ఉగాది గీతం
ఉగాది గీతం

ఆమని అదిగో పిలిచెనదే, ఓ యని నా మది పలికెనదే
ఆనంద తరంగాల హేలలో, యీ వని నాట్యములాడినదే (..ఆమని..)
1) కలికి చిలక తన కొసరు గొంతుతో
అడుగుతున్న కతలేమిటే?
కోకిల పంచమ స్వరమున తెలిపిన
తీయని కబురది తెలియదటే?
మల్లెల తెల్లని సొబగులలోని
మర్మమదే వాసంత వేదికా (..ఆమని....)
2) గున్నమామిడీ గుబురుల దాగిన
మధురస ఫలముల చూడవటే?
మిన్నులనంటెడి విహంగ గానము
సుధా సమీరము తెలియదటే?
కన్నులందు కనిపించు కాంతులూ
పూలకారు సుమ రథమునవే!!....... (..ఆమని..)
3) మన్మథ వత్సర వేడుక వేళల
మది పులకింతల కేతనమే
వసంత కాహళి ధ్వనించు సీమలు
నవ తారుణ్య సుయోజితమే...
జీవన గీతిక సమ శ్రుతి లయలకు
సప్త స్వర జీవామృతమే.............. (....ఆమని..)
-పుట్టపర్తి నాగపద్మిని



