Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 2


“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 2

 

స్వామి సర్ప రూపంలో ఒకానొక ఆవుల మందలోని గోక్షీరం రోజూ తాగేస్తూ ఉండే వాడట. ఆ ఆవు ప్రతీ దినం మందలోంచి తప్పించుకుని, కడుపారా స్వామికి పాలు తావించి వెళ్లేదట. ఖాళీగా వేళ్లాడుతున్న పొదుగును చూసి యజమాని కాపరిని కోప్పడేవాడు.
   కొన్ని రోజులు చూసి, ఆ పశువుల కాపరి కాపు కాచి, ఆ పాముని కర్రతో కొట్టాడట. ఆ దెబ్బకి కారిన రక్తంతో ఒక పక్క ఎరుపు, ఆవు పొదుగు నుండి కారిన పాలతో ఇంకొక పక్క తెలుపు వచ్చాయని అంటారు. ఆ లింగాన్ని చూసి కాపరి పశ్చాత్తాపంతో స్వామిని వేడుకున్నాడట.
   భోళా శంకరుడు కదా.. కరుణించి కాపరిని కాపాడాడు.
   నిజమైన ప్రాయశ్చిత్తంతో వేడుకుంటే ఆ గరళ కంఠుడు పాపాలను తొలగించి, కష్టాలను తీరుస్తాడని ప్రతీతి.
   ఇన్నిన్ని గుడులు ఏర్పడక ముందు ఈ ఊరిని fనేత్రపురిf అని పిలిచేవారు.
   శైవ, వైష్ణవ సాంప్రదాయాలకు సమాన ప్రాధాన్యత నిచ్చు సహన శీలురు, విశాల హృదయులు అయిన గుడ్లూరు గ్రామస్థుల ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది. నూరు ఆలయాలే కాక నూరు తటాకాలు కూడా ఉన్న గుడ్లూరు.. సహజ వనరులతో అలరారుతూ, పాడి పంటలు సమృద్ధిగా ఉండి.. చతుర్వర్ణాలవారు సౌఖ్యంతో మెలిగే ఆదర్శ ప్రదేశం అని పేరు పొందింది.
   పదమూడవ శతాబ్దంలో.. గణపతి దేవుడు, అతని తదుపరి రుద్రమదేవి, రాజ్యమేలిన కాకతీయ సామ్రాజ్యపు అధీనంలోనున్న.. అద్దంకి సీమకి చెందిన ఈ ప్రాంతాన్ని పంట వంశ నాయంకరంలోని రెడ్లు ప్రజా రంజకంగా పరిపాలిస్తూ ఉండే వారు.
   సామంతులయినా.. తమ తమ స్వాభిమానాన్ని కాపాడుకుంటూ, నీటి వనరులను చెరువులుగా భద్రపరచి రాజ్యాన్ని సస్య శ్యామలం చేశారు.
   ఆహార కొరత లేనప్పుడు సహజంగానే సాహిత్య సంగీతాల మీద, కళల మీద ఆసక్తి పెరుగుతుంది. అందునా.. సుస్థిరమైన సామ్రాజ్యం. శత్రువులెవరైనా దాడి చేసినా ఏకశిలానగరం ఏలికలు కొండంత అండగా ఉండనే ఉన్నారు.
    ఇంక ఏ లోటు? అందుకనే ఆదర్శ సీమ అయింది.
   రెడ్డిరాజుల గజ సంపద చక్రవర్తికి స్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడ ఒసగి వారిరువురి మైత్రికి దోహదం చేశాయి. సరిహద్దులోనున్న పెద్ద చెరువును కోటలోని  ఏనుగుల దాహానికి, స్నానానికి వాడుతూ.. ఏనుగుల దొరువు అని పిలుస్తారు.
ఆ సమయంలో అక్షరానికి కొరతయిందా సీమలో.
     అంటే.. అక్షరాభ్యాసం చేయించడానికి కాదు..
   ఛందో వ్యాకరణాలు సాంగోపాంగంగా నేర్పించడానికి, ఉభయభాషల్లోనూ ప్రావీణ్యత గలిగి విద్యార్థులను వేదవేదాంతాలలో నిష్ణాతులను చెయ్యగల గురువు కావాలి.. తెలుగులో కావ్యరచన చేయగలిగే స్థాయికి చేరుకునేలా అభ్యాసములు చేయించే వారు కావాలి.
   నీలకంఠేశ్వర స్వామి ఆలయపూజారి నారసింహాచారి కాలధర్మం చెయ్యడంతో ఏర్పడిందా లోటు.
   రెడ్డి ప్రభువు ఆ లోటు పూడ్చే ప్రయత్నంలోనే ఉన్నాడు.
                                                                                                 ……………………
    గుడ్లూరునకు సుమారు ఇరవై యోజనములు ఉత్తరాన.. కృష్ణా, గోదావరీ నదుల మధ్యనున్న వేగినాడులోని కరాపర్తి గ్రామంలో..
   నాలుగంకణాల విశాలమైన ఎత్తరుగుల ఇల్లు. ఇంటి ముందు వేప చెట్టు చల్లని నీడ నిస్తోంది.
   సూర్యోదయాత్పూర్వమే ఆ గృహంలో కలకలం మొదలయింది.
   ఇంటి కోడలు పొత్తమాంబ, వీధి వాకిలి ఈ చివర్నుంచాచివరికి తుడిచి, కళ్లాపు జల్లి, రంగవల్లులు తీర్చి దిద్దింది. గృహస్థు గడప దాటక ముందే ముగ్గు వేసెయ్యాలి.. అదే సంప్రదాయం.
   వెనువెంటనే యజమాని ఎర్రపోతసూరి పెద్ద రాగి చెంబు, అంగవస్త్రం, ఉతికేసిన బట్టలు పట్టుకుని జాగ్రత్తగా ముగ్గు పక్కనుంచి దాటి, ఏటికేసి వెళ్లాడు, భుజాలమీదుగా కొంగు కప్పుకుని, అణకువతో తలవంచుకుని నిలబడ్డ కోడలి కే్సి చూసి తల పంకిస్తూ.
   దారి పొడవునా, ఎదురైన ఊరివారు, వేదకాలం నాటి ఋషి వంటి ఎర్రపోతనకి నమస్కరిస్తూ పక్కకి తొలిగారు.
   ఎర్రపోతసూరి ఏటి దగ్గర స్నానమాచరించి, ఎర్రని పట్టు వస్త్రం ధరించి, నీరుకావి ఉత్తరీయంతో వక్షస్థలాన్ని కప్పుకుని, రాగి పాత్రలో నీటిని దారిలో చల్లుకుంటూ ఇంటికి వచ్చాడు.
   పచ్చని ఛాయ గలవాడేమో.. ఆరీ అరని నీటి బిందువులలో ఉదయార్కుని ఎరుపు రంగు పరావర్తనం చెంది ఆయన మేను ఉషోదయ కాంతులు వెదజల్లుతోంది.  సాక్షాత్తూ ఆదిత్యుడే నడచి వస్తున్నాడేమో అని భ్రమ కలుగుతోంది. తలవంచి
ద్వారంలో అడుగు పెడుతూనే నృసింహ స్తోత్రం వల్లించసాగాడు.
       "శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే  
    భోగీంద్ర భోగమణి రక్షిత పుణ్య మూర్తే
    యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత  
    లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం." 
   అప్పటికే తలారా స్నానమాచరించిన అతని ధర్మపత్ని పేరమ్మ, వేలు ముడి వేసుకుని, ఒద్దికైన కాశ కట్టుతో మడి చీర కట్టుకుని తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసి, దీపం పెట్టేసింది,. ఆదిత్య హృదయం చదువుకుంటూ, దేముడి అర తుడిచి, దీపపు సెమ్మెలు, పంచపాత్ర, అరివాణం, ఉద్ధరిణీ మొదలుగాగల పాత్రలను తళతళా తోమి, బోర్లించింది. పొయ్యి వెలిగించి మహా నైవేద్యానికి సిద్ధం చేస్తోంది.
   ఎర్రపోతసూరి కుమారుడు సూరన్న ఉభయ భాషా ప్రవీణుడు. సంస్కృతాంధ్ర భాషల్లోని కవిత్వాలలో ప్రౌఢ శబ్ద ప్రయోగాలతో ఘనుడిగా పేరు పొందాడు. తండ్రికి తగ్గ తనయుడు.. ఆచార వ్యవహాల్లోనూ, ఆత్మాభిమానంలోనూ కూడా. కలిమిలోనూ, లేమిలోనూ నిమిత్తమాత్రంగా ఉంటారు ఇరువురూ.
   సూరన్న బ్రాహ్మీ ముహుర్తమందే లేచి, పూజాది కార్యక్రమాలు ముగించి.. వీధి అరుగు మీద తన పాఠశాల తెరిచాడు.
   విప్ర బాలురు నమకం, చమకం, పురుష సూక్తం, వ్యాకరణ సూత్రాలూ ఆదిగాగల సంస్కృతాంధ్ర భాషల్లోని పాఠాలను వల్లె వేస్తున్నారు. ఇంకా చిన్న పిల్లలు నల్లని అరుగు మీద తెల్లని ముగ్గు వేసి అందులో అకారాది అక్షరాలను దిద్దుతున్నారు.
   సూరన్న భార్య పొత్తమ్మ, తలుపు చాటున నిలిచి, చేతులు కదిపి గాజులు చప్పుడు చేసింది.
   ఏదో వ్రాయ నిశ్చయించుకుని తాళపత్రాలు సర్దుకుంటున్న సూరన్న లేచి లోనికేగాడు.
   పొత్తమ్మ ఇరువది ఏండ్ల ముగ్ధ. విశాలమైన కనుదోయి.. తీరైన నాసిక, నిరంతరం చిరునవ్వు నవ్వుతున్నట్లు అనిపించే పెదవులు.. కావ్య నాయిక వలెనే ఉంటుంది. జుట్టు తడి ఇంకా ఆరలేదేమో.. విరబోసుకుని, చివర వేలుముడి వేసింది. వంకీలు తిరిగిన ముంగురులు నుదుటి మీద అల్లల్లాడుతుండగా, సిగ్గుతో కను రెప్పలు వాల్చి కంచు పాత్రలో గోరువెచ్చని పాలు అందించింది.
   ప్రసన్న వదనంతో క్షీర పాత్రని అందుకున్నాడు సూరన్న.
  "మరీ.." సన్నని స్వరంతో ఏదో చెప్పబోయింది పొత్తమ్మ.
   కనుబొమ్మలెగరేశాడు పతిదేవుడు.
  "కోమటి జంగన్న అంగడికి వెళ్లి వస్తారా? ఇంటిలో వస్తువులన్నీ నిండుకున్నాయి. కట్టెలు కూడా.." సగం సగం మాటలు మింగేసింది సంశయాత్మకంగా చూస్తూ.
  చెప్పవచ్చునో లేదో.. చెప్పకున్న రాత్రికి పొయ్యి రాజేసే పని లేదు. అప్పటి దాకా అన్ని విషయాలూ అత్తగారు, మామగారూ చూసుకునేవారు.
   సూరన్న అయోమయంగా చూశాడు. ఇల్లు, వస్తువులు.. అవన్నీ తను.. ఏ విధంగా.. ఏం చెయ్యాలో తెలియదే! తండ్రిగారు ఏమీ చెప్పలేదే! ఉన్నట్లుండి వంట సామగ్రి అంటే ఎక్కడికి వెళ్లాలి.. వీటన్నింటికీ ద్రవ్యం ఎక్కడనుంచి వస్తుంది..  

తల తడుముకుంటూ వీధి అరుగు మీదికి వెళ్లాడు.
   నిశ్చింతగా కాలం గడుపుతున్న సూరన్న ఒక్కసారిగా కొండంత భారం శిరమున ఎత్తుకుంటున్నట్లు, హఠాత్తుగా సమస్యల సర్పాలు చుట్టుముట్టినట్లు విలవిల్లాడిపోయాడు.
   అన్యమనస్కంగానే పిల్లలకి పాఠాలు నేర్పాడు.

 "కోడలు చెప్పింది నిజమే అబ్బాయీ! మీ తాతగారి తండ్రి భీమన గారు వెలనాటి చోడుల వద్ద మంత్రిగా ఉండే వారు. ఆ రాజులకి అత్యవసర సమయంలో అమూల్యమైన సలహాలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. వారికి రాజులు ఇచ్చిన మడిమాన్యాలతో ఇన్ని తరాలు గడిచాయి. పుత్ర పౌత్రాభివృద్ధి అయి వంశం శాఖోపశాఖలుగా విస్తరించింది. కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి.
   మన విషయంలో అదే అయింది. దానికి తోడు కరవు.. కౌలుకిచ్చిన భూమి మీద ఏమాత్రం రూకలు రావట్లేదు. రూకలు లేకున్న నూకలెక్కడ్నుంచి వస్తాయి మరీ! మీ తండ్రిగారు వృద్ధులవుతున్న సంగతి చూస్తున్నావు కదా!"  పేరమ్మ ఎప్పట్నుంచో కొడుక్కి చెప్పాలనుకుంటున్న మాటలన్నీ కష్టపడి చెప్పేసింది.
   బాధ్యత అప్పచెప్పడం ఇంతటి భారమైన పనని అనుకోలేదు. తండ్రి నుంచి తనయుడికి ఆస్థి సంక్రమిస్తే ఆనందమే కానీ..
   ఆదాయం లేకుండా ఇల్లు నడపమనడం అన్యాయమే! కానీ అనివార్యం.
   సూరన్న అటూ ఇటూ చూశాడు ఆధారం కోసం.
   ఎర్రపోతసూరి మాట్లాడకుండా ఔపోసన పట్టాడు.
   తండ్రీకొడుకులిద్దరూ నట్టింట్లో భోజనాలకి కూర్చున్నారు. పెరటి తోటలో కోసిన బచ్చలి కూర పులుసు, జొన్న సంకటి వడ్డించింది పేరమ్మ. సూరన్న సరిగ్గా గమనించడం లేదు కానీ.. గత ఆరు మాసాలుగా ఆధరువులు అరకొరగానే ఉంటున్నాయి.
   "మరి ఇంత కాలం నాదృష్టికి ఎందుకు తీసుకొని రాలేదమ్మా?" జొన్నసంకటిలో పులుసు కలిపి నోట పెట్టుకోబోతూ అడిగాడు సూరన్న.
   "నువ్వు గురుకులం వెళ్లి విద్య నభ్యసించడం.. ఆ తరువాత వివాహం.. ఇప్పుడిప్పుడే కదా ఇంటి పట్టున ఉంటున్నది.."
   "ఏదో నడిపించినంత కాలం నడిచింది. ఇప్పుడు ఋణ బారం ఎక్కువయింది. వర్షాలు పడితే అంతా సర్దుకునేదేమో! మూడు సంవత్సరాలుగా వరుణుడి కరుణ లేదు కదా.. ఇంక ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యకపోతే ఊర్లో ఉండలేం. అదీ అత్యంత త్వరితంగా." ఎర్రపోతసూరి నోరు విప్పాడు.
   నిజమే.. తాను ఇంక గృహ బాధ్యతలు స్వీకరించక తప్పదు. తల్లిదండ్రులని మానసికంగా, భౌతికంగా సుఖపెట్టడం తన బాధ్యత. సూరన్న ఆలోచిస్తూ భోజనం పూర్తి చేశాడు.
   తను నమ్ముకున్న ఆ చంద్రశేఖరుడు ఏదో దారి చూపించకపోతాడా..
   చూపిస్తాడు. చూపించబోతున్నాడు..
   తండ్రీ కొడుకులిరువురూ లేచి, పెరటి అరుగు మీద చేతులు కడుక్కుంటుండగా వినిపించింది ఒక కేక.
   "అయ్యా! సూరన్నగారి గృహమిదేనా?"

(ఇంకా వుంది)

.... మంథా భానుమతి