నారు.. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు దక్క..
   తిక్కనగారు ఓరుగల్లు పట్టణమునకు తరలి వెళ్ళారు.
   ఊరు చేరుటకు కొన్ని యోజనములు ముందే కాకతీయ ప్రభువుల సభలోని పండితులు ఒక్కొక్కరూ ఎదురు వెళ్లి చందన తాంబూలాది సత్కారాలను అంద చేశారు.
   వేర్వేరు పురముల నుంచి తిక్కనార్యుడు వచ్చుచున్నాడన్న వైనము వినిన విద్యార్ధులు కొల్లలుగా వచ్చి, ఒక్కొక్కరు కావ్యముల లోని శ్లోకాలను, వివిధ విధములుగా వినిపించారు. అందరినీ ఆప్యాయంగా పలుకరించి ఠీవిగా పట్టణ ప్రవేశం చేశారు ఉభయకవి మిత్రుడు, తిక్కన సోమయాజి.
  
   తిక్కన సోమయాజి రాక, విద్యార్ధుల కవితా పఠనమప్పుడే్ గణపతి దేవుని చేరింది.
   గణపతి మహారాజు సన్నాయిలు, శంఖాలు మొదలైన మంగళ వాద్యాలతో ఎదురేగి స్వాగతం పలికాడు. తిక్కన సోమయాజి, వేదశాస్త్ర విద్యా పారంగతుడు. ఉభయ భాషల్లోనూ, సమస్త విద్యలలోనూ ప్రవీణుడు. మనుమసిద్ధి రాజుకి మహా మంత్రి.
   మహారాజు ఎదురేగి స్వాగతం పలికి ఉచితాసనాసీనుడ్ని చెయ్యడంలో వింత ఏముంది?
   దివ్యవస్త్రములు సమర్పించి, సుగంధ పుష్ప మాలాలంకృతుడ్ని చేశాడు మహారాజు, మహాకవిని.
   తిక్కసోమయాజి.. సమస్త శాస్త్రాలని ఔపోసన పట్టాడు. వానిలోని అద్వైతాన్ని, ఉత్తమ జీవనాన్ని.. రాజనీతి, పురాణ కథలు కలిగిన భారతాన్ని.. అందులోని వీరులు చేసిన యుద్ధ పర్వాలని కళ్లకి కట్టినట్లు ప్రతి దినమూ ఆయన చేతనే చెప్పించుకున్నాడు గణపతి దేవుడు. అంత కన్ననూ అదృష్ట మేముంది?
   కానీ ఆశువుగా చెప్పిన ఆ భీకర వర్ణనలు వింటేనే వణుకు పుట్టించేట్లున్నాయి.
   విరాట పర్వంలో కీచక వధ.. మానవ మాత్రుడెవ్వడూ ఊహించలేని విధంగా..
   "మస్తకమును దీన దీర్ఘ భుజశాఖలు పాద యుగంబు మేని లోనికి జొర నుగ్గుగా దునిమి.."
   దుశ్శాసనుడిని చంపిన విధమయితే మరీ భయంకరం.
   అతడు సభలోన చేసినదానికి వడ్డీతో సహా వడ్డిస్తానని చెప్పి మరీ చేశాడు.
   "ఏ నురము వ్రచ్చి నెత్తురు- తేనియ ఇది త్రావెదన్.." అంటూ,
  "తల్లి చన్నుల పాలేను త్రావ నెట్టు
   లాననే పలుతెరగుల తేనియలును"
   అన్నట్లు దోసిటితో నెత్తురు త్రాగి, రుచికి మెచ్చుకున్నాడట. అది చాలదన్నట్లు నెత్తురు ముఖము మీద, ఒంటి మీద కూడా చల్లుకుని వికటాట్టహాసం చేశాడట.
   ఆవేశంలోచేశాడే కానీ ఆ తరువాత సిగ్గుపడ్డాడు.. అంత రాక్షసంగా ఏవిధంగా ప్రవర్తించానా అని. ఆ విషయమే స్త్రీ పర్వంలో గాంధారి అడిగింది.
   "వైరి నని జంపుదురుగాక వ్రచ్చి నెత్తు
    రెత్తికొని క్రోలు క్రూరాత్ము లెచటనైన
   నెన్నడేనియు గలిగిరే యీవుదక్క
   నది వృకోదర వృకవిధ మసురభంగి."
   దానికి భీముడు
   "ఆ సభలోనికి ద్రుపదాత్మజని ఒడిసి పట్టుకొని తెచ్చి అవమానించినప్పుడు చేసిన ప్రతిజ్ఞకై, పెదవికి నెత్తుటిని తాకించితి నంతియే.. సైనికుల భీతి కొల్పుటకే ముఖమునకు రక్తం పూసుకొంటిని.. కానీ అనుజుని రక్త పానం చేసేటంటి వెర్రిని కాదు" అంటూ సమాధాన మిచ్చాడు.
   అనేక యుద్ధములు చేసిన గణపతి దేవ చక్రవర్తి కనుక తిక్కనగారి వర్ణనని, కవి కంఠస్వరముననే వింటూ తట్టుకోగలిగాడు కానీ, మరొకరికి అంతటి గుడె దిటవు ఉండదు.
   "ఆ విధముగా భారతాన్ని వినిపించుటయే కాదు.. తిక్కనార్యుడు శైవమతాన్ని కూడా శక్తి కొలదీ వ్యాపింప జేశాడు ఓరుగల్లులో" అని ఒక కవి తన ద్విపద కావ్యంలో వ్రాశాడు.
   ఓరుగల్లు, సబ్బినాడు ప్రాంతాలలో ఆ కాలంలో జైన, బౌద్ధ మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జిన ధర్మాలనీ, బౌద్ధ ధర్మాలనీ పాటించడం.. ఆది పురాణ కావ్యాన్ని పఠించడం నిత్య కృత్యాలుగా ఉండేవి.
   గణపతి దేవ మహారాజు తిక్కనార్యుడు  వచ్చినప్పుడు జినాచార్యులతోనూ, బౌద్ధమతా చార్యులతోనూ చర్చావాదన పెట్టించాడట. వారి వారి మత ప్రాచుర్యం చెయ్యడంలో బహు సమర్ధులు ఆ ఆచార్యులు.
   శాస్త్ర, సిద్ధాంత, ఇతిహాస పరంగా.. వేదసార ముఖస్తా వారిని ఓడించాడు తిక్కన."
   ఎర్రపోతన మౌనం వహించాడు కొద్ది సేపు. ఎర్రన తల ఎత్తి చూశాడు.
   అక్కడే చెంబులో ఉన్న మంచి తీర్ధం తీసి ఇచ్చాడు. తాతగారి కన్నులు చెమర్చడం చూశాడు. ఆందోళనగా లేచాడు. ఆరోగ్యానికేమైనా..
   "ఏమయింది తాతగారూ?" దగ్గరగా వెళ్ళి, నుదుటి మీద చేయి ఉంచి చూశాడు. చెయ్యి పట్టుకుని నాడి పరిశీలించాడు. తేడా ఏమీ కనిపించలేదు. మరి.. అలసట అయిందా..
   తన ఉత్సాహంలో పెద్దాయన వయసు గమనించకుండా ఇబ్బంది పెట్టేశాడా? ఎర్రనకి ఏమి చెయ్యవలెనో అర్ధం అవలేదు.
   పిల్లవాని బెదురు, భయం చూసి ఎర్రపోతసూరి ఏమీ ఫరవాలేదన్నట్లు చెయ్యి ఊపాడు.  కొద్ది సమయంలోనే తేరుకుని.. అనవసరంగా ఉద్వేగానికి లోనయి బాలుని బెదరగొట్టాననుకుని.. గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, తేరుకుని.. ఎర్రన్నని కూర్చోమని సైగ చేశాడు.
   "ఏమీ లేదు నాయనా! నాకేం గాలేదు. జైన బౌద్ధ ఆచార్యులని ఓడించాక తిక్కనార్యుడు చేశాడని చెప్పిన పనులే నన్ను ఉద్వేగానికి గురి చేశాయి. నాకేమీ అస్వస్థత లేదు."
   "ఏమి చేశారు తాతగారూ? ఎవరు చెప్పారు?"
   "మా తాతగారి సమకాలీకులు అనేవారు. తిక్కనగారు నిజముగా చేయించారో లేదో తెలియదు. బౌద్ధ జైనుల వసతులన్నీ మట్టు పెట్టించారట. వారి దైవాల పేర్లని అణచారట. వాళ్లను ఆ సీమనుంచి వెళ్ళ గొట్టించారట. అందరు జైనులను నరికించి చంపించి సురుచిరోద్దండ భీమ పరాక్రమ బిరుదులతో సత్కరింప బడ్డారుట.
   నాకు ఎందువలననో నమ్మ శక్యముగా లేదు. పాండ్య రాజులు ఆ విధంగా చేసి శైవ మతోద్ధరణకి కంకణం కట్టుకున్నారని అందరికీ తెలుసును. వారి అనుయాయులే ఆపని చేయించి ఆచార్యుల మీదికి పెట్టారేమోనని నా అనుమానం. యుద్ధపర్వంలో భీషణ సంగ్రామ వర్ణనలు చేసిన మాత్రమున, నిజ జీవితంలో ఆ విధముగా చేయించ గలరని లేదు కదా! శివానంద లహరి రచించిన ఆదిశంకరులు విష్ణు సహస్రనామ భాష్యం కూడా రచించారు. అద్వైత సిద్ధాంతం ప్రచారం చేసిన వారు ఏ విధమైనట్టి హింసనైనా ప్రోత్సహిస్తారని నేననుకోను."
   "అంతే అయుంటుంది తాతగారూ! వేరెవరో చేసి ఆచార్యులని బాధ్యులని చేసి ఉండవచ్చును." ఎర్రన సాంత్వన పరచాడు తాతగారిని.
   "సరే! ఆ సంగతి వదిలేద్దాం. గణపతి దేవ చక్రవర్తి తిక్కన సోమయాజి పాండిత్యానికి మెచ్చి, చీని చీనాంబరాలు, విలువైన ఆభరణాలు అత్యంత ప్రేమతో అందించాడు.

 

తిక్కన అదే ప్రేమతో అందుకున్నాడు కానీ మోము మాత్రం చింతా క్రాంత మయి ఉంది. పెదవులు నవ్వుతున్నాయి కానీ కన్నులలో అంతులేని విచారం. అది చూచిన చక్రవర్తికి తిక్కన సోమయాజి మనసులో ఏముందో.. ఆయన రాకకి కారణమేమో అర్ధమయింది. అయిననూ కవి హృదయం తెలిసి కొనవలెనని అడిగాడు,
   "ఆచార్యా! మీరు సత్ప్రవర్తకులు. సత్య సంధులు. మీ విచారణకీ, మీ రాకకీ కారణమేమో చెప్పరా?"
   "మహారాజా! మీకు వేగుల ద్వారా తెలిసియే యుండును. సూర్యవంశపు రాజు మనుమసిద్ధి. నెల్లూరు సీమను జన రంజకంగా పాలిస్తున్నాడు. రాజ్యం సర్వ సుభిక్షంగా ఉంది. దేశం మొత్తం మీద అక్కడే పచ్చని పంటలు గణనీయంగా పండుతున్నాయి. నా వంటి కవులను ప్రోత్సహించి ఆ చదువుల సరస్వతిని కూడ ఆరాధిస్తున్నాడా నృపుడు. అటువంటి రాజుని దగ్గర బంధువులే.. అయ్యన్న బయ్యన్నలు ఆ చోడ రాజుని పదవీ భ్రష్టుడిని చేసి అడవుల పాల్జేశారు. వారు చాలా బలము కలవారు. మనుమ సిద్ధి మహరాజుకి ఒక్క కాసు కూడా ఇవ్వకుండా హీనంగా చూస్తున్నారు.
   ఆ అన్న దమ్ములను దండించి సిద్ధి మహరాజు నెల్లూరును వారికిప్పించు. ఇదియే నా రాకకు మూల కారణము." తిక్కనార్యుడు చక్రవర్తికి వార్త చేరవేసి, తన అభ్యర్ధనని వినిపించాడు.
   "మీరు నా కానుకలు తీసుకొని వెడలండి. మీ వెనుకే మా సేనలు వచ్చి మీ రాజుకి పట్టం కడతాయి."
   అన్నమాట నిలుపుకున్నాడు గణపతి దేవ చక్రవర్తి.
   తిక్కనగారిని, మనుమసిద్ధి మామా అని పిలిచినందుకు అల్లుని మరల రాజుని చేశారు తిక్కనగారు.
   కాకతీయుల సామంతుడిగా మనుమసిద్ధి నెల్లూరు సీమని ఏలాడు. ఆ సమయం లోనే తిక్కనగారి మహాభారత రచన సాగింది.  తమకు చేసిన సహాయానికి మారుగా నన్నయగారి భారతంతో సహా, తన పదిహేను పర్వాల ప్రతినీ గణపతిదేవ చక్రవర్తికి కానుకగా పంపాడు తిక్కనార్యుడు.
   రుద్రమదేవి యుద్ధరంగంలో మరణించడం, ప్రతాపరుద్రుడు చక్రవర్తిగా పూర్తి బాధ్యత స్వీకరించడం.. తన రాజ్యాన్ని సుస్థిర పరచుకోవడంలో అతడు తల మునకలుగా మునిగి ఉన్న రాజ్య సంక్షోభంలో అది మన వద్దకు చేరింది.
   ఆ మహా గ్రంధానికి ప్రతిని తయారు చెయ్యడం మనం తక్షణం చెయ్యవలసిన కర్తవ్యం."
                                     
                                           5 వ అధ్యాయము.

   సూరన్న వస్తున్న మేనా ఇంటి వద్ద ఆగిన వెను వెంటనే, ఎదురు వెళ్లి కాళ్లు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి, పొడి వస్త్రమును భుజము మీద నుంచుకుని, వినయంగా నిలిచాడు ఎర్రన.
   ప్రసన్న వదనంతో పుత్రుని చూచి, పాద ప్రక్షాలన చేసికొని ఇంటి  లోనికి అడుగుపెట్టాడు సూరన.
   ఆతృతగా వచ్చింది పోతమాంబ పెనిమిటి వద్దకు.. దేశంలో యుద్ధ వాతావరణం.. అది సామాన్య ప్రజల మీద ఎంత వరకు ప్రభావం చూపుతుందో!
   ఎంత తొందర ఉన్ననూ, వచ్చిన వెంటనే ప్రశ్నలు సంధించడం అనుచితం. ముందుగా.. ఎంత ఆకలిగా ఉన్నారో ఏమో!
   భోజనానంతరమే ఏది అడిగినా.. అప్పటి వరకూ ఆగ వలసిందే.
   నవ్వుతూ పలుకరించి స్నానానికి అన్నీ ఏర్పరచింది.
   ఆదరించే ఇల్లాలు ఉంటే ఎంతటి అలసటైననూ అరక్షణంలో మాయమై పోదూ! తైల మర్దనం చేసి వేడి వేడి నీటితో స్నానమాచరించి వచ్చాక సూరన్నకి ఎంతో ఉపశమనం కలిగింది.
   దారిలో ఒక్క సారిగా లేచిన సుడిగాలితో శరీరమంతా దుమ్ము దుమ్ము కొట్టుకుని పోయింది. మేనాకి కట్టిన తెరలు కొంచెం కూడా ఆపలేకపోయాయి. అంతటి ఎదురు గాలిలో బోయీలు ఏ విధంగా తీసుకుని వచ్చారో.. అబ్బురమే!
   సూరన్న నట్టింటిలోనికి వెళ్లే లోపుగా పేరమ్మ అంతా సిద్ధం చేసింది. లేత అరిటాకుల్లో తీరుగా పదార్ధములు అమర్చి ఉన్నాయి. ఎర్రపోతన, ఎర్రన తమ ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. సూరన్న ఇరువురికీ మధ్యనున్న తన ఆసనం మీద కూర్చోగానే, పేరమ్మ విసిని కర్ర పట్టుకుని, ప్రక్కనే కూర్చుని విసర సాగింది.
   పోతమాంబ వడ్డన ప్రారంభించింది. ఔపోసన పట్టాక, విస్తరి చుట్టూ నీళ్ళు చల్లి, ముమ్మారు తీర్థం తాగి.. అభికరించాక ఒక ముద్ద కళ్ళ కద్దుకుని పక్కన పెట్టి, పరబ్రహ్మ స్వరూపమైన అన్నమును మూడు మారులు కొద్ది కొద్దిగా నోట నుంచి.. భోజనానికి ఉపక్రమించారు ముగ్గురూ.
   పొగలు కక్కుతున్న వరి అన్నంలో, పప్పు వేసుకుని, నేతితో కలిపి.. కమ్మని పులుసుతో తినడం ప్రారంభించారు ఎర్రపోతనాదులు.
   కుమారుడు మూడు రోజుల నుండీ.. ఎక్కడెక్కడ ఏమి తిన్నాడో.. కడుపు నిండిందో లేదో! అతడికి ఇష్టమైన సొరకాయ పులుసులో పప్పు అన్నం నంజుకుని తింటుంటే ఆనందంగా చూస్తూ నెమ్మదిగా విసర సాగింది పేరమ్మ. రెండు రకముల కూరలు, ఊరగాయ, పెరుగు, గుడాన్నం, అరటి పండుతో తృప్తిగా భోజనం ముగించి లేచారు మూడు తరాల శాస్త్ర కోవిదులూ.
   అత్తాకోడళ్లు కూడా భర్తలు తిన్న విస్తరి మీదనే మరొక అరిటాకు వేసుకుని, కావలసిన పదార్ధములు వడ్డించుకుని భుజించి లేచారు. వంటిల్లు, నట్టిల్లు శుభ్రం చేసుకుని.. వెండి పళ్లెరంలో తాంబూలం సరుకులన్నీ తీసుకుని, ముందటింట్లోకి నడిచి, విశ్రమిస్తున్న తండ్రీ కొడుకుల వద్దకు చేరారు.
   ఆకులకు ఈనెలు తీస్తూ.. అప్పుడు అడిగింది పేరమ్మ,
   "రాజుగారు పిలిపించిన వైనమేమి సూరన్నా?"
   సూరన్న కొద్ది సేపు మౌనం దాల్చాడు. కర్పూర విడెం తీసుకుని నోటనుంచి నములుతూ, కన్నులు మూసి ఆలోచనలో పడ్డాడు. అందరూ ఆతృతగా అతని వంకే చూస్తున్నారు.
   పోతమాంబ చేతిలోని వెండి గిన్నె కింద పడి దొర్లుకుంటూ ద్వారం వద్దకి వెళ్ళిపోయింది.
   ఉలిక్కి పడి లేచాడు సూరన్న. ఒక్క నిమేషం ఎక్కడున్నాడో అర్ధం కాలేదు.
   "అబ్బాయీ.. సూరనా!" మార్దవంగా పిలిచాడు ఎర్రపోత సూరి.
   "ఏం జరిగింది? ప్రభువులు కుశలమే కదా!"
   "కుశలమే. జరుగుతున్న రాజకీయ చరిత్ర తెలిపారు ప్రభువులు. కాకతీయ సామ్రాజ్యం సుస్థిరత నిలుపుకునే ప్రయత్నం లోనుంది తండ్రీ! ప్రతాప రుద్ర చక్రవర్తి దిగ్విజయ యాత్ర తూరుపు దిక్కున సఫల మయినట్లే. దక్షిణా పధమంతా కాకతీయ సామ్రాజ్యం విస్తరించింది. అంబదేవుని, యాదవ రాజును రుద్రమదేవి వీర మరణానంతరం తదుపరి యుద్ధంలోనే అణచి వేసి రాజ్యంలో ఉద్రిక్తతను తగ్గించారు.
   ఆ పిదప చక్రవర్తి కాశీకి వెళ్ళి మణికర్ణికా ఘట్టంలో స్నాన మాచరించి విశ్వేశ్వరుని భజించాడు. గయకు కూడా నేగి అక్కడ ఏలికైన సుల్తాను పూజలందుకుని పెద్దలకు పిండప్రదానములు చేశాడు. వింధ్య దాటి గోదావరీ తీరం ప్రవేశించి అక్కడ పన్నెండ్రు క్రతువులు చేయించాడు. కాళేశ్వరమునకేగి ముక్తీశ్వరుని దర్శించాడు. కోటి సువర్ణముల దానం, రెండువేల మంది విప్రుల వివాహాలు చేయించాడు.
   పన్నెండు సంవత్సరములు చక్రవర్తి దిగ్విజయ యాత్రలో నున్నప్పుడు, తమ్ముడు అన్నమదేవుడు రాజ్య పరిపాలన సాగించాడు. ప్రజల మన్ననలందుకున్నాడు.
   తిరిగి వచ్చిన ప్రతాపరుద్రుడు జన రంజకంగా పాలన కొన సాగించాడు. తల్లి ముమ్మమ్మ దేవిని జాగరూకతతో చూసుకుంటూ ఉన్నాడు. పట్టపురాణి విశాలాక్షికి విరూపాక్షుడు, వీర భద్రుడు అను పుత్రులిరివురు కలిగారు.
   డెబ్భయ్యేడు మంది నాయంకరులను తీర్చి దిద్ది, వారికి సామ్రాజ్యం లోని వివిధ భాగములను అప్పజెప్పాడు. అద్దంకినేలు మన ప్రభువు కూడ ఒక  సేనా నాయకుడే  కదా.."
   "అవును.. మనం రెడ్డి నాయంకరంలోనే ఉన్నాం. అంతా సవ్యంగానే ఉంది కద.. మరి ఇప్పుడు వచ్చిన కష్టమేమి.. మనము చెయ్యవలసిని విధి ఏమి?"
  "ఇప్పుడే అసలు కష్టం వచ్చింది. ఢిల్లీ సుల్తానులు దండెత్తి వస్తున్నారు. సేనా నాయకులందరునూ అప్రమత్తులై ఉండవలసిన సమయం. మన అద్దంకి ప్రభువులు కూడా సన్నిద్ధులవుతున్నారు."
   పేరమ్మకి, పొత్తమ్మకీ గుండె జారినట్లయింది. అనుకున్నంతా అయింది.
   సజల నయనాలతో తమ ఎర్రన్న కేసి చూశారు. యువకులందరినీ యుద్ధ సన్నిద్ధులను చెయ్యడానికే పిలిచారా? ఎర్రన సైన్యంలో చేరాలా? విప్ర యువకునికి అంతటి దేహ శక్తి సామర్ధ్యాలుండునా! ఒక సారి యుద్ధానికి వెడలితే తిరిగి రాగల అవకాశమెంత..
   ఎర్రపోతన కూడా అదే భయ పడ్డాడు. అతను ఎర్రన గురించి కాక, సూరన గురించి ఆలోచించాడు. నడి వయసులో ఉన్నవాడు. శరీర ధారుఢ్యము ఉన్నవాడు. రాజాజ్ఞ పాటించక తప్పదు. వెళ్లినా మరణమే.. వెళ్లకున్ననూ మరణమే.
   ఇంకా యుద్ధానికి వెళితే, ఆయుర్దాయముంటే బ్రతికి బట్ట కట్ట వచ్చును.
   ఒక్క ఎర్రనకి తప్ప అందరికీ మొహాలు ఝడి వాన కురిసే ముందుండే ఆకాశంలాగ నల్లగా అయిపోయాయి.
   ఎర్రన ఏ కర్తవ్య మైననూ నెరవేర్చుటకు సిద్ధముగనే ఉన్నాడు.
   "ఏమయింది.. అందరూ ఎందులకు అలాగనున్నారు?" మాట్లాడడం ఆపిన సూరన్న అందరినీ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు,
   "మరి.. మరి, నువ్వు యుద్ధంలోకి వెళ్ళ వలెనా?" ఎర్రపోతన.. వణుకుతున్న కంఠంతో అడిగాడు.
   "లేక, ఎర్రన వెళ్ళాలా..." పేరమ్మ..
   ఏ క్షణంలో నైనా కన్నులు జల ప్రవాహాలగుటకు సిద్ధంగా ఉన్నాయి. పోతమాంబది కూడా అదే పరిస్థితి.
   సూరన్నకి తమ వారి ఆదుర్దా అర్ధమయింది.. ఏం భయం లేదన్నట్లు తల ఊపుతూ అన్నాడు,
  "లేదమ్మా! ఎవ్వరం యుద్ధానికి వెళ్ల నక్కరలేదు. సుశిక్షితులైన సైనికులు పది వేల మంది పైగా ఉన్నారు మన నాయకుని వద్ద. గజ బలం అశ్వ బలం సరే సరి.. కాకతీయ సామ్రాజ్యంలో ఓరుగల్లు తరువాత మనదే పెద్దది. నన్ను పిలిచిన కారణం వేరు.. ప్రభువు యుద్ధానికి వెడల వలసి వస్తే.. వస్తుంది తప్పని సరిగా.. నన్ను ఇక్కడి పాలన చూసుకోమన్నారు."
   "అంతేనా.."
   గట్టిగా నిట్టూర్చారు అందరూ.
   "అయితే అప్పుడు తరచుగా అద్దంకి వెళ్ళవలసి వస్తుంది. అంతే.."
  
    సూరన్న అద్దంకి వెళ్ళి వచ్చిన నెలలోపు గనే అందరూ భయపడిన రోజు రానే వచ్చింది. చక్రవర్తి వద్ద నుంచి వేగులు వచ్చారు... సూరన్నకి రాజుగారి నుండి కబురు వచ్చింది.
   అద్దంకి నాయకుడు అత్యవసరంగా సభ ఏర్పాటు చేసి రాజకీయ పరిస్థితులను వివరించాడు.
   "పైకి కనిపించక పోయిననూ, సామ్రాజ్యమంతా అంతర్లీనంగా యుద్ధ వాతావరణం. ఎక్కడ చూసినా భీతి.. భయం. ఇప్పటి శతృవులు.. ముష్కురుల యుద్ధనీతి వేరే విధంగా ఉంటుంది. వారికి స్త్రీలు, పసివారు, వృద్ధులు అని లేదు..
   రుద్రమదేవి మరణానంతరం సైన్యాన్ని బలపరచిన ప్రతాపరుద్ర చక్రవర్తి వ్యూహాత్మకంగా శత్రువులను అణచి వేశాడు. చక్రవర్తి పెంపొందించిన నాయంకర విధానం మంచి ఫలితాల నిచ్చింది. నాయకుల సైన్యానికి మంచి శిక్షణ నిప్పించాడు. సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు.
   మూడు దిశలలో నడిపించాడు.
   ఒకటి అంబదేవుని పైకి, రెండవది నెల్లూరి పైకి, మూడవది సేవుణ రాజ్యం పైకి.
   ఇందులూరి అన్నయ్య త్రిపురాంతకం మీదికి దాడి చేసి అంబదేవుడిని తరిమి వేశాడు.
   అడిదము మల్లు నెల్లూరు పై దండ యాత్ర చేసి అక్కడ మనుమ గండ భూపాలుని హత మార్చాడు.
   పశ్చిమాన గోన గన్నారెడ్డి, విటలుడు యాదవ రాజు అధీనంలో నున్న ఆదవాని, తుంబలము కోటలు పట్టుకుని రాయచూరు దుర్గము మీదికి దాడి చేశారు. కృష్ణా తుంగభద్రల మధ్య నున్న దేశాన్నంతనూ స్వాధీనంలోకి తీసుకున్నారు. సేవుణ రాజు దురాక్రమము నణచి రాజ్యాన్ని సుస్థిరం చేసి కొన్న ప్రతాపరుద్రుడు.. పట్టుమని ఐదేళ్లు కూడా శాంతి యుతంగా రాజ్యాన్ని ఏల లేకపోయాడు.
   మూడు ప్రక్కలా శతృవుల మదమడచిన చక్రవర్తి నాల్గవ ప్రక్క.. ఉత్తర దేశం నుంచి ఎదురైన ముప్పును ఎదుర్కొన వలసి వస్తోంది. అది తురుష్కుల వద్దనుండి.
   ఢిల్లీ వారు మన సామ్రాజ్యం పాడి పంటలతో కళకళ లాడుతుంటే చూడ లేకపోతున్నారు. అందులో హిందూ ధర్మం నలు ప్రక్కలా విలసిల్లుతోంది. దేవాలయాల పునరుద్ధరణ నిరాటంకంగా సాగుతోంది. కొత్త ఆలయాలు నిర్మిస్తున్నారు.
   ఓరుగల్లు కోట సుస్థిర మౌతోంది. అది కంటకింపుగా ఉంది.
   పరాయి దేశం వారిని, పరాయి మతస్థులని అణచడానికి మన చక్రవర్తి కంకణం కట్టుకున్నారు. మన సైన్యం కూడా తరలి రావాలని ఆదేశించారు."
   సభ అంతా నిశ్శబ్దమైపోయింది.
   "అనగా.. ప్రభువులు కూడనూ.." సూరన్న లేచాడు.
   "అవును సూరనార్యా! మేము కూడా సన్నద్ధులమవుతున్నాము.. మన గజ బలం మీది నమ్మకంతో. అందరం ఐకమత్యంగా పోరాడితేనే ప్రాచ్యుల దాడిని ఆపగలుగుతాము."
   "మరి ఇచ్చట పాలన.."
   "అందువలననే మిమ్మందరినీ సమావేశపరచాను. ఇచ్చటి కార్యక్రమాలు చూసుకొనుటలో మహామంత్రికి మీరు చేయూత నియ్యవలె. సేనా నాయకులంతా సైన్యాన్ని సిద్ధ పరచండి. ఆచార్యా! ఆడువారిని, పసివారిని, వృద్ధులను చూచుకునే బాధ్యత మీదే.
   శ్రేష్ఠి గారూ! మీరు ఆహార పదార్ధాలను భద్ర పరచమని మీ వారందరికీ చెప్పండి. సరిహద్దుకు దూరంలో ఉన్నాము కనుక మనకు అంత చేటు రాకపోవచ్చు. అయిననూ అవసరం అయినప్పుడు ప్రక్క వారికి సహాయము చెయ్యవలసి వస్తుంది.
   వీలు చిక్కింది కదా అని అధిక ద్రవ్యమునకు అమ్మవద్దు. ఇక్కడ ఇద్దరు దండ నాధులను ఉంచి వెళ్ళుతున్నాను. మేము తిరిగి వచ్చే వరకూ అద్దంకి సీమ మీ చేతనుంటుంది. అందరూ జాగరూకతతో ఉండండి."
   అద్దంకి ప్రభువు ఓరుగల్లు నుండి చక్రవర్తి వర్తమానమునకై ఎదురు చూస్తూ ఉన్నాడు.
                                     

……… ( ఇంకా వుంది) ………..

 

 

 

 

.... మంథా భానుమతి