Facebook Twitter
కాళోజి

  కాళోజి

                                                    - డా. ఎ.రవీంద్రబాబు
 

     

      సాగిపోవుటే బ్రతుకు

      ఆగిపోవుటే చావు
      సాగిపోదలచిన
      ఆగరాదిచటెపుడు
                  అన్న కాళోజి ఎక్కడా రాజీపడి జీవించలేదు. వ్యక్తి స్వేచ్ఛకోసం, స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడారు. నిజాం పాలనైనా, స్వాతంత్ర భారతదేశమైనా ఆయనది ఎప్పుడూ ప్రజల పక్షమే. నిత్యం ప్రజలలో మమేకమై, ప్రజల కష్టాలను, బాధలను తెలుసుకొంటూ వారి మేలుకోసం పోరాటం చేశాడు. జీవితాన్నే ప్రజలకు అంకితం చేసిన మహానుభావుడు. ఎక్కడా అధికారాన్ని, అధికార దాహాన్ని, రాజ్యకాంక్షను ఒప్పుకో లేదు. వాటిని నిరంతరం వ్యతిరేకిస్తూ హక్కుల ఉద్యమంలో కూడా ప్రత్యక్షపాత్ర పోషించాడు. పోరాటంలో భాగంగా రచనలూ చేశాడు.
                  కాళోజీ 1914 సెప్టెంబరు 9న ఆనాటి హైదరాబాదు సంస్థానం సరిహద్దుగా ఉన్న రట్టహళ్ళిలో జన్మించాడు. తండ్రి రంగాగావు. తల్లి రమాబాయి. కొన్ని ఏళ్ల క్రితం వీరి పూర్వీకులు వరంగల్ వచ్చి స్థిరపడ్డారు. కాళోజీ అసలు పేరు - రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి. కాళోజీ పుట్టిన ఆరు నెలల లోపే వాళ్ల అమ్మ చనిపోవడంతో అన్నరామేశ్వర్ రావు పెంచాడు. అతనూ ఉర్దూలో గొప్పకవి, వకీలు. కాళోజీ ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మణికొండ, హైదరాబాదులలో చదివాడు. హైస్కూలు, కాలేజీ విద్యను వరంగల్ లో పూర్తి చేశాడు. 1939లో న్యాయవాద వృత్తిలో పట్టా పొందాడు. కాళోజీకి తెలుగు, ఉర్దూ, హిందీ,మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషలు వచ్చు. వీటిలో  రచనలు కూడా చేశాడు. 1940లో కాళోజీకి రుక్మిణమ్మతో వివాహం జరిగింది.
              కాళోజీ చదువుకునే రోజుల్లోనే ప్రజా ఉద్యమాలలో పనిచేశాడు. 1930 నుంచే గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. సత్యాగ్రహోద్యమంలోనూ పాల్గొన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా వరంగల్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించి నగరబహిష్కరణకు గురయ్యాడు. అంతేకాదు వరంగల్ లో నిజాం వద్దన్నా వినాయక ఉత్సవాలు జరిపాడు. ఆంధ్రసారస్వత పరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరు. స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను బహిష్కరిస్తే వారని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్చడంలో చాలా ప్రముఖపాత్ర పోషించాడు. అసలు ఆ రోజుల్లో నిజాం దమననీతికి వ్యతిరేకంగా, స్వతంత్రభారతలోనూ కరువైన ప్రజా హక్కులకోసం పోరాడారు. ఆంధ్రజనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహా సభ, తెలంగాణ రచయితల సంఘం లాంటి సంస్థల నిర్మాణాలలో వీరి పాత్ర వెలలేనిది.
       మనిషి మనిషిలా జీవిస్తే, ఇంకో మనిషిని మనిషిలా గౌరవిస్తే ప్రపంచం బాగుపడుతుందన్న ఆలోచన ఉన్నవాడు కాళోజీ. ఇచ్చయే నా ఈశ్వరుడు అని కచ్చితంగా నమ్మి ప్రజాభీష్టంకోసం పనిచేశాడు. మొత్తం మీద మూడుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఒకటి రెండు సార్లు ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయాడు. అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు వీరికి అనుంగు మిత్రుడు. కాళోజీ ఇల్లు ఎప్పుడూ వివిధ సిద్ధాంతాలకు కట్టుబడిన వాళ్లైన విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, శ్రీశ్రీ, యంటీఖాన్, కన్నభీరన్, బాలగోపాల్ లాంటి వాళ్ల చర్చలతో నిండి ఉండేది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతమైన భావాలు వీరివి. మనిషే వీరికి ముఖ్యం. 90 సంవత్సరాలు బతికిన కాళోజీ జీవితంలో 75 ఏళ్లకు పైగా ప్రజా జీవితమే. అందుకే దాశరథి లాంటి వాళ్లు వీరిని ప్రజావాణికి మైక్ అన్నారు.
           కాళోజీ కవిత్వం రాసినా, కథలు రాసినా ప్రజా జీవితంలో ఆయన ఉన్నప్పుడు కాళోజీకి కలిగిన ఆనందాలు, విషాదాలు... వాటి స్పందనలు మాత్రమే. మనిషిని కేంద్రంగా చేసుకుని, బతుకును ఆధారంగా చేసుకొని రాసినవే  ఆయన కవిత్వం, కథలు. 1943లోనే వీరి కథలు కాళోజీ కథలు పేరుతో అచ్చయినాయి. ఇక వీరి కవిత్వం నా గొడవ. ఇది నా గొడవ కాదు ప్రజల గొడవ. ఎవరు చదివితే వారికి వారి గొడవలా కనిపిస్తుంది. ఇతర  భాషా రచనలను తెలుగులోకి అనువాదం చేశాడు.
          కవి కూడా నేతగాడే
          బహు చక్కని సాలెగూడు అల్లువాడే
          రాజకీయ బల్లీ (యు)ల
          నోటికి అందక ఎగిరెడి పక్షి(యు)ల

           నేనంటే నేడు
           నా గొడవంటే నాడు
           నిజమో కాదో కల రుజువు
           నావు నేనూ వాడూ
            నేనంటే నేటి మనస్థితి వైనం
            నేనంటే భరత పౌరుడు
           నా గొడవ ఆ పౌరుని స్థితి... ... ఇలా కాళోజీ ప్రజల కవిత్వాన్నే తన కవిత్వంగా రాశాడు. ప్రజలకు, ప్రజల భావాలకు, ప్రజల ఈతిబాధలకు ప్రతీక చేశాడు. అందుకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక.  ఉదయం కానే కాదునుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ. అసామ్య సంఘంలో అర్జనయే దౌర్జన్యం... లాంటి ఎన్నో వాక్యాలు ప్రజల నోళ్లలో నానుతున్నాయి. పత్రికలకు పతాక శీర్షికలవుతున్నాయి. వీరి కవిత్వం అంతా నా గొడవ పేరుతో లభిస్తుంది.

          అన్యాయం, అక్రమం, పీడన ఎక్కడ ఉన్నా ఎదిరించడమే అతని లక్ష్యం. 1992లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కరాన్ని ఇస్తే, హక్కుల ఉద్యమాన్ని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చివరి వరకు వీడని కార్యసాధకుడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యునిగా కూడా కొంతకాలం కొనసాగాడు.

         ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే టీబీ వస్తే ఒక ఊఫిరితిత్తును తీసివేశారు. డాక్టర్లు ఎక్కవ మాట్లాడితే  ఆరునెలల్లో చచ్చిపోతావు అని చెప్పారు. కానీ కాళోజీ మాట్లాడకపోతే ఆరు రోజుల్లో చచ్చిపోతాను అన్నాడు. అలా 70 ఏళ్లు ఒక్క ఊపిరితిత్తుతో ప్రజా పోరాటాలను భూజానకెత్తుకొని నడిపిన కాళోజీ 2002 నవంబరు 13 న కన్నుమూశాడు.
              ఆయన ఒక ఓదార్పు
              ఆయన  ఒక ఆర్తి
              ఆయన ఒక భరోసా
              ఆయన ఒక చైతన్యం
              ఆయన ఒక వైతాళికుడు.
              కాళోజీ  ఒక విశ్వమానవుడు.