Facebook Twitter
బహుముఖ ప్రజ్ఞాశాలి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి

 

బహుముఖ ప్రజ్ఞాశాలి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి

 
మెరిసే వర్చస్సు
ముదిమిచేరిన తరగని సొగసు
స్త్రీత్వంలోని సొబగుతో కూడిన నటనా తపస్సు
బుర్రావారికి మాత్రమే లభించిన దేవుడి ఆశీస్సు
1937వ సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో జన్మించారు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి. బాగా పసితనంలోనే కమ్మగా పాటలు పాడటం, విన్న పద్యాలను శ్రావ్యంగా కంఠస్థం చేసి ఆలపించడం ఆయనకి జన్మతః భగవంతుడిచ్చిన వరాలు.
ఆయన పాటలు, పద్యాలు విని మంత్రముగ్ధుడైన మేనమామ కోటేశ్వర్రావు వానపాముల సత్యనారాయణ అనే గురువుదగ్గర జేర్పించారు.
సర్వకళల సమన్వితుడు సుబ్రహ్మణ్యశాస్త్రి:
ఆయన చేతివేళ్ళళ్లోకి కుంచె చేరిదంటే అద్భుతమైన చిత్రాలు ఆవిష్కరింపబడతాయి. ఆచేతులు కాళ్ళు చక్కటి నాట్యాన్ని అభినయించి చారెడుకళ్ళ హావభావాలతో సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.
నాటకరంగ ప్రవేశం:
1953లో ఖిల్జీరాజ్యపతనంలో దేవళ అనే స్త్రీపాత్రని యాదృచ్ఛికంగా పోషించారు సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆపాత్ర ఆయనకి దిశానిర్దేశం చేసింది. ఆయన హావభావాలు. వాచకం అందరినీ అలరించాయి.
ఆధ్యాత్మికవేత్తగా బుర్రావారు:
రామాయణ, భారత, భాగవతాలు, వేదాలు, ఇతిహాసాలు, పంచతంత్ర అంశాలు ఏవైనా వారికి కంఠోపాఠాలు. ఆధ్యాత్మిక ప్రసంగాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా అందరికీ చెప్పడం ఆయనకి అలవాటు.
నిరాడంబరుడు, నిగర్వి:
అందరినీ గౌరవించడం, అభిమానంగా మసలుకోవడం సుబ్రహ్మణ్యంగారికి మొదటినుండి అలవాటు. సంప్రదాయ కుటుంబంలో పుట్టడం, కన్నవారి నుండి సంస్కారాన్ని నేర్చుకోవడం జరిగింది. హిందుత్వ పరిరక్షణ, భారతీయతత్వాన్ని ప్రబోధించడం ఆయన కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు.
స్త్రీ పాత్రలు కొన్ని సుబ్రహ్మణ్యశాస్త్రి స్వంతాలు:
సతీ సక్కుబాయి, మధురవాణి రెండూ విభిన్నమైన పాత్రలు. వాటి రెండింటికీ సమానంగా న్యాయం చేసి, ఔరా అనిపించారాయన. శశిరేఖ, సత్యభాల పాత్రలలో పరకాయ ప్రవేశం చేసారు. యోగి, వేమనలో మాధురిగా అలరించారు. ప్రజానాయకుడు ప్రకాశంలో ప్రకాశం తల్లిగా ఆయన నటన అందరికీ అన్ని వేళలా గుర్తుంటుంది. వెనకటి వితంతువులు తెల్లిటి చీర, బోడిగుండు, బోసి చేతులు, మెడ, జాకెట్టు వేసుకోకున్నా నిండుగా చీరకప్పుకుని తలవంచి పరపురుషులతో కరుణరసాత్మకంగా మాట్లాడేవిధానం. ఒంటిచేత్తో పూటకూళ్ళలో పిల్లాడిని చదివించాలని ఆమె పడిన తాపత్రయం ఆయన నటనకి నాణ్యతని అందించాయి. ఈయన గొప్ప రచయిత కూడా.
కళాకారుడిగా పురస్కారాలు:
తెలుగువిశ్వవిద్యాలయం ఉత్తమనటుడు అవార్డునిచ్చింది. రాష్ట్రస్థాయి అగ్రశేణి నటుడి అవార్డు సుబ్రహ్మణ్యశాస్త్రిని వరించింది. కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ నాట్యాచార్య బిరుదునీ, కొండవీటి వెంకటకవిచే నాట్యమయూరి బిరుదుని పొందిన సుబ్రహ్మణ్యశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటించడం, రాయడం చిత్రాలుగీయడం నాట్యంలో ప్రావీణ్యత ప్రదర్శించడంలో తనకి తానేసాటిగా ఉన్న బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి కారణజన్ముడు, అనుసరణీయుడు, ఆరాధ్యనీయుడు.

డా|| గురజాడ శోభాపేరిందేవి,
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో