Facebook Twitter
ముగ్గురమ్మల మూలపుటమ్మ - శారదా అశోకవర్ధన్

ముగ్గురమ్మల మూలపుటమ్మ


- శారదా అశోకవర్ధన్

 

నవమాసాలు మోసి ఎంతో ప్రయాసకోర్చి

జన్మనిస్తుంది కన్నతల్లి

పొత్తిళ్లలో పొదివి పట్టుకుని గుండెలకి హత్తుకుంటూ

స్తన్యమిచ్చి పెంచుతుంది తన బలాన్ని క్షీరధారగా మర్చి

గోరుముద్దలు తినిపిస్తుంది చందమామని చూపిస్తూ

పలుక నేర్పుతుంది అమ్మ ఆడిస్తూ లాలిస్తూ

ప్రాణానికి ప్రాణంగా కవచంలా నిలుస్తుంది

బుజ్జి బుజ్జి కబుర్లకి పదునుబెట్టి పాఠాలు నేర్పుతుంది పంతులమ్మై

మెదడుకు సానబట్టి తన మెదడులోవన్ని నీకు సరఫరా చేస్తుంది

తన పాండిత్య ప్రతిభను నీకు పంచుతుంది

అమ్మ నేర్పిన నడకకీ నడతకీ మరింత వన్నె తెస్తుంది

అమ్మ తరువాత అమ్మ అంతటిది పంతులమ్మ

అలా అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు

మరో అమ్మ కూడా వుంది - మూడో అమ్మ

ప్రతి మనిషికీ ఎప్పుడో అప్పుడు తగులుతుంది

తెల్లటి దుస్తుల్లో పాలరాతి బొమ్మలా వుంటుంది

మనసును కూడా తెల్లగా వుంచుకుంటూ

మలినాన్ని ఏరిపారేస్తుంది

ఆపదలో ప్రాణ రక్షణకు వెళ్ళిన వారికి

సపర్యలు చేసి కొత్త ఊపిరి పోస్తుంది

చిరునవ్వుతో బాధని తొలగించి ఉపశమనం కలిగిస్తుంది

పదునైన సూదిని మృదువైన మాటలతో నరాలకు గుచ్చి

నవ్వుతూ ఊరడిస్తుంది

ఆ అమ్మే నర్సూ ప్లస్ అమ్మ..... నర్సమ్మ!

ఈ ముగురమ్మలూ జీవనానికి ఆరో ప్రాణం

ఈ ముగురమ్మల మూలపుటమ్మ

కనిపించని కర్పూరపు బొమ్మ

మనసున్న మనిషి కే పలికే వరాలకొమ్మ

ఆమె పేరు మానవత్వం ఆమె ఊరు మంచితనం

ఎక్కడో అంతరాంతరాల్లో ఏదో ఒకమూల

ఇసుమంత స్థలముంటే ఇమిడిపోతుంది

గుండెలోపలి మమతనీ మనసు తెలిసిన మనిషినీ

అయస్కాంతంలా పసిగట్టి గబుక్కున లాగేసుకుంటుంది

ముగ్గురమ్మలకి మూలపుటమ్మ ఈ అమ్మ

మనుగడకి మూలస్తంభం ఈ బొమ్మ!

ఈ ముగురమ్మలకీ మంగళహారతులివ్వాలి

అప్పుడే ఈ భూమి మళ్ళీ పుణ్యభూమిగా మారుతుంది

సకల శాస్త్రాల వేదవల్లిగా మిగులుతుంది

అలా జరుగుతుందంటావా మానవుడా

సమానత్వ సౌభ్రాతృత్వం మళ్ళీ చిగురిస్తుందంటావా?