Facebook Twitter
స్నేహ కృష్ణ - శారదా అశోకవర్ధన్

స్నేహ కృష్ణ


- శారదా అశోకవర్ధన్

 

కాలేజీకెళ్ళే వారందరికీ ఆమె తెలుసు

ఆమె చదువుల తల్లి కనుక -

కవితలల్లే వాళ్ళందరికీ ఆమె పరిచయమే

కవయిత్రి కనుక -

సహృదయులందరికీ ఆమెతో నెయ్యమే

స్నేహశీలి గనుక -

కృష్ణకుమారిని చూస్తే ఇంకా ఏదో నేర్చుకోవాలన్న

తృష్ణ పెరుగుతుంది

ఆమె పలుకులు పట్టుకుచ్చుల్లా మెత్తగా ఉంటాయి

హృదయాన్ని స్పందింపజేస్తాయి

తెనుగు భాష తేనెమడుగులో శ్వేతకమలమై వికసిస్తుంది

ఆమె కవితా స్రవంతికి నదిలోకి అలల్లా

మదిలోని భావాలు

అందంగా ఆహ్లాదంగా కదులుతూన్నట్టనిపిస్తుంది

ఆమె సౌమ్యగుణం

మమకారానికి మాటలు నేర్పుతూన్నట్టుంటుంది

ఆమె మౌనం -

ఆలోచనలు రేపుతున్నట్టుంటుంది

ఆమె స్నేహం -

తీపిని మరిపిస్తుంది

అజ్ఞానాన్ని తరిమి కొట్టే వృత్తి ఆమెది

విజ్ఞానానికి హారతి పట్టే ప్రవృత్తి ఆమెది

అంత ఒదిగి వుండే లక్షణం ఆమెది

ఆమె తలపులన్నీ సాహితీ

తరంగాలే!

ఇచ్చకాలకు పోదు

రచ్చకెక్కదు

నిగర్వి ఆమె నిత్యాన్వేషి ఆమె

నిదానం ఆమె నినాదం

సంస్కారం ఆమె అలంకారం