Facebook Twitter
పరిష్కారం

కొల్లూర్ గ్రామం, గుంటూర్ జిల్లానుంచి ఇద్దరు ప్రేమికులు పెళ్ళి చేసుకుందామన్న ఉద్దేశ్యంతో వేమూరు వచ్చారు. అయితే అక్కడ ఆ యువతి సామూహిక అత్యాచారానికి గురయ్యింది మొన్న శనివారం. కానీ ఆమెను ప్రేమించిన యువకుడు రాజేశ్ మాత్రం ఆమెను మరుసటి రోజే పెద్దలందరి అనుమతి, ఒప్పుదలతో ఆమెను వివాహమాడాడు. ఈ వార్త చదివిన తరవాత చాలా సంతోషం వేసింది. ప్రేమించినవాడు పారిపోయి, మానభంగం చేసిన వాడికే కట్టబెట్టి సమస్య పరిష్కరించామని చేతులు దులుపుకునే సమాజానికి, మానభంగం చేసి మగతనపు కుతి తీర్చుకునే దుశ్శాశనులకీ చెంపదెబ్బ, చెప్పుదెబ్బ లాంటి గుణపాఠం. ఈరోజు పేపర్లోని ఈ వార్తకి స్పందనగా రాసిన కవిత. వారిద్దరి ప్రేమా చివరివరకూ నిలవాలని ఆశిస్తూ.


పరిష్కారం

అంగ స్తంభనలే కానీ
అంతరంగ శోధన లేని
క్షణిక కామోద్రేకాలే కానీ
శాశ్వత ప్రేమోద్దేశ్యాలు లేని
మర్మావయాల మోజులే కాని
జన్మస్థానాల జ్ఞాపకాలు లేని
సకిలింపుల ఇకిలింపులే కానీ
ప్రేమ ప్రకటనల చిర్నవ్వులెరుగని
గార్దభాల స్వైరవిహారంలో
అసలు మగతనమంటే
సిసలు మృగతనమనే మగాళ్ళ వల్ల
మృదుభాషిణుల మార్దవాలు నలిగితే
గుండె కుండాల్సిన గుణానికీ,
గుప్తాంగాల శోషణకీ,
కన్నెరికపు పవిత్రతకూ,
కామోన్మాది ధూర్తత్వానికీ,
లంకె వేసి, శీలమన్న పేరుతో
బ్రతుకు హరించి జాలి నటించే సంఘానికీ,
అన్యాయాన్ని అక్కున చేర్చుకుని,
న్యాయాన్ని క్యూలో నిల్చోపెట్టే
రక్షణ వ్యవస్థ నిర్వీర్యానికీ,
వారధి కడుతూ నువు చెప్పిన తీర్పు
సామూహిక మానభంగమయిన మరురోజే
ప్రియురాలికి పరిణయమనే పరిష్కారం.....
శిధిలమైపోబోయే చిరు బ్రతుకుని,
శిలువ వేసిన యవ్వనాన్ని,
ఆరిపోబోయే చిన్ని దీపాన్ని,
ఆర్తిగా రెండు చేతులడ్డుపెట్టి,
తిరిగి వెలిగించిన నీవు,
నిలువునా దహించబడిన
చిన్ని మొక్కకు ప్రేమనే నీరు పంచి
మూడుముళ్ళ బంధంతో నిలబెట్టిన నీవు,
శీలమన్నది హృదయానికి చెందినదని
శరీరానికది అందనిదని
నిరూపించిన నీవు నిజమైన మగాడివయ్యా
నీవు రాజువయ్యా, రాజేశువయ్యా.

- శారద శివపురపు