Facebook Twitter
చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు

చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 1
                                

 

శ్రీమన్నారాయణుడు క్షీరసాగరముపై, శేషతల్పమున శయనించి చిదానంద రూపుడై సృష్టి వైచిత్ర్యాలను పరికిస్తున్నాడు. మూలకారణంబొక్కడే అయినా అనేకానేక రూపాలు.

విఘ్నేశ్వరుడు.. అనంతుడు, అచ్యుతుడు, చతుర్ముఖుడు, ముక్కంటి, ఆదిశక్తి, నాగేంద్రుడు, ఆంజనేయుడు, హయగ్రీవుడు..
   హిందూ మతంలోనే ఇన్నిన్ని రూపాలుంటే మరి ఇతర మతాల మాటేమిటి..
   ఏకకణ జీవిని సృష్టించాడు.. అదే చేతితో మనిషిని సృష్టించాడు.
   మనిషిలో దూరే సూక్ష్మ జీవులనీ, మనిషి మీద పడే క్రూర జంతువులనీ సృష్టించాడు.
   మరి.. మనిషి మనిషికీ మధ్య ఇంతటి విభేదాలనెందుకు సృష్టించాడో..
   కక్షలు కార్పణ్యాలు, కాంక్షలు వాంఛలు
   అధికార దాహాలు.. పోనీ..
   అదో ఆట అనుకుందాం..
   మరి మతం అంటూ తనకి తనే వేరు పరచుకున్నాడే.. ఆ మాటేమిటి?
   మతం పేరుతో మారణహోమాలు..
   మాధవుడు దేవుడంటే..
   కాదు శివుడే దేవుడు..
   జైన తీర్ధంకరులు, బౌద్ధారామాలు..
   కాదు కాదు అల్లానే దైవం..
   అశ్వమేధం, నరమేధం.. అంతులేని పోరాటం.
   ఎందుకని.. చివరికి ఏం సాధించాలని? లయ కారణంబునకా!
   పోరాటాల మధ్య విరామానికి కాబోలు..
   మానసికోల్లాసమునకై వెలసిన సంగీత సుమాలు, సాహిత్య సౌరభాలు.
   అన్నీ ఆ పరమాత్ముడికే చెల్లు.
                           ...........................
    పాకనాడు (నేటి ప్రకాశం జిల్లా) లోని గుడ్లూరు గ్రామం... క్రీ.శ.13వ శతాబ్దం ఉత్తరార్ధంలో..
   మన్నేరు నది ఒడ్డునున్న ఈ గ్రామం లో నూరు పైన గుళ్లున్నాయి. అందువలననే ఆ గ్రామానికి ఆ పేరు స్థిర పడింది.. వానిలో నీలకంఠేశ్వర స్వామి గుడి బహు ప్రఖ్యాతి చెందింది.
  

అంతే సమానమైన ప్రాముఖ్యత సంతరించుకున్న కేశవ పెరుమాళ్ ఆలయంలో నారాయణుడు అత్యంత వైభవంతో పూజలందుకుంటున్నాడు..   శివ కేశవులిరువురూ ఆ గ్రామాన్ని తమ రక్షణలోనికి తీసుకున్నట్లు వెలిశారు.
  

 పలు రకాల పండుగలకు, సాహిత్య సంగీత సభలకు ఆలవాలమయింది ఆ సీమ.
    పామర జనాలు, బంగారపు తొడుగు గల గ్రామదేవత పోలేరమ్మను ఆరాధిస్తూ ఉంటారు.
   ప్రతాప వీరాంజనేయ స్వామి గుడి, చెన్నకేశ్వరాలయం, వినాయకుడి గుడి, వీరభద్రుని ఆలయం.. అక్కడున్న ఆలయాల్లో కొన్ని. ఆ పరబ్రహ్మ అన్ని రూపాల్లోనూ కొలువై ఉన్నాడు అక్కడ.
   నీలకంఠేశ్వర స్వామి ఆలయంలోని లింగం సగం తెలుపు రంగులో, సగం ఎరుపు రంగులో ఉంటుంది. ఇతిహాసం ప్రకారం దీనికొక కథ ఉంది.

....మంథా భానుమతి