Facebook Twitter
నిశితో యుద్ధం

 



చీకటికీ, నాకుా యుద్ధమై
అలకపానుపునాశ్రయించినపుడు
నా వీపుకు పిల్లతెమ్మెరలా
తగులుతుందో జ్ఞాపకం
గుండెలు పిండేస్తుా లావాలా
కనులలోయల్లోంచి ఉబికివస్తున్న
కన్నీటి మంటలను దిండు ఆర్పుతుా
నాలుగు గోడల నడుమ
ముాడో కన్ను చుాడకుండా
మది బాధను తేలికపరచిన
ఆ నిశిరాత్రికి మనసు మార్చుకొని
ధన్యవాదాలు తెలిపేలోపే
నా నుంచి విడిపోయి
ఉషోదయపు వెలుతురులో కలిసి
దొంగలా పారిపోయి నల్లటి ముసుగుతో
సాయంత్రం నన్ను ఓదార్చాలని
తిరిగి నా చెంత చేరిన నిశితో
ఆ రాత్రి మళ్ళీ నాకు యుద్ధమే ...
కన్నీరొలికించే ఆ చేదు నిజాలను
తలుచుకొని మది బరువు దింపుకోవటానికి
ఆ నిశితో ప్రతీరాత్రి పోరాటం చేయటం తప్ప
జీవితపు డైరీలో పేజీలు వెనక్కి తిప్పి
ఆ విషాదాన్ని చెరిపివేసే అవకాశం లేదట మరి....

--- సరిత భుాపతి