మరచెంబు
మరచెంబు

మరచెంబు గురించి మనకే
పొరలు పొరలుగా గుర్తుందిగానీ
మన తర్వాతి తరంవాళ్లకు మాత్రం
మచ్చుకైనా గుర్తుండదేమో మరి
పెళ్ళి సంబరాల్లోని అల్లుడి అలక అధ్యాయంలో
మరచెంబుదే ముఖ్యపాత్రయినా
భానుమతిరాసిన అత్తగారికథల్లో
మొత్తం కనిపించేది మరచెంబే
వడుగునాటి మరచెంబు
కాశీయాత్రకు బయల్దేరుతుందిగానీ
విహారయాత్రల్లో మాత్రం విరివిగా పనికొచ్చేది
పాత్రలు పలురకాలుగా వాడుతున్నారుగానీ
పనికొచ్చే మరచెంబులాంటివి తక్కువే మరి
అందంగా కన్పించి మురిపించే మరచెంబు
ఆప్యాయతగా పలకరిస్తుంది గానీ
ఆత్మీయతా అనురాగాలెవరిక్కావాలి
అడ్డమైన నీటిని అందమైన బాటిల్స్‌లో కొంటాంగానీ
నామోషీకల్గించే మరచెంబు లెవరిక్కావాలి
పుత్తడిలాకన్పించే ఇత్తడి మరచెంబుల స్థానాన్ని
స్టీల్ చెంబులాక్రమించుకున్నాయి గానీ
రాన్రానూ అవీ మాయమైపోతున్నాయి
ప్లాస్టిక్‌లో కన్పించినా ప్రాణం కుదుటపడేదిగానీ
పట్టించుకునేవాళ్లేరి!!!
పెద్ద మనుషుల చిన్నకోరికలు గూడా
అవహేళనతో అంతరించిపోతున్నాయీ...
అర్ధం చేసుకోలేక అలాగే మిగిలిపోతున్నాయి
- కన్నోజు లక్ష్మీకాంతం
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో



