Facebook Twitter
బహినాబాయి (1628 -1700)

 

బహినాబాయి (1628-1700)

 

ఆదేవ్, జానకి అనే బ్రాహ్మణుల మొదటి సంతానం బహినాబాయి. ఈమె పుట్టకమునుపే ఈమె గురించి ఒక జ్యోతిష్కుడు ఈమె ఒక వరాల బిడ్డ అని, ఆమె వల్ల కుటుంబానికి అదృష్టం అనీ చెప్తాడు. అలాగే ఈమె పుట్టగానే, తండ్రికి ఒక పచ్చటి గుడ్డలో చుట్టి పెట్టిన బంగారు మొహరు ఒకటి దొరుకుతుంది. దీనితో జ్యోతిష్కుడి మాటలమీద నమ్మకం కుదిరి బహినా బాయిని చాలా అపురూపంగా పెంచుతారు తల్లితండ్రులు. దేవగర్ అనే ఊరు ఇప్పటి నార్త్ మహారాష్ట్రలో బహినాబాయి బాల్యం గడిచింది. అయితే ఆమెకు మూడేళ్ళ వయసులోనే చుట్టమయిన గంగాధర్ అనే ముప్పయ్యేళ్ళ రెండో పెళ్ళివాడితో పెళ్ళి చేస్తారు. మూడేళ్ళ పాపాయి కి ముప్పయ్యేళ్ళ వరుడు. ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. అయితే పెద్దదయ్యేవరకూ తల్లితండ్రుల వద్దే పెరుగుతుంది. చిన్నపిల్లగా ఆడుకోవడంకన్నా, భక్తి, కీర్తనలు, ప్రవచనాలు ఇవే ఆమెకి ఇష్టం. ఈమె కష్టాలన్నీ కాపరం మొదలెట్టినప్పట్నుంచి మొదలవుతాయి.

బహినాబాయి రాసిన 473 అభంగ్ లలో 78 పూర్తిగా ఆమె ఆత్మకధ అంటే ఆమె 12 పూర్వ జన్మలతో సహా, ఆమె బాల్యం ఆ తరవాత జీవితం గురించి రాసినవి. అయితే ఇది కొంచం ఆశ్చర్యకరమైవ విషయం ఒక ఆధ్యాత్మికమైన, భక్తి పర మైన రచనలు చేసిన సంత్, సాధూలు ఇలా వారి ఆత్మకధ కూడా రాయడం. కానీ ఆమె రాసిన ఆత్మకధ వల్ల అప్పటి కట్టుబాట్లు, సంఘ నియమాలు, పరిస్తితుల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం కలిగింది. బహినాబాయి కధ చాలా అద్భుతాలతో కూడి, చాలా ఇంటెరెస్టింగా ఉంది. అయితే ఇప్పటివరకూ మనం చదివిన అందరి రచయిత్రుల జీవితాల్లాగే ఈమె జీవితం కూడా అదే సగటు ఆడదాని జీవితంలో ఉన్నట్టుగానే, గృహ హింస, వివక్షతొ కూడుకున్నదే.

పెళ్ళి అయిన తరవాత పది పదకొండేళ్ళ వయసులో బహీనా బాయి భర్త, కుటుంబంతో పాటుగా గోదావరి నదీ తీరంలోని మహదేవ అరణ్యంలో యాత్రికుల్లా కాలక్షేపం చేస్తూ ప్రజల దాన ధర్మాల మీద బ్రతుకుతూ ఉంటారు. అటువంటి సమయంలో బహీనా బాయి భర్తకు ఒకరు ఒక నల్ల ఆవును దానం చేస్తారు. ఆ ఆవు ఒక దూడకి జన్మ నిస్తుంది. బహినా బాయి ఈ ఆవూ దూడల సేవలో ఎంతగా మునిగిపోతుందంటే, ఆమె ఒక్క క్షణం కనపడక పోయినా అవి రెండూ ఏడ్చి గోల పెట్టేవట. వాటికి నీరిచ్చినా, గడ్డి పెట్టినా బహినా చేత్తోనే, లేకపోతే అవి తినవు. ఇక దూడ విషయానికొస్తే, అది బహినాబాయి తో పాటుగా, అన్ని ప్రవచనాలకూ, కీర్తనలకూ వెళ్ళి శ్రద్ధగా వినేదని, భజనలయ్యాకా మనుషుల్లానే అది కూడ తల నేలను తాకిస్తూ సాష్ఠాంగ ప్రణామం చేసేదని రాస్తుంది బహీనాబాయి తన ''ఆత్మనివేదన" అనే ఆత్మకధలో. ఒకసారి ఇలాంటి ప్రవచనాలు జరుగుతున్నపుడు, మనుషులు కూర్చోవడానికే చోటులేక దూడను బలవంతంగా బయటికి పంపి కట్టేస్తారు. అప్పుడు బయటనుంచి దూడ, లోపల నుంచి బహీనా ఇద్దరూ ఏడుస్తుంటే, ఏంటి ఈ గొడవ అని అక్కడ గురువు అడుగుతాడు. విషయం తెలుసుకొని అది సామాన్యమైన దూడ కాదని పూర్వ జన్మలో అది బహినాబాయి లాగానే యోగభ్రష్ట అని (యోగభ్రష్ట అంటే ముక్తి మార్గంలో చివరిదాకా వచ్చాకా, చేసిన చిన్న పొరపాటు వల్ల తిరిగి జన్మ ఎత్తిన వారట) అంతే కాక ఆ దూడే బహీనా బాయి గురువని చెప్పి దూడను తనపక్కనే కూర్చోపెట్టుకుంటాడు. ఆ విషయం విని ఆయనకు మోకరిల్లిన బహీనా బాయి తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తాడు. అయితే ఈ విషయం ఎవరిద్వారానో తెలుసుకున్న భర్త విపరీతమైన కోపంతో, ద్వేషంతో భార్య అయిన బహీనా బాయి జుట్టు పట్టి ఈడ్చి, చితకబాది అదే ఆవు దూడల దొడ్లో కట్టేసి పెడతాడు. బహీనా బాయి బాధ చూడలేని ఆవు, దూడ రెండూ కూడా ఆమెతో బాటుగా తిండి ముట్టవు. బహీనా తల్లి తండ్రులు కూడా అల్లుడికి ఎదురుచెప్పలేక నిస్సహాయంగా ఉండిపోతారు. అయితే ఈ విషయం తెలిసిన గురువు వీరింటికి వచ్చి ఆమె ఎంత గొప్పదో చెప్పి ఆమె నీ భార్య అయినందుకు నువు ఎంతో అదృష్టవంతుడివి, సంతోషించాల్సింది పోయి ఈ అమానుష కృత్యాలేంటని మందలిస్తాడు. విధి లేక వీరిని విడిచిపెట్టినా, భర్త ఆలోచనలను బహీనా బాయి ఏమాత్రం తప్పుపట్టకుండా తన అభంగ్ లలో రాస్తుంది. భర్త బాధ అంతా ప్రజలందరూ, తన భార్య దగ్గర పురాణ శ్రవణానికి వచ్చి, తమ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటూ, ఆమెను గౌరవంతో పూజిస్తుంటే నేనొక గడ్డి పోచ కన్న హీనమయిపోతాను కదా అని. ఇలాంటి భార్యతో అవమానాలు పడే కన్నా సన్యసించి ఎటైనా దూరంగా పోతానని ఆమె తల్లితండ్రులకు చెప్తాడు. పదకొండేళ్ళ వయసులో గర్భిణి అయిన బహీనా బాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. కాని ఇంకొక మాయ జరుగుతుంది ఇక్కడ. వెళ్ళాల్సిన సమయానికి భర్త విపరీతమైన కాళ్ళ మంటలతో బాధ పడి నెల వరకూ, ఆతరవాత ఇది కూడా ఆమె మహిమ అయిండచ్చని భయపడి ఆ ప్రయత్నం విరమించుకుంటాడు.

భక్తతుకారాం మనకు తెలుసు కదా, ఈయన బహీనా బాయికి సమకాలికుడు. ఈమెకి ఎప్పుడూ, విఠోబా, తుకారాం విజన్స్ వచ్చేవట. అలాంటి ఒక విజన్లోనే తుకారాం ఆమెకు జ్ఞానబోధ చేస్తాడు. అయితే ఇది కూడా భర్త గంగాధర్ కు నచ్చదు. ఎందుకంటే, భ్రాహ్మణులైన వారికి శూద్రుడైన తుకారాం విజన్స్ రావడమేంటి? జ్ఞానబోధ చెయ్యటమేంటి అని. కాని బహీనా బాయి మాత్రం తుకారాం తన గురువు అని చెప్పుకుంటుంది. ఇది భర్తతో పాటు సంఘంలోని మిగతా బ్రాహ్మణ వర్గాలకీ నచ్చదు.

అయితే మనం ఇదివరకు చదువుకున్న అక్కమహాదేవి, కన్ హొపాత్ర, జానాబాయి, ముక్తాబాయీల లాగా ఈమె సంసార జీవితాన్ని విడిచిపెట్టదు. ఒక కూతురు పుట్టాక ఆమె విరక్తితో (కొడుకు కాకుండా కూతురు పుట్టిన కారణంగా అనుకుంటా వివరణ లేదు) ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది, కానీ ఆమె మానస గురువైన తుకారాం కలలో కనిపించి నీకు ఒక కొడుకు కూడా పుడతాడు చివరిదాకా నీతో ఉంటాడు అందువల్ల నువ్వు ఆత్మహత్యకు పాల్పడవద్దని వారిస్టాడు. `ఆ ప్రకారమే ఆమెకు కొడుకు పుడతాడు తరవాత.

అయితే బహీనా బాయి జీవితమంతా, సంసారంలో పతివ్రత పాత్ర పోషించటం, విఠోబాని కొలవటం, తన సత్య శోధనల మధ్య దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియక, భర్త నుంచి సహకారం కానీ ప్రేమగానీ, అర్ధంచేసుకోవడం కానీ లేక, నలుగుతూనే వచ్చింది. ఆడదై పుట్టినందుకు మొదటి నుంచీ చివర వరకూ బాధ పడుతూనే ఉంది. కొన్ని సార్లు తిరుగుబాటు ధోరణి, కొన్నిసార్లు సర్దుకుపోయే ధోరణి. భక్తితత్వం, భర్తను గౌరవించి, భర్తనే దైవంగా కొలవాల్సిన పతివ్రతా ధర్మాల సందిగ్ధాల మధ్య ఏమీ తేల్చుకోలేక ఆమె పడిన బాధలు కూడా ఆమె రచనల్లో ప్రతిబింబిస్తాయి. మచ్చుకు ఆమె రాసిన ఈ రెండు అభంగ్ లూ చూద్దాము.

The Vedas cry aloud, the Puranas shout,

“No good may come to woman.” 

I was born with a woman's body

How am I to attain truth?

They are foolish, seductive, deceptive ---

Any connection with a woman is disastrous”.

Bahina says, “if a woman's body is so harmful,

How in this world will I reach Truth?”

 

గట్టి గట్టిగా చేసే వేద పఠనాలూ, పురాణ శ్రవణాలూ

"ఎటువంటి మేలూ చేయ లేవు స్త్రీలకు".

నేను ఒక స్త్రీ శరీరంతో పుట్టాను,

సత్యాన్ని నేనెలా శోధించగలను?

"వీరు మూర్ఖులు, మరులుగొల్పుతారు, మోసకారులు----'

వీరితో ఎటువంటి సంబంధమూ వినాశకరము.”

బహీనా బాయంటుంది, ఒక స్త్రీ శరీరమింత అనర్ధదాయకమైతే,

ఈ ప్రపంచములో సత్యాన్ని నేనెలా చేరగలనని?

వేద పఠనం, పురాణ శ్రవణం ఇవన్నీ దళితులకే కాదు, అగ్ర వర్ణాల ఆడవారికి కూడా నిషిద్ధమే. అగ్ర వర్ణాలలో ఆడవారి పరిస్తితులు కూడా దళితుల స్తితికి ఏమాత్రం తీసిపోవు. వారికి ఎదురు తిరగడానికి టార్గెట్ చెయ్యడానికి ఒక అగ్ర వర్ణం ఉంది. కానీ అగ్ర వర్ణాల ఆడవారికి సమైక్య పడటానికి కూడా అవకాశం లేదు. ఒక వైపు మేము అగ్ర వర్ణమనే అహంభావం ఇంకోవైపు ఆడవారైన కారణంగా లింగ వివక్ష. దీనికి ఇంకా చాలా కోణాలే ఉన్నాయి కానీ పర్యవసానాలు మాత్రం ఆడవారే అనుభవించారు. తనకంటే 27 యేళ్ళు చిన్నదైనా , తనకంటే పాపులర్ అవుతుందంటే తన భార్య, భరించలేని భర్త గంగాధర్ జీవితాంతం ఆమెను హింసిస్తూనే ఉన్నాడు. దేవుని మీద భక్తా, సంసారంలో పతి భక్తా అనే మీమాంసలోనె పాపం బహీనా బాయి జీవితం గడిచిపోయింది. చిన్న పాపని పెళ్ళి చేసి పంపాకా వాడు కొట్టినా, నరికినా, అడగలేని నిస్సహాయత అప్పటి సమాజంలో తల్లి తండ్రులది. అదీ ఎంతో గారాబంగా పెంచుకున్న బిడ్డ అయినా కూడా.

I'll serve my husband – he's my god ...

My husband's my guru; my husband's my way this

is my heart's true resolve.

If my husband goes off, renouncing the world,

Pandurang (Vithoba), what good will it do me to live among men? ...

My husband's the soul; I'm the body ...

My husband's the water; I'm a fish in it.

How can I survive? ... Why should the stone god Vitthal (Vithoba)

and the dream saint Tuka (Tukaram)

deprive me of the happiness I know?

నా భర్తను నేను సేవిస్తాను --- అతనే నా దైవం.....

నా భర్త దారే నాది; నా భర్తే నా గురువు, ఇదే నా హృదయంతో తీసుకున్న నిర్ణయం,

ఈ ప్రపంచాన్ని త్యజించి ఒక వేళ నా భర్త వెళితే,

ఓ పాండురంగా! ఈ మగవారి మధ్య బ్రతకటం నాకు మంచిదా?

నాభర్త ఆత్మ అయితే; నేను శరీరాన్ని.....

నా భర్త నీరయితే; నేనందులోని చేపని. నేనెలా బ్రతుకుతాను?..........

ఎందుకీ రాతి దేవుడు విఠోబా,

ఇంకా కలల్లోని సాధువు తుకారం,

నాకు తెలిసిన ఈ ఆనందం నాకు లేకుండా చేస్తారు?

ఈ పోయెం లో బహీనాబాయి పడే మనో వేదన చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భర్తతో కలిసి జీవించటానికి తన ఆత్మానందాన్ని త్యాగం చెయ్యాల్సొచ్చినా, మనం ఇంతకు ముందు తెలుసుకున్న మిగిలిన రచయిత్రుల్లా సంసార బంధాల్ని త్యజించడం, సంఘాన్ని ఎదిరించి బ్రతకగల్గటం ఆమెకు చేత కాలేదు. అలా అని సంసారంలో ఆనందంగా ఉండలేక పోయింది. కష్టమైనా నష్టమైనా పతివ్రత లాగా బ్రతకటానికి తన శాయ శక్తులా ప్రయత్నించింది. సంఘ భయం కన్నా కూడా మనం అర్ధం చేసుకోవాల్సింది ఇంకొకటి ఆమె వ్యక్తపరుస్తుంది. సంఘంలో మగవారి నుంచి తనను కాపాడుకోగల్గటం. అది ఒక దుస్సాధ్యమైన పని అప్పుడే కాదు ఆడవారికి ఇప్పుడు కూడా. ఇన్ని వందల వేల ఏళ్ళలో స్త్రీలు ఎంత ప్రగతి సాధించినా అది ఒక వర్గం వారికో, లేదా కొన్ని ఎక్సెప్షన్స్ తో కొందరికే సాధ్య పడింది. ఇప్పటికీ స్త్రీల విషయంలో ఎక్కడ గొంగళి అక్కడే ఉంది. ఇప్పటి యువత కొందరు చదువుకున్న అమ్మాయిల్ని, స్వేచ్చగా అలోచించే అమ్మాయిల ఉదాహరణలు చెప్పి ఇప్పటి ఆడవారు అప్పట్లా కాదు మారి పోయారు అంటారు. కానీ, సమాజంలో పురోగమనం, తిరోగమనం రెండూ, రెండు రైలు పట్టాల్లా సమాంతరంగా సాగుతుంటాయనిపిస్తుంది. ఎందుకంటే ఒక చోట నిలబడి చూసినప్పుడు రెండు రైలు పట్టాల్లో ఏది ఏవైపు వెళ్ళినట్టుగా అయినా ఊహించుకున్నపుడు అవి అలానే కనిపిస్తాయి. కాకపోతే నిజంగా సంఘంలో, ఊహతో సంబంధం లేకుండా అదే జరుగుతుంటుంది. మళ్ళీ వచ్చే వారం ఇంకొక అద్భుత రచయిత్రి పరిచయంతో మళ్ళీ కలుద్దాం.

- Sivapurapu Sharada