Facebook Twitter
ఆమె అక్షర వనమాలి

 

ఆమె అక్షర వనమాలి

రచన అంటే ఏమిటి? రచయితలు ఎవరు? ఫలానా వారే రాయాలి అని నియమం ఏమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలు కొంతమంది యువ రచయితల మనసుల్ని తొలిచేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పటివరకూ ఉపాధ్యాయ, పాత్రికేయ రంగాలలో పనిచేసేవారే ఎక్కువగా రచనలు చేస్తున్నారు. అందువలన రచన అంటే ప్రత్యేకించి ఆ రంగాల వారికే పరిమితం అనే భావన తీసుకొచ్చారు. దీనివలన సహజంగా రచనా పటిమ ఉండి తెర వెనుక మిగిలిపోయిన ఇతర రంగాలలో పని చేసే కవితా సూర్యులు, కథా యోధులు, నవలా నాయకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి కొత్త రచయితలకు మార్గనిర్దేశం చేసి సాహితీ ప్రపంచానికి పరిచయం చేయాలనే గొప్ప ఆలోచన చేశారు అనూ రేవళ్ళ. కిరణ్ విభావరిగా అందరికీ పరిచయస్తురాలు. ఆమె మనో సంకల్పం నుండి పుట్టిందే అంతర్జాల వేదిక " తపన రచయితల కర్మాగారం" ఫేస్బుక్ గ్రూప్. మిత్రులు రవీంద్ర రావెళ్ళ, శ్రావణి గుమ్మరాజు గారితో కలిసి మొదలు పెట్టిన ఏడాది కాలంలోనే తపన గ్రూప్ సభ్యుల సంఖ్య ఆరు వేలమందికి చేరింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రస్తుతం అనిల సందీప్ మరియు నిష్కల సతివాడ గారితో కిరణ్ విభావరి గారు ఈ గ్రూపుకు సారథ్యం వహిస్తున్నారు.

 ఈమధ్య కాలంలో రచన పట్ల ఎక్కువమంది ఔత్సాహికులు ఆశక్తి చూపిస్తున్నారు. తద్వారా పుస్తకాలు చదివే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది శుభపరిణామం. అయితే వారికి సరైన దిశా నిర్దేశం చేయడానికి ఖచ్చితమైన అంతర్జాల వేదిక ఏదీ లేదు. కానీ ప్రస్తుతము అలాంటి కొత్త రచయితలకు తపన వేదిక  ఒక గురుకుల పాఠశాలలా పని చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. 

* కిరణ్ విభావరి 

కిరణ్ విభావరి తపన గ్రూప్ ప్రారంభించక ముందు సాహిత్యం పై ఆశక్తి ఉండి రాయాలనే తపన ఉన్న ఒక విద్యార్థిని. రాయాలి అనే తృష్ణ ఆమెను కుదురుగా ఉండనీయలేదు. అలా అని తొందరపడి అర్థంలేని రచనలకు పోలేదు. ముందుగా  తెలుగు సాహిత్యాన్ని, పెద్దవాళ్ల రచనల్ని బాగా విస్తృతంగా అధ్యయనం చేశారు. వందలాది పుస్తకాలు, కథలు చదివారు. తర్వాత రచనా ప్రయాణాన్ని మొదలు పెట్టారు. గురుమంచి రాజేంద్ర శర్మ గారి కథ చదివి అందులోని విభావరి పాత్ర నచ్చి, తన పేరుకి చివర విభావరి అని చేర్చుకున్నారు.నిజానికి తన పేరు వినూత్నంగా వైవిధ్యంగా ఉండడానికి విభావరి అనే ఈ కలం పేరే దోహదం చేసిందని చెప్తుంటారు.

కవిత్వం రాసింది తక్కువ. కానీ చాలా తక్కువ సమయంలోనే NATA, NATS, జాషువా పురస్కారాలను ఒకే కాలంలో అందుకున్నారు.మరెన్నో కథల పోటీలో విజేతగా నిలిచారు. తను రాసిన "కాఫీ పెట్టవు" కథకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమె సున్నితమైన రచనా శైలికి చక్కని ఉదాహరణ "కాఫీ పెట్టవు" కథ. ఈ ప్రయాణంలో, ఎన్నో ఏళ్ల నుండి సాగుతున్న చాదస్తపు సమూహాలకు ఎడంగా జరిగి కొత్త రచయితలు, యువ కలాలు,గళాలతో తనకు పరిచయం జరిగింది. ఎంతో చక్కని రచనా సృజన ఉండి గుర్తింపు లేని ఎంతోమంది యువ రచయితలు ఉన్నారని గ్రహించారు. రాసిన కవితను, కథను లేదా ఇంకేదైన రచనల్ని ఎలా పాఠకులకు చేర్చాలి, పత్రికలకు ఎలా పంపాలి, పోటీల వివరాలు తెలీక చాలామంది తమ రచనల్ని అటకెక్కిస్తున్న వైనం చూశారు. అయితే ఈ సమస్యలన్నింటికి పరిస్కారంగా మనమే ఒక సొంత వేదిక ఏర్పాటు చేసుకుందాము అని తలచి స్నేహితుల సమాలోచనలోంచి తపన రచయితల కర్మాగారానికి శ్రీకారం చుట్టారు. అక్షరాల పూల తోటకు వనామాలిగా అవిశ్రాంత సాహిత్య సేవ చేస్తున్నారు. నూతన చేతన యువ కలాలకు మార్గదర్శి అయ్యారు.

 

*తపన రచయితల కర్మాగారం సేవలు

 ఈ గ్రూపు మొదలుపెట్టి ఏడాది కూడా పూర్తి కాలేదు దాదాపు 6 వేల మంది ఔత్సాహిక యువ రచయితలతో పాటు లబ్ద ప్రతిష్ట రచయితలూ ఉన్నారు. పిల్లల పెద్దల మేలుకలయికతో వారి అనుభవాలు సూచనలు సలహాలతో గ్రూపు నుండి ఎందరో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. సాహిత్యం గురించి తెలుసుకునే పరంలో తాను ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో  అది మరొకరు అనుభవించకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ గ్రూపును ఏర్పాటు చేయడం జరిగింది. అదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది గ్రూప్. ఎటువంటి సాహిత్యపరమైన సందేహం అడిగినా చిటికెలో సమాధానం దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? కొత్తగా రాయాలి అనుకున్నవారు, రాస్తున్నవారు ఎవరైనా సరే, సీనియర్ రచయితల భిన్న అనుభవాల నుండి ఎంతో కొంత తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చు. ఇబ్బడిముబ్బడిగా ఉన్న రచయితల్లో రచన సామర్థ్యం కొరతగా ఉంది. వారిలో  కొత్త కొత్త ఆలోచనలు ఉన్నా వాటికి అక్షర రూపం ఇవ్వడంలో కాస్త తడబడుతున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చే విధంగా ప్రతి వారం, కొన్ని కొత్త పాఠాల్ని చెబుతూ గ్రూప్ లో కొందరు మార్గదర్శకులు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పత్రికల ఇమెయిల్స్ ని , ప్రముఖ పోటీల వివరాలను గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతే కాకుండా గతంలో ఎలాంటి కథలకు నిర్వాహకులు ప్రాధాన్యత ఇచ్చారు అని కూడా వీలుని బట్టి చర్చిస్తారు. ఇంత యంత్రాంగాన్ని వెనుకుండి నడిపిస్తున్న కిరణ్ విభావరి ఎంతోమంది యువతకు ఆదర్శం. 
  
ఆమె మాటల్లో...!

"ఏ రచయిత కూడా మొదటిసారి కలాన్ని కదిలించగానే గొప్పసాహితీకారుల జాబితాలో చేరిపోలేదు. సాధన మాత్రమే  సవ్యసాచిలా నిలబెట్టగలదు. కానీ ఒక్క మాట సాహిత్యాన్ని చదువుతూ,రాస్తూ,విశ్లేషించుకుంటూ సాగాలని అనుకుంటున్న మేము తప్పక సాహిత్యంలో మంచి స్థాయికి వెళతామనే నమ్మకం ఉంది. అలాగే మేమొక్కరమే ఎదగాలనే అత్యాశ మాకు లేదు ఎందుకంటే ఎవరి మేధస్సు వారిది. పరులు దొంగిలించలేనిది మన మేధస్సును మాత్రమే అనే పెద్దలు చెప్పిన విషయం అందరికి ఎరుకే. మేము మొదలు పెడుతున్న ఈ తపన ద్వారా సాహిత్యంలో అభివృద్ధి చెంది మీరు గొప్పగా నిలిస్తే ఈ తపనను రూపకల్పన చేసినందుకు మాకు ఎంతో తృప్తి, అదే మాకు పదివేలు".

"ఒంటరి ప్రయాణం కంటే అందరూ కలిసి వేసే అడుగు గొప్పలక్ష్యం వైపు సులభంగా చేరడానికి దోహద పడుతుంది.. అందుకే మేము మా ప్రయాణం మొదలు పెట్టాం,మాతో మిమ్మల్ని నడవమంటున్నాం. ఒకరి అనుభవాలు, సాహితీ సుమాలను పంచుకుంటూ మన తెలుగు సాహిత్యాన్ని  ప్రపంచస్థాయి లో నిలబెట్టడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. ప్రపంచస్థాయి నా అని సందేహ పడకండి. If you think you can, you can." అంటారు ఆమె.

◆ వెంకటేష్ పువ్వాడ