Facebook Twitter
వంశీకుంజం

 

వంశీకుంజం

 

- తెన్నేటి హేమలత

 


   
          తెలుగు కథా సాహిత్యంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రచయిత్రి తెన్నేటి హేమలత. స్త్రీగా ఎన్నో అరుదైన అనుభవాలను, సమాజంలో గుర్తింపబడని స్త్రీల జీవితాలను కథల్లో, నవలల్లో చిత్రీకరించారు. కేవలం కథలు నవలలే కాకుండా ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలూ రచించారు. వ్యాసాలు రాశారు. వీరు సుమారు వంద నవలలు, వందల సంఖ్యలో రేడియో నాటికలు, నాటకాలు రాశారు. కవితలు కూడా రచించారు. ఎన్నో ప్రఖ్యాత బహుమతులు పొందారు. భాగవతంలోని శ్రీ కృష్ణ లీలలను ఇతివృత్తంగా తీసుకొని వంశీకుంజం పేరుతో అద్వైతభావాన్ని కథ రాశారు.
         హేమలత వంశీకుంజం కథలో కృష్టుడు, గోపకాంత అయిన నీరజ మధ్య ఉన్న బంధాన్ని అలౌకికంగా చిత్రీకరించారు. ప్రేమికుడైన కృష్ణుడికోసం వడలిన వయసులో, ఎండిన వెదురులాంటి శరీరంతో నీరజ ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. మధుర ఉద్యానవనంలో ఒకప్పుడు కృష్ణుడుతో గడిపిన జ్ఞాపకాలను తలపోస్తూ...  ప్రేమతో ఆర్థ్రమైన హృదయమూ, కన్నీటితో నిండిన కన్నులూ, ఆరాధనతో పరవశమైన బతుకూ వెలలేనివి అన్నావు. ఈ పారిజాత సుమమాలు అపూర్వమైనది. అది వాడిపోక మునుపే వస్తానన్నావు.... కానీ రాలేదు. నన్ను మర్చిపోయావా... అని అసుర సంధ్యలో వంశీకుంజం ఎదుట ఒక్కతే గత జ్ఞాపకాలలోని కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
          వసంతకాలంలో లేత చిగురుల మధ్య కృష్ణుడి రూపాన్ని చూసి తరించిపోయింది నీరజ. బంగారు వర్ణపు మృదుకేశాల నుంచి, శౌర్యాన్ని నింపుకున్న భూజాల నుంచి, సమ్మోహనంతో ఉన్న కన్నుల నుంచి, తేనెలు కురిసే పెదవుల నుంచి, ఎందరో స్త్రీలు తమతమ హృదయాలను పారేసుకున్న గడ్డం కింద ఉన్న చొట్ట నుంచి... అన్నిటిని చూసి ఆ మోహనుడిని మోహించింది. కృష్ణుడు కూడా స్త్రీ ముందు నేను అల్పుడిని, మనసుకు విషాదం కలిగినప్పుడు, బతుకు భరించలేనంత బరువుగా తయారైనప్పుడు స్త్రీ ప్రేమ, ఆరాధన, ఆప్యాయతా నాకు అవసరమవుతాయని చెప్పాడు. నేను నీ ప్రేమను అర్థం చేసుకున్నాను అని చెప్పి తన ఆత్మలో ఆమెను అంతర్భాగం చేసుకున్నాడు. అప్పుడు నీరజ కృష్ణుడితో- నా గుండె గూటిలో నీవు ఉన్నావు, మనసు కన్నా దేవలయం లేదు. మమత కన్నా పూజలు లేవు అని చెప్పింది. పైగా మనసు, మమత కలిస్తే పూజకు ఫలం అన్నది. నీవిచ్చే వరం కోసం వేచి యుంటాను అని మాట ఇచ్చింది. ఇదంతా నీరజ యువతిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. అప్పటి నుంచి నీరజ ఆ వంశీకుంజం దగ్గర  వేచి ఉంది. వంశీకుంజం కూడా ఇప్పుడు పెద్దదై పోయింది.
        నీరజకు పిచ్చిపట్టిందని ఆమె భర్త వదిలేశాడు. తమాలవృక్షం కింద తపస్సుచేసే రాధమ్మ కూడా మయమైపోయింది. తపతి, చంద్రిక వంటి చెలికత్తెలందరూ వెళ్లిపోయారు. కానీ ఆమె దొర నల్లనయ్యకోసం, ఇచ్చిన మాట కోసం ఎదురు చూస్తేనే ఉంది నీరజ. ఈ సుధీర్ఘ వియోగంలో ఆమె కృష్ణుడు గురించి ఎన్నో కథలు విన్నది. కానీ వస్తాడని నమ్మకం. ఎందుకంటే... స్త్రీత్వం ఆయన్ని ప్రేమించి తనని తాను అర్పించుకుంది. చిత్రంగా భగవానుడు మనోహరుడుగా దర్శనమిచ్చాడు. అసలు కృష్ణుడిలో తను అంతర్భాగం. తనలోని ఒక మనోహరమైన ప్రేమప్రవాహం కృష్ణుడిగా అయిపోయింది. ఆమెకు ఆమె జీవితమే రెండుగా చీల్చిపేసిన అనుభూతి కలిగింది. ఆమె ఆలోచనా ప్రవాహం పరుగులెత్తింది. ఆ ఆనందమయమైన రూపంలో కృష్ణుడు వృద్ధురాలిని తోడమీదకు తీసుకున్నాడు. భగ్న తపస్వి నీరజ అతని స్వరహృదయంలో నిండిపోయింది. అప్పుడు ఆమె అడిగింది... భగవంతుడా, జీవితం అంటే ఏమిటి... అందుకు సమాధానంగా కృష్ణుడు- మనుష్య జీవితం అనేక సంస్కారాలతో నిండి ఉంటుంది. తినడం, తాగడం, దేహవాంఛలే కాకుండా..., స్వప్నాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు పెనవేసుకుని ఉంటాయి. వీటి సంస్కార సంచయమే జీవితం అని చెప్తాడు.
      ఆమె కోరిక ప్రకారం వంశీకుంజాన్ని పిల్లనగ్రోవిగా  జోలపాడతాడు. అప్పుడు ఆమెకు ప్రణయ తరంగిణిలా గీతాసారం వినిపిస్తుంది. ఎవరికి ప్రపంచంలో ఎవరితోనూ వైరంలేదో, ఎవడు తటస్థుడిగా ఉండి, నిరపేక్షగా జీవితం గడపుతాడో, ఎవడు తను చేసిన దానికంతటికీ నాకే సమర్పించి క్షమాశీలుడూ, నిస్సంగుడూ, ప్రేమమయుడూ అవుతాడో అతడే నేను... తర్వాత అతని కన్నీటి బొట్లు ఆమె నుదుటిని తడుపుతాయి. ఆ విరహణి నీరజ ఆయనలో ఐక్యమైపోతుంది. తర్వాత అక్కడ నీరజకు బదులు పారిజాత సుమరాశి కనిపిస్తుంది. వంశీకుంజం మాత్రం ఇప్పటికీ కృష్ణస్పర్శకోసం ఎదురు చూస్తూనే ఉంది. అని కథ ముగిస్తుంది తెన్నేటి హేమలత.    
       ఇలా భాగవతంలోని గోపికలు, కృష్ణ తత్వాన్ని కథగా మలిచారు రచయిత్రి. అలానే ఆత్మ, పరమాత్మ..., భగవంతుడు, భక్తుడు... ఇలా వీరి మధ్య ఉన్న ధ్వైదీ భావాన్ని గొప్పగా చెప్పారు ఈ కథలో తెన్నేటి హేమలత.   

- డా. ఎ.రవీంద్రబాబు