Facebook Twitter
మనమే నయం

మనమే నయం (కథ)

 


                              
              

కాళోజీ నారాయణరావు

      కాళోజీ ఆధునిక తెలంగాణ సామాజిక, సాహిత్యానికి పెద్ద దిక్కు. ఉద్యమకారుడు. ప్రజల జీవితాలను అతని గొడవ భావించి నాగొడవ పేరుతో ఆత్మకథ అందించిన సాహసి. కథలు రాశాడు. పాటలు రాశాడు. ఒకప్పటి తెలంగాణ ఉద్యమాన్ని అక్షరబద్దం చేశాడు. బహుభాషావేత్త. సమాజంలోని హెచ్చుతగ్గులపై పోరాటం సల్పిన వీరుడు. హైదరాబాదులో ఆంధ్రసారస్వత పరిషత్తు స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అసలు కాళోజీ జీవితమే ఉద్యమాల చరిత్రకు మారురూపం. అలాంటి కాళోజీ రచించిన కథల్లో సామాజిక వాస్తవికత, శిల్పం కలగలిసి ఉంటాయి. అలాంటిదే మనమే నయం కథ.
         మనుషుల గురించి, జంతువుల గురించి అద్భుతంగా రాసిన కథ మనమే నయం. ఈ కథకు ఎద్దుల సంభాషణే ప్రాణం. కథ విషయానికి వస్తే... ఎల్లయ్య తన రెండు ఎద్దులను అన్నిరోజులకు భిన్నంగా ఆ రోజు పూలదండలు, కుంకమతో అలంకరిస్తాడు. వాటిలోని నల్ల ఎద్దు, తెల్లఎద్దుతో ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతుంది. కొద్దిగా ఓపికపట్టు అన్ని తెలుస్తాయి ముందు అని చెప్తుంది తెల్లఎద్దు. ఎల్లయ్య రెండు ఎద్దులను డాబుగా అలంకరించి ఎస్.పి.పి.ఎ. (జంతువుల యెడ జరుగు అన్యాయ నిరోధక సంఘం) వారి వార్షికోత్సవంలో జరిగే ఊరేగింపుకు తీసుకెళ్తాడు. అక్కడ లక్షాధికారులు, విద్యావంతులు, రాజకీయనాయకులు, సంఘాలు, కులాలు, మతాల ప్రతినిధుల మధ్య ఎడ్లు, గుర్రాలు, ఆవుల ఊరేగింపు గొప్పగా జరుగుతుంది.
          అక్కడ సంఘకార్యదర్శి వారి నివేదికలో ఎన్ని వందల ముల్లుకట్టెలు విరగగొట్టినది, బండ్లవాండ్లను, జడ్కావాళ్లను బక్కవాటిని, గాయపడిన వాటిని, ఎడ్లను, గుర్రాలను, బండ్లకు కట్టినందుకుగాను కోర్టుకెక్కించిన జరిమానాలను విరించాడు. తర్వాత జంతువుల కష్టాలు, ఇబ్బందులు, వాటిని మాన్పడానికి ఉపాయాలు... ఇలా పలు అంశాల గురించి జంతువులపై జాలితో, వాటి రక్షణకై పలు అంశాలపై ఉపన్యాసాలు చేస్తారు. ఊరేగింపు, సభ అయిపోయాక, నల్లఎద్దుతో తెల్ల ఎద్దు అందులోని తిరకాసు గురించి వివరిస్తుంది. మనుష్యులలో కొందరు, పనిబాట లేనివాళ్లు, మనతో ప్రత్యేక్షంగా ఏ సంబంధం లేని వాళ్లు, మనకోసం ఓ సంస్థ స్థాపించారు. మన రక్షణకోసం అనేకరకాలుగా కృషి చేస్తున్నారట. కానీ, వీరికి కరకర నరకబడే జంతువులపై జాలి లేదు. తెల్లవారే సరికి లక్షల కోళ్లు, గొర్రెలు, ఆవులు, ఎడ్లు వీరుకి ఆహారం కొరకు నరకబడుతున్నాయి. అవన్నీ ఆరోగ్యంగా ఉండేవే. కానీ వాటి గురించి ఏమీ వీళ్లకు పట్టదు. అని వారి దైనందిన జీవితం గురించి చెప్తుంది.
       అందుకు నల్లఎద్దు నీవు చెప్పింది నిజమే... కానీ మనల్ని ఇంతగా కష్టపెట్టే ఆ నరుల జీవితం ఏమంత బాగా ఏడ్చింది. అత్యల్ప సంఖ్యాకులైన భాగ్యవంతులు తప్ప మిగతా కోట్లకొద్ది ప్రజల జీవితం మనకన్నా ఎన్నియో రెట్లు అసహ్యంగా ఉంది. వారిని ఉద్దరించడానికి సంఘమొకటీ లేదు. మనకు ఏదో ఒకటి ఉంది. కొంతవరకు నయమే అంటుంది. క్లుప్తంగా కథ ఇది.
      జంతువులు మనుషుల్లా మాట్లాడే కథ ఇధి. కానీ నీతికథ కాదు. సమాజం పై వ్యంగ్య రూపకం. కథ సర్వసాక్షి దృక్కోణంలో సాగుతుంది. కాళోజి చెప్పాల్సిన విషయాలను జంతువుల పాత్ర ద్వారా చెప్పారు. ఆఖరకు జంతువులకు ఉన్న రక్షణకూడా సాధారణ ప్రజలకు లేదు. దోపిడీకి గురవుతున్నారన్నది కథలో అంతర్లీనంగా చెప్పబడింది. కథలో ఎత్తుగడ, సన్నివేశం, ముంగిపుల మధ్య ఓ అల్లిక ఉంది. అదే కథకు ప్రాణమైన శిల్పం. భాషలో అప్పటి గ్రాధిక వాసనలు కనిపిస్తున్నాయి. బుక్కాగులాలు, బ్యారేడు జోడులు లాంటివి తెలంగాణ పదాలకు ఉదాహరణలని చెప్పాలి.ఈ కథ 1943లో వచ్చింది. కానీ ఇప్పటి ప్రపంచాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ కథ ఎప్పటికీ నిలిచే ఉండే సామాజిక సత్యం లాంటిది.

                                                            - డా. ఎ.రవీంద్రబాబు