Facebook Twitter
గంగాసతి



గంగాసతి


గంగాసతి జీవించిన కాలం 12 వ శతాబ్దం నుంచి 14 వ శతాబ్దం లోపల ఎప్పుడో ఖచ్చింతంగా చరిత్రకారులు తెలుపలేక పోయినా, ఆమె రచనల ద్వారా చిరకాలం గుజరాతీలకు అయితే గుర్తుండిపోయింది. ఆమె రాసిన భజనలని ఇప్పటికీ అక్కడ పాడుకుంటూనే ఉన్నారు, ఉంటారేమో కూడా. సౌరాష్ట్రలో కహ్లూబా అనే అతనితో ఆమెకు వివాహం జరిగింది. స్వతహాగా భక్తి ఎక్కువయిన గంగాసతి తన భర్తను కూడా తనమార్గంలోకి తెచ్చుకుందట. For a change, ఇది మాత్రం చదవటానికి బాగుంది. వాళ్ళిల్లు ఎల్లప్పుడూ చర్చలకీ, భక్తి ప్రవచనాలకీ భజనలకీ నిలయంగా ఉండేదట. అయితే జీవితంతో విరక్తి చెందిన భర్త సమాధిలోకి వెళ్ళిపోయి తన జన్మ చాలించాలనుకుంటాడు. తను కూడా భర్తను అనుసరించడానికి ఆమె సిద్ధ పడుతుంది, కానీ భర్త వారిస్తూ, నువు కోడలికి జ్ఞాన బోధ చేసి, సరైన మార్గంలో పెట్టాకా అప్పుడు అలోచించు సమాధి గురించి అంటాడు. భర్త సమాధిలోకెళ్ళిన కొద్ది రోజులు గంగా సతి తన కోడలు పన్నాబాయి కి జ్ఞానబోధ చేస్తుంది. ఆమె నుద్దేశించి ఆమె పాడినవే ఆమె రచనలు. చాలా కొద్ది రోజుల్లోనే ఆమె తన భర్త మార్గాన్నే అనుసరించింది. అయితే ఆమె పాడినవన్నీ ఆమె తర్వాతనే రాసి భద్ర పరచడం జరిగింది. అవి కూడ ప్రజల నోట నానుతూ ఉన్నవే ఒక 40 వరకు.

గంగాసతి అటు ఇటూగా మీరాబాయి కాలానికి చెందినదే. అయితే ఈమె అనుసరించిన భక్తి మార్గం వేరు. ఇక్కడ, ఎటువంటి, పూజా విధానాలు, కృతువులూ లేవు. విగ్రహారాధన లేదు. అసలు వారి దైవానికి ఒక రూపం లేదు. కేవలం ధ్యాన యోగా ద్వారా మనసుని లగ్నం చేసి సమాధి స్తితిని సాధించడమే. పైగా ఈ రకంగా జీవించడానికి సన్యాసి కావలిసిన అవసరం లేదు. సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే రాగ ద్వేషాలను పరిత్యజించి జీవించడం.

జిడ్డు క్రిష్ణ మూర్తి భారతదేశం, ముఖ్యంగా తెలుగువాళ్ళు గర్వించదగ్గ ప్రపంచ ప్రఖ్యాత తత్వ వేత్త, ధ్యానం, మెడిటేషన్ గురించి ఇలా అంటారు. "ధ్యానం అంటే అనుకరణ కాదు, అనుసరణా కాదు, విధేయతా కాదు, అది ఒక ఎరుక, మన చుట్టూ ఉన్న వాటి బాహ్య వివరాలు మాత్రమే కాదు, వాటి లోతైన అంతర్గత వివరాల గురించిన ఎరుక కూడా. మన జీవనంలో ధార్మికత లేనపుడు, చేసే ధ్యానం దైనందిన జీవిత సంఘర్షణ నుంచి పారిపోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే అవుతుంది అని. ధర్మ మార్గంలో జీవించడం అంటే, సామాజిక నైతికత ఒకటే కాదు, స్వేఛ్చ పొందటం, ఈర్ష్య, ద్వేషం , దురాశ, అధికార కాంక్షల నుంచి, ఎందుకంటే ఇవన్నీ కూడా శతృత్వాన్ని పెంచి పోషిస్తాయి కాబట్టి. ధ్యానం అంటే, మైండ్ తో చేసే ఆలోచనల్లోకి హార్ట్ ని పెట్టడమే. అప్పుడు ఆలోచనలకి ఒక విలువ, ఉన్నతత్వం వస్తుంది. వాటి గుణమే వేరుగా ఉంటుంది, దాని ఫలితమూ అలాగే ఉంటుంది" మెడిటేషన్ గురించి జిడ్డు క్రిష్ణమూర్తి గారు చెప్పినదంతా చెప్పాలంటే కష్టమే. రోజువారీ జీవితంలోని ఘర్షణ, నిరాశ, నిర్లిప్తత, సంతోషం, బాధ, దుఖం, నిరుత్సాహాల బురద లోంచి, వికసించే పద్మం లాగా ధ్యానం ఉండాలి అంటారు. అంటే ధ్యానం చెయ్యడానికి ఎవరూ సన్యసించనవసరంలేదు. మనం చూస్తూ, వింటూ, చేస్తూ ఉన్న ప్రతి దానినీ లోతుగా విశ్లేషించి సత్యాన్ని నిజంగా అర్ధం చేసుకోగల్గడమే”.


యజుర్వేదంలో 32 వ అధ్యాయం ఇలా చెప్తుందట. "ఈశ్వరుడైన దైవానికి రూపం లేదు. జీవులన్నిట్లోను, అన్ని దిక్కులయందూ అతను వ్యాపించి ఉంటాడు. అతనికి ఆవాసం గుడి కాదు, విగ్రహాలలో అతను ఉండడు అని.'' వేద కాలంలో గుళ్ళూ, విగ్రహారాధనలూ కూడా లేవని అన్నా, ఈ విషయం గురించి నేను ఎక్కువ వివిరంగా చదవలేదు. అయితే విగ్రహారాధన అనేది మధ్యలో వచ్చిన ఆచారంగా అయితే కనబడుతుంది. మసీదుల్లో ఉండే సూఫీ సమాధులూ, చర్చిల్లో ఉండే జీసస్ శిలువలూ కూడా ఒక రకంగా చూస్తే విగ్రహారాధన అనే చెప్పచ్చేమో. గంగాసతి చెప్పినలాంటి, ధ్యాన యోగ మార్గాన్ని అనుసరించడం సామాన్యులందరి వల్లా కాని పని అని ఇన్ని రకాల పూజా విధానాలని ఏర్పాటు చేయడం జరిగింది అని ఇప్పటికీ మత పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కాదని గంగాసతి వాటన్నిటికన్నా, ఉత్తమమైన భక్తి మార్గాన్ని ఎంచుకుని ప్రచారం చేయడమే ఆశ్చర్యపరిచే గొప్ప విషయం. గంగాసతి పోయెం ఒకటి చూద్దాము.



Oh, The Meru Mountain May be Swayed
Oh, the Meru mountain may be swayed but not the mind of the Harijan,
Let the whole universe be shattered into fragments,
But the mind uncorroded by misfortune -
That's the true measure of the Harijan,
The Meru mountain may be swayed, but not the mind of the Harijan,

O brother, this is one unaffected by joy and sorrow,
Whose head is willingly offered in sacrifice,
Who shows courage in adhering to the true Guru's teachings
Who surrenders the ego in full fubmission -------
The Meru mountain may be swayed but not the mind of the Harijan.

O brother, this is one who lives in the company of the enlightened,
Who rejoices all hours of the day,
Who does not waver between resolution and counterresolution,
Who has broken all the bonds of wordly life------
The Meru mountain may be swayed, but not the mind of the Harijan.

Devote yourself to God, O Panabai !
Be faithful toyour words;
Here is a word of advice from Gangasati,
Submit yourself wholly to the true Guru
The Meru mountain may be swayed, but not the Harijan.




ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో
ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో కాని, హరిజనుడి మనసు చలించదు
విశ్వమంతా అనన్య శకలాలుగా చిద్రమైపొయినా కానీ,
దురదృష్టం వల్ల నాశనం కాని మనసు -----
అదే నిజమైన తూనిక హరిజనుడికి,
ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో కాని, హరిజనుడి మనసు చలించదు

ఎవడైతే తన శిరము ఇష్టపూర్వకంగా బలికి అర్పిస్తాడో,
ఎవడైతే నిజమైన గురువు బోధనలకు ధైర్యంగా కట్టుబడుంటాడో,
ఎవడైతే అహాన్ని వదిలి సంపూర్ణంగా తనను సమర్పించుకుంటాడో ------
ఓ తమ్ముడా, వాడు సంతోషం, దుఖం వల్ల ప్రభావితం కాడు.
ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో కాని, హరిజనుడి మనసు చలించదు

ఓ, తమ్ముడా, అతను, ఎవడైతే జ్ఞానుల సాంగత్యంలో ఉంటాడో,
ఎవడైతే రోజులో అన్ని ఘడియల్లో ఆనందంగా ఉంటాడో,
ఎవడైతే సంకల్పాసంకల్పాల మధ్య ఊగిసలాడడో,
ఎవడైతే ప్రాపంచిక బంధాలన్నిటినీ తెంచుకున్నాడో-------
ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో కాని, హరిజనుడి మనసు చలించదు

ఓ పన్నాబాయి ! నిన్ను ఆ దేవునికర్పించుకో,
నీ మాటలకి కట్టుబడుండు;
ఇది గంగాసతి పలికే హితవు
నిజమైన గురువుకి నిన్ను నువు సంపూర్ణంగా సమర్పించుకో
ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో, కాని హరిజనుడి మనసు చలించదు.


హరిజనుడు అనే పదాన్ని గంగాసతి మొట్టమొదటిసారిగా వాడిందట. దానర్ధం " హరి తన మనిషిగా గుర్తించిన వాడు" అని. అయితే నాల్గు వందల ఏళ్ళ తరవాత గాంధీ గారు ఈ "హరిజన్" అనే పదాన్ని దళితుల నుద్దేశించి వాడారు. అప్పట్నించి ఆ పదం ఎంత ప్రచారంలోకొచ్చిందో మనందరికీ తెలుసు.

అయితే గంగాసతి హరిజనుడెటువంటివాడు? దురదృష్టంతో తన ప్రపంచం అంతా ముక్కలైపోయినా, సుఖ దుఖాలవల్ల చలించకుండా, గురువు వల్ల జ్ఞానాన్ని పొందుతూ, అతని పట్ల సంపూర్ణ విశ్వాశంతో, భక్తితో, తన అహంకారాన్ని విడిచిపెట్టి, సదా జ్ఞానుల సంగతిలో ఉంటూ, అన్ని ఘడియలందూ తన ఆనందాన్ని కోల్పోకుండా, కార్య శీలియై, బంధాలనుంచి విముక్తుడై, ఒక్క మాటలో చెప్పాలంటే స్తితప్రజ్ఞత కలిగిన వాడు. మేరు పర్వతమైనా చలిస్తుందేమో కానీ, అట్టివాడి మనసు చలించదు.

గంగాసతి బోధించిన భక్తి మార్గం ఎంత ఉన్నతమైనదో, సాధించటానికి అంత కఠినమైనది కూడా. అందుకే సులువైన మార్గాలు చెప్పే 'సులభ ' బాబాలు, స్వాముల చుట్టూ అమాయక ప్రజలు తిరిగి మోసపోతూనే ఉన్నారు.

 

 

 

 

- శారద శివపురపు