Facebook Twitter
అసాధ్యుడు (పివి మొగ్గలు)

అసాధ్యుడు (పివి మొగ్గలు)


జీవితంలో తొలి ఉద్యమప్రస్థానానికి శ్రీకారం చుట్టి
వందేమాతర ఉద్యమంతో వేకువకిరణమై వెలిగిండు
పివి పోరాటానికి పాదులువేసింది వందేమాతరోద్యమం 

నిజాం నియంత పాలన విముక్తికోసం కంకణబద్ధుడై
వారి ఆకృత్యాలపై అలుపెరుగని పోరాటం చేసిండు
ఉవ్వెత్తున ఎగిసిపడిన విప్లవ ఉద్యమ కెరటం పివి

అతిపెద్ద భూస్వామ్యకుటుంబంలో తాను పుట్టినప్పటికీ
పేదల బతుకులను మార్చాలని తపనపడ్డ ఉద్యమశీలి
పేదలకు భూములను పంచిపెట్టిన ఉదారస్వభావి పివి

స్వామి రామానంద తీర్థ అనునూయుడిగా అరుదెంచి
సోషలిస్టు నాయకుడిగా అవతరించిన అభ్యుదయవాది
గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమపథగామి పివి

పూవు పుట్టగానే సహస్రదళాలతో పరిమళించినట్లుగా
బాల్యంలోనే అసమాన పాండిత్యాన్ని ప్రదర్శించిన దిట్ట
సామాజికతను ఒంటబట్టించుకున్న అపారదేశభక్తుడు పివి

మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని సంకల్పించి
తెలుగు అకాడమిని స్థాపించిన అసలైన భాషాభిమాని
అధికారిక మాతృభాష విద్యావిధాయక రూపకర్త పివి

నిరుపేదలవారికి విద్య అందించాలనే సదాశయంతో
గురుకుల పాఠశాలలను నెలకొల్పిన విద్యాజ్యోతి
విద్యారంగ వ్యవస్థలోనే పెనువిప్లవం గురుకులాలు

ఒకపక్క విద్యార్జనలో నిమగ్నమై చదువుకుంటూనే
మరోవైపు సమాజసేవనే దేశసేవగా తరించిన ప్రాజ్ఞుడు
నాటి ఉద్యమదీప్తులే పివి రాజకీయబాటకు పునాదులు

దేశంలోనే తొలిసారిగా ఇంటర్ విద్యను ప్రవేశపెట్టి
పేదధనిక వర్గాలకు విద్యను పంచిన మహితాత్ముడు
గుణాత్మకమైన ఇంటర్ విద్యకు పితామహుడు పివి

సరళీకృత ఆర్థిక విధానాలకు అంకురార్పణ చేసి
బలోపేతమైన వ్యవస్థాకృతికి పాదులు వేసినవాడు
భారతదేశ ఆర్థిక ఉద్యమానికి స్ఫూర్తిప్రదాత పివి

హింసాత్మక సంఘటనలకు ఆలవాలమైన పంజాబులో
సమయస్ఫూర్తితో ప్రశాంతత చేకూర్చిన రాజనీతిజ్ఞుడు
దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పింది పివి

దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలనే చెట్లను నాటి
భవిష్యత్తుకు సరళీకరణ ఫలాలను అందించిన ఘనుడు
భారతదేశ నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పివి

సమున్నత సంపాదక ప్రతిభతో సంచికలను రూపొందించి
విశేష సంచికలకు ప్రాణం పోసిన సంపాదక సంపన్నుడు
అశేషమైన ప్రత్యేక సంచికల సంపాదక రూపశిల్పి పివి

ఆర్థిక సంస్కరణల ముళ్ళబాటను పూలరథంలా మార్చి
దేశాన్ని అభ్యుదయపథంలోకి నడిపించిన పురోగామి
నాటి సంస్కరణల ఫలం నేటి కళ్ళముందున్న నవభారతం

మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళ నాయకత్వంతో
దేశానికి సుస్థిరపాలన అందించిన పరిపాలనాదక్షుడు
అపార పరిజ్ఞానం గల దక్షిణభారత తొలిప్రధాని పివి

రాజకీయజీవితంలో ఆటుపోట్లనెన్నింటినో ఎదుర్కొని
తలపండిన మేధావిగా ప్రకాశించిన అసామాన్యుడు
సమయస్ఫూర్తితో నెగ్గుకొచ్చిన సహనశీలి మన పివి

తాను నమ్మిన సిద్ధాంతాలకు నిబద్ధ జీవుడవుతూనే
ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడిన పాలనాబద్ధుడు
రాజకీయంలో ప్రజాస్వామ్యాన్ని వెలిగించినవాడు పివి

రాజకీయాల్లో ఎన్నోసార్లు మౌనవ్రతం పాటిస్తూనే 
ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నాడు
నిర్ణయం తీసుకోకపోవడం ఒక నిర్ణయమన్నవాడు పివి

అంతర్జాతీయ వ్యవహారాలలో నెహ్రూ బాటలో నడిచి
భారతదేశ ఆర్థికపరిస్థితిని చక్కదిద్దిన ఆర్థికనిపుణుడు
దేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి పివి

విద్యాశాఖను మానవవనరుల అభివృద్ధి శాఖగా మార్చి
విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చిన అభ్యుదయవాది
విద్యాశాఖను బలోపేతం చేసిన సంస్కరణలశీలి పివి

నిరంతర సంస్కరణ నిచ్చెనమెట్లతో తాను ఎదుగుతూ
అందరికీ అభివృద్ధిఫలాలను అందించిన అభ్యుదయవాది
సంస్కరణలకు చిరునామాగా నిలిచిన పథగామి పివి

కలసిరాని కాలంలో సమస్యలతో నిత్యపోరాటం చేసి 
దేశ విజయపతాకను ఎగురవేసిన అపరచాణక్యుడు
ప్రజాస్వామ్య చరితకు అసలైన చిరునామా పివి

పటిష్ట భూసంస్కరణ చట్టాలతో భూపంపకాలను చేపట్టి
స్వయంగా తనభూములను ధారాదత్తం చేసిన విప్లవవాది
భూ సమస్యలను పరిష్కరించిన అపరమేధావి పివి

అత్యున్నతమైన దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన
మొట్టమొదటి దక్షిణ భారతీయ రాజకీయ దురంధరుడు
తెలంగాణ ముద్దుబిడ్డగా చరిత్ర సృష్టించిన ఘనుడు పివి
 
విశ్వనాథ  సత్యనారాయణ "వేయిపడగలు" నవలను
హిందీలోకి "సహస్రఫణ్" గా అనువదించిన పండితుడు
అపురూపమైన అనుసృజనకు అసలైన భాష్యం పివి

హిందీ నవలాసాహిత్యంలో అగ్రశ్రేణి రచనగా ఖ్యాతిపొంది
యావత్భారతంలో సాహితీ అభిమానులను అలరించినది
హిందీలో విజయకేతనం ఎగురవేసిన నవల "సహస్రఫణ్"

బహుభాషా గ్రంథాలను సృజనాత్మకంగా అనువదించి 
తెలుగు భాషానువాద నైపుణ్యానికి నిదర్శనమై నిలిచాడు
మరాఠి భాషాప్రావీణ్యానికి నిదర్శనం పివి అబల జీవితం

ఉన్నతమైన రాజకీయ పదవులలో ఒదిగి ఎదుగుతూనే
పాలనాపరమైన చైతన్యాన్ని రగిలించిన కార్యాదక్షుడు
అలంకరించిన పదవులకే వన్నెతెచ్చిన రాజనీతిజ్ఞుడు పివి

సరళమైన శైలిలో తెలంగాణ పదబంధాలను వాడుతూ
సందర్భోచిత సంభాషణలకు ప్రాణంపోసిన మరాఠి నవల
పివి సాహిత్యంలోనే విశిష్టమైనది అబల జీవితం నవల

హాస్య వ్యంగ్య అధిక్షేప రచనలను తన నవలల్లో చిత్రించి
సమకాలీన రాజకీయ ఎత్తుగడలను తూర్పూరపట్టాడు
రాజకీయ పరిణతతో నవలలు రాసిన సాహసి మన పివి

అకుంఠితదీక్షతో బహుభాషలను పట్టుదలగా నేర్చుకుని
భారతీయాత్మకు మారుపేరుగా నిలిచిన భాషాధురీణుడు
బహుభాషావేత్తగా రాణించిన రాజకీయదురంధరుడు పివి

సామాజిక సమస్యలపట్ల లోతైన అవగాహన కలిగి ఉండి
అభివృద్ధికి కారకమైన సంస్కరణలను ప్రవేశపెట్టిన ధీశాలి
నిత్యసంస్కరణలకు నాందిపలికిన మేధోసంపన్నుడు పివి

ప్రపంచ ఆర్థిక వాణిజ్య సంబంధాలను పటిష్టపరచడంలో
దేశాధినేతల మన్ననలను పొందిన ప్రజాయుత సంస్కర్త
భారతదేశ ఆర్థికరంగాన్ని మలుపు తిప్పిన ఘనుడు పివి

వివిధ దేశాల అధ్యక్షులు పివి ప్రతిభను కీర్తించడమే గాక
గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రశంసలందుకున్న సమర్థుడు
అంతర్జాతీయ యవనికపై దేశజండాను నిలిపినవాడు పివి

నమ్ముకన్న సిద్ధాంతాలనే తాను ఆభరణాలుగా ధరించి
ఆత్మవిశ్వాసంతో అడుగులువేసి విజయం సాధించిన దిట్ట
రాజకీయతేజస్సుతో రాణించి విశ్వంలో వినుతికెక్కిన పివి
 
విదేశాంగమంత్రిగా గొప్ప దౌత్యసంబంధాలను నెలకొల్పి
భారతదేశ అభివృద్ధికి రాచబాటలు వేసిన రాజనీతిజ్ఞుడు
శత్రుదేశాలను మిత్రదేశాలుగా మలిచిన దౌత్యవేత్త పివి

ప్రతికూల ప్రభావాలను అనుకూలంగా నిర్దేశించుకుని
స్వపక్షీయులను సైతం అబ్బురపరిచిన అజేయుడు
రాజకీయ రణరంగాన్ని ఏలిన విలక్షణ రాజనీతిజ్ఞుడు పివి

స్వతంత్ర భారతదేశ పన్నెండవ ప్రధాని పదవిని అధిష్ఠించి
భారతదేశ రూపురేఖలను మార్చేసిన ఆధునిక నిర్మాత
ప్రధానమంత్రిగా రాణించిన అద్వితీయ ప్రజ్ఞావంతుడు పివి

దేశంలో అణుబాంబు తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టి
సాహసోపేతమైన చర్యలకు నాందిపలికిన సాహసవీరుడు
పోఖ్రాన్ అణుపరీక్ష విజయానికి కారణమైన సాహసి పివి

వాక్కులు రసగంగాప్రవాహంతో ఛలోక్తులతో శోభింపజేసి
రసజ్ఞులను ఆనందపరవశులను చేసిన హాస్యచతురుడు
ఆహుతులను ఆనందడోలికల్లో అలరించినచమత్కారిపివి

కోట్లాదిమంది భారతీయుల జీవనగతులను మార్చివేసి
వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేసిన అపరమేధావి
మహోన్నత నేతగా మహిలో వెలిసిన మహితాత్ముడు పివి

నాడు దూరదృష్టితో నాటిన విదేశాంగ విధానాల పాదులు
నేటికీ అంతర్జాతీయ బంధాలను సుసంపన్నం చేస్తున్నాయి
ఆధునికవాణిజ్యానికి తెరలేపిన నవీన మార్గదర్శకుడుపివి

రాజకీయంలో ఎప్పుడూ మౌనభాషియై ఒప్పారుతూనే
అనేకవిమర్శలకు మౌనంతోనే సమాధానమిచ్చిన ఘనుడు
మౌనాన్ని అలంకారప్రాయంగా ధరించిన జ్ఞానశిఖరం పివి

భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానంగా అనువదించి
ఆంగ్లచట్టాలను తెలుగులోకి మార్చమన్న భాషాభిమాని
తెలుగు భాషకు గండపెండేరం తొడిగిన ఠీవి మన పివి

కలుషితమయిన రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసి
ఐదు సంవత్సరాలు పరిపాలించిన నాటి మేటి ప్రధాని
చాణక్యనీతితో నీతివంతమైన పాలన అందించింది పివి

తనదైన రాజకీయ చాతుర్యంతో ఒక్కొక్కమెట్టు ఎక్కి
అతిరథ మహారథులను అధిగమించిన అగ్రభూమిక
అధిష్టించిన పదవులకు అలంకారప్రాయ ఆకారం పివి

అగ్రరాజ్యాలతో సమానంగా అణుపరీక్షలకు నాందిపలికి
భారతదేశ అణుశక్తిని ప్రపంచానికి చాటిన దార్శనికుడు
ప్రపంచ దేశాలన్నింటికీ దేశ ఉనికిని చాటింది పివి ఘనత

దేశప్రగతికి ఉజ్వలమైన పటిష్టమైన దారులను నిర్మించి
దేశాభివృద్ధికి పట్టం కట్టిన రాజకీయ మేరునగధీరుడు
అసాధారణమైన మహోన్నత దార్శనికుడు మన పివి

మానవజాతి శ్రేయస్సుకై గాంధీజీ సిద్ధాంతాలను ఆరాధించి
ఆయన అడుగుజాడలలో నడిచిన చైతన్య జీవధార
గాంధీజీ స్ఫూర్తితో ప్రజాసేవకు అంకితమైనసేనాని పివి

భారతదేశ అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి
విదేశీ సంబంధాలను సుసంపన్నంగా పటిష్టం చేసినవాడు
శత్రుదేశాలను సైతం మిత్రదేశాలుగా మలిచిన నేర్పరి పివి

భూసంస్కరణల చట్టం చేసి శాసనసభలో ప్రవేశపెట్టి
గాంధీజీ కలైన గ్రామస్వరాజ్యానికి అంకురార్పణ చేసిండు
సురాజ్యం కోసం నడుంబిగించిన నవయుగ ధృవతార పివి

తెలంగాణ సాయుధ పోరాటాన్ని సజీవంగా నిలుపుతూ
"గొల్ల రామవ్వ" అనే అత్యద్భుతమైన కథను రచించిండు
తెలంగాణ మాండలిక పదాలతో కథలు రాసినవాడు పివి

విదేశాల్లో నలభైఏడు టన్నుల బంగారాన్ని కుదువబెట్టినా
సంస్కరణల ఆయుధాలతో దేశానికి రప్పించిన మేధావి
ఆర్థిక సరళీకరణ సంస్కరణల పితామహుడు మన పివి

అనర్గళమైన అద్భుత ప్రసంగాలతో అలరించే వాగ్ధాటియై
ఉపదేశాలతో సభికులను ఉత్సాహపరిచే ఉపన్యాసకేసరి
ప్రవచించే సారాంశంలో విశేష అభినివేశం పివి సొంతం

సంస్కరణలతో భారతదేశ జెండాను విదేశాల్లో ఎగురవేసి
ప్రపంచాన్ని సరళీకరణంచేసి ఏకతాస్వరాన్ని వినిపించిండు
ప్రపంచానికి సరికొత్త దేశాన్ని పరిచయం చేసినవాడు పివి

భారతదేశ రాజకీయాల్లో అపర బృహస్పతిగా రాణించి
అందరికీ ఆత్మబంధువుగా నిలిచిన అనంతమైన మేధోశక్తి
రాజకీయ బంధువులందరికీ తలలోని నాలుక మన పివి

ప్రజాశ్రేయస్సుకై పరితపిస్తూ సామ్యవాదబాటలోనే నడిచి
సమతావాదాన్ని బలంగా చాటిన అసలైన సామ్యవాది
సగటు భారతీయుడి ప్రయోజనమే పివి సంస్కరణాభిలాషి

అమెరికా చైనా జర్మనీ దేశాలతో సత్సంబంధాలను నెరపి
బలమైన విదేశీ విధానాలను కొనసాగించేటట్లు చేసిండు
భారతదేశ ప్రయోజనాలకు పరాకాష్ట పివి విదేశీ విధానాలు

రాజకీయంలో ఆటుపోట్లనెన్నింటినో తట్టుకుంటూ నిలబడి
సహనశీలసంపదత్వంతో రాజకీయదరిని చేరిన నావికుడు
సమయస్ఫూర్తితోనే దేశాన్ని ఏలిన మహా మౌనఋషి పివి

నాయకత్వపటిమతో రాజనీతిజ్ఞతతో విధేయుడిగా నిలిచి
ఇందిరాగాంధీ అంతరంగికులలో ఒకడిగా నిలిచిన మేధావి రాజకీయాల్లో నమ్మకంతో మెలిగినందుకే ప్రధానయిన పివి

ప్రాచీన విద్యాబోధనకు ప్రతిరూపంగా గురుకులాలను
ప్రయోజనాత్మకంగా దేశమంతటా ప్రవేశపెట్టిన క్రాంతదర్శి
మహోన్నతమైన సంస్కరణలకు మారుపేరు మన పివి

*జయచంద్రా ! హైందవ ధ్వంసకా !* అంటూ రాసి
ఛందోబద్ధ కవిత్వాన్ని చిన్ననాటనే ఆవిష్కరించిండు
ఆశుకవితా సరళిలో సాగిన ఖండకావ్య సృష్టికర్త పివి

ప్రతిపక్ష సభ్యుడైన వాజపేయిని ఐరాసకు పంపించి
రాజకీయ నాయకులందరినీ విస్మయపరిచిన చాణక్యుడు
రాజకీయాల్లో చతురతను చాటిన అసామాన్యుడు పివి

తెలుగు భాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెడుతూ
తెలుగు అకాడమిని స్థాపించిన తెలుగుభాషా ప్రేమికుడు
తెలుగుభాషకు పట్టాభిషేకం చేసిన తెలంగాణ దిట్ట పివి

రాజకీయం సాహిత్యం రెండింటినీ సమపాళ్లలో రంగరించి
ప్రజలగుండెల్లో నిలిచి కొలువుదీరిన సాహితీదురంధరుడు
రాతల్లో చేతల్లో ఆరితేరిన నవయుగ అభిమన్యుడు పివి

విదేశీ దౌత్యసంబంధాల సముద్ధరణకు విశేషంగా కృషిచేసి
బలమైన సంబంధాలను నెరపడంలో విజయుడయ్యాడు
విదేశీ సంబంధాలను పాదుకొల్పడంలో సవ్యసాచి పివి

విదేశీ పర్యటనలో వారి భాషల్లోనే అనర్గళంగా ప్రసంగించి
అసమాన పాండిత్యంతో సభికులను అలరించిన శేముషి
దౌత్యవేత్తల ప్రశంసలను అందుకున్న ప్రాసంగికుడు పివి

కటకటాలకే పరిమితమై చీకటిగదుల్లోనే మగ్గే ఖైదీలను
సంస్కరించేందుకు ఓపెన్ జైళ్ళను ప్రవేశపెట్టిన ఘనుడు
ఖైదీలల్లో పరివర్తన బీజాలనాటిన సంస్కరణాభిలాషి పివి

భారతదేశ రాజకీయ చరిత్రలోనే చిరస్మరణీయంగా వెలిగి
నాయకత్వపటిమతో ప్రధానమంత్రి పదవిని అధిష్టించాడు
భారతదేశ అభివృద్ధిలో కీలకభూమిక పివి సంస్కరణలు

ఆర్థిక సంస్కరణల ముళ్ళరథాన్ని నవ్యపథంలో సాగించి
దేశాన్ని అభ్యుదయపథంలో నడిపించిన భవిష్యత్ ద్రష్ట
నవ్యభారతానికి నాందీవాచకమైన పరిపాలనాదక్షుడు పివి

అసాధ్యమనుకున్న పనులన్నీ సుసాధ్యం చేస్తూపోతూ
భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన కార్యోన్ముఖుడు
బంగారు భవిష్యత్తుకు మార్గం వేసిన సంక్షేమసారథి పివి

నిజాం కాలంనాటి ముల్కీ నిబంధనలకు మద్దతు పలికి
స్థానికులకే ఉద్యోగాలివ్వాలనే తలంపుకు నాందిపలికాడు
స్థానికతే ఉద్యోగాలకు గీటురాయని లక్ష్మణరేఖగీసింది పివి

విమర్శలకు ప్రశంసలకు తానెప్పుడూ లొంగిపోకుండా
తన పనిని తాను చేసుకుని పోయిన మౌనతపస్వి
రాజకీయ మేధోవర్గంలో స్థితప్రజ్ఞతకు మారుపేరు పివి

తీవ్రవాదుల ఆగడాల ఆటంకాలను దుశ్చర్యలను చూసి
టాడా చట్టాన్ని పక్కాగా రూపొందించిన సాహసవంతుడు
ఆటంకవాదులను అడ్డుకున్న అసలైన సింహస్వప్నం పివి

సుస్థిరమైన అభివృద్ధికి బలమైన పునాదులను నిర్మించి
స్వతంత్ర భారతాన్ని ఉజ్జ్వలంగా ప్రకాశింపజేసినవాడు
నవీన భారతదేశం పివి ఆవిష్కరించిన అజేయచిత్రపటం

భారతావనిలో మచ్చలేని మహానాయకుడిగా ఎదిగి
రాజకీయ విలువలకు పట్టం కట్టిన సేవాదురంధరుడు
ఆధునిక రాజకీయ మహాభారతంలో చాణక్యుడు పివి

కేంద్ర మానవవనరుల శాఖకు మానవతా రంగులు అద్ది
విశిష్టమైన శోభను చేకూర్చిన అపార జ్ఞానసంపన్నుడు
మానవ వనరులకు పునాది వేసిన మానవ వనరు పివి

విదేశాలదృష్టిలో మనదేశంపై ఉన్న అపోహలను తొలగించి
సరికొత్త దృక్పథాన్ని కలిగించిన నవ్య భారతదేశ నిర్మాత 
సంస్కరణలను పూలరథాలుగా మార్చిన పథగామి పివి

నిరంతరం దేశం కోసం ఆలోచించే మేధావిగా ఉద్బవించి
ప్రపంచంలో భారతదేశాన్ని సమున్నతంగా నిలిపిన మేధ
ఆర్థిక ఉషస్సులను పంచిన తెలంగాణ తేజం మన పివి 

పొరుగుదేశాలతో బలమైన మైత్రీభావాన్ని నెలకొల్పడానికై
వాణిజ్య సంబంధాలను కొత్తపుంతలు తొక్కించిన ద్రష్ట
నూతన విదేశాంగ విధాయక తారకమంత్ర విధాత పివి

తూర్పు ఆసియా దేశాలతో సత్సంబంధాలకు నాందిపలికి
అంతర్జాతీయ విపణిలో దేశీయకీర్తిని ఇనుమడింపజేసాడు
సంపన్నదేశాలతో సమున్నతమైత్రి నెరపిన రాయబారి పివి

అన్ని వేళల్లోనూ మౌనాన్నే ఆశ్రయించి మౌనంగా ఉంటూ
మౌనదీక్షతోనే ప్రపంచ రాజకీయాలను జల్లెడ పట్టినవాడు
మౌనం మహామహా మేధావుల విలక్షణమైన జ్ఞాన లక్షణం 

రాజకీయాలకతీతంగా నాయకులందరి దృష్టిని ఆకర్షించి
భారతదేశ అభ్యున్నతికి పాటుపడిన నిజమైన దేశభక్తుడు
భవ్యదేశానికి దారిచూపిన సంస్కరణల స్ఫూర్తిప్రదాత పివి

ప్రపంచదేశాలతో విశేషమన్ననలను సఖ్యతగా పొందుతూ
విశ్వాసపాత్రుడిగా అందరికీ తలలో నాలుకైన విధేయుడు
విదేశాంగశాఖకు వన్నెలద్దిన మేధోసంపన్నుడు మన పివి

దేశంలో రాజకీయ నాయకత్వ అస్థిరత నెలకొన్నప్పుడు
దేశప్రధాని పదవిని చేపట్టి సుస్థిరతను సాధించిన ఘనుడు
సమర్థమైన నాయకత్వ పటిమకు అసలైన నిర్వచనం పివి

పివి మదిలో తొలచి వికసించిన సంస్కరణల బీజాలు
భారతదేశమంతటా పూసిన కల్పతరువుల క్షేత్రాలు
నేటి దేశాభివృద్ధికి ఆధారం పివి సంస్కరణ ఫలాలు

భారతదేశ సమున్నత అభివృద్ధిని ఆకాంక్షించిన నేతయై
దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన పరిపాలకుడు
ఆధునిక భారతదేశాన్ని అవతరింపజేసిన నిర్మాత పివి

విలువైన మాటలను తనదైన శైలిలో చేతలతో చూపించి
అఖిల భారతావనిని అబ్బురపరిచిన అపరచాణక్యుడు
దేశ రాజధానిలో తెలంగాణ వెలుగులు పంచిన ఠీవి పివి

విదేశాంగ విధానంలో సరికొత్త దిశానిర్దేశనం చేస్తూ
తన రాజనీతిజ్ఞతతో కొత్తపుంతలు తొక్కించిన విజ్ఞుడు
విశ్వయవనికపై భారతదేశాన్ని ఠీవిగా నిలిపినవాడు పివి

పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని సంకల్పించి
వాటి పురోగతి కోసం పరితపించిన సంక్షేమ క్రాంతదర్శి
గ్రామీణాభివృద్ధే సమగ్రమైన అభివృద్ధని కాంక్షించిన పివి

పంచాయతీరాజ్ సంస్థలన్నింటికీ చట్టబద్ధత కల్పించి
ఆర్థికాభివృద్ధి ప్రణాళికలను రూపొందించిన బీజాక్షరి
సామాజిక సంక్షేమానికి బాటలు వేసిన ద్రష్ట పివి

ప్రపంచ రాజకీయనాయకుల్లో విలక్షణనేతగా వినుతికెక్కి
రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచిన అసమాన దురంధరుడు
రాజకీయాల్లో అణువణువునా తలపండిన నేత పివి

మానవీయ కోణంలో ఆర్థికసంస్కరణలకు శ్రీకారం చుట్టి
దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడిన ప్రగతి కాముకుడు
సామాన్యప్రజలు అభివృద్ధి చెందాలన్నది పివి అభిమతం

వాణిజ్యసంబంధాల కోసం విదేశీపర్యటనలు అనేకం జరిపి
ఇరుదేశాల వ్యాపారానికి పరస్పరసహకారాన్ని కోరినవాడు
వివిధ రంగాలలో అభివృద్ధిని ఆకాంక్షించిన మార్గదర్శి పివి

విదేశీ పెట్టుబడులకు ఉదారంగానే స్వాగతం పలుకుతూ
నూతన పారిశ్రామిక విధానానికి నాంది పలికిన ధీరుడు
దేశ ఆర్థికాభివృద్ధికి గీటురాళ్ళు పివి సంస్కరణల ఫలాలు

దేశ రాజకీయాల్లో తాను నమ్మిన విలువలను ఆచరించి
భారత ప్రజాస్వామ్య రథానికి పట్టం కట్టిన రథసారథి
ఉన్నతమైన రాజకీయాల్లో ఉత్తమ రాజకీయుడు పివి

ప్రణాళికబద్ధమైన ప్రగతిమెట్లను అవలీలగా అధిరోహించి
అపూర్వమైన సంస్కరణలను చేపట్టి నడిపిన దార్శనికుడు
సమగ్రమైన సదాలోచనలకు కార్యకర్తృత్వం మన పివి

పాత్రికేయుడిగా తొలినాళ్ళలో కాకతీయ పత్రికను నడిపి
కథలు కథనాలు వ్యాసాలు రాసిన నవ యువకెరటం
తెలంగాణలో సామాజిక చైతన్యానికి మారుపేరు పివి 

జీవిత కాలమంతా అతితక్కువగా మాట్లాడి మౌనభాషియై
తన చేతలతోనే దేశాన్ని నడిపించిన అపర గండరగండడు
దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన గొప్ప రాజనీతిజ్ఞుడు పివి

వ్యవసాయిక పారిశ్రామిక రంగాలు దేశాభ్యున్నతికి
బంగారుబాటలు వేసే ఆదాయవనరులుగా భావించాడు
దేశాభివృద్ధికి వ్యవసాయ పారిశ్రామిక రెండు కళ్ళన్న పివి

అధికారాన్నెపుడూ తన స్వీయవైభవానికి వాడుకోకుండా
ప్రజాసంక్షేమమే పరమావధిగా తపించిన నిష్కామయోగి
ఆదర్శనాయకుడిగా అవనిలో వెలసిన కలువపువ్వు పివి

తెలుగును బోధనాభాషగా పరిపాలనాభాషగా మలచి
తెలుగుభాషా సౌందర్యాన్ని లోకానికి వెల్లడించినవాడు
తెలుగు భాషాభిమానానికి అసలుసిసలు నిర్వచనం పివి

రాజకీయ పదవుల కోసం ఏనాడూ పాకులాడకుండా
తన అసాధారణ ప్రతిభతోనే సంపాదించిన అగ్రజుడు
రాజకీయంలో నిస్వార్థంగా ఎదిగిన నిరుపమానశీలి పివి

భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానం పేరుతో
సరళమైన శైలిలో తెలుగులోకి అనువదించిన దిట్ట
అనువాదకుడిగా సమున్నత శిఖరాయమానం పివి

విదేశాంగ వ్యూహాలను వ్యూహాత్మకంగా అనుసరించి
దేశరక్షణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించిన ధీశాలి
దేశభద్రతలో రాజీపడని అంతర్జాతీయ కీర్తిపతాక పివి

తెలంగాణ రాజకీయ మాగాణంలో విరిసిన పత్రహరితమై
దేశ రాజకీయాల్లో వెలుగులీనిన సహస్రాధిక కాంతిపుంజం
ప్రధానిగా దేశసేవలోనే తరించిన సంస్కరణాభిలాషి పివి

నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులో తేవాలని
నవోదయ పాఠశాలలకు అంకురార్పణ చేసిన రూపకర్త
మానవవనరుల మంత్రిగా నవీనవిద్యకు నాందీగీతం పివి

అసాధారణ గ్రహణశక్తితో అపారమైన ధారణపటిమతో
బహుభాషలను బహుచక్కగా వల్లెవేసిన మహా ఘనాపాఠి
స్వయంకృషికి నిరుపమానమైన నిదర్శనం మన పివి

పాత విదేశాంగ విధానాలను కొత్తపుంతల్లో తొక్కుతూ
దూరదృష్టితో శతృదేశాలను మితృదేశాలుగా మలిసిండు
విదేశీ సత్సంబంధాల సాధనకు పునాది వేసింది పివి

పంచెకట్టులో తెలుగుదనంతో నడకలో హుందాతనంతో
తెలుగు నేలన వెలుగులు నింపిన రాజకీయ శిఖరాగ్రం
ప్రపంచాన ప్రజ్ఞను చాటిన అసాధారణ పండితుడు పివి

రాజకీయ సాగరంలో తన మేధోబలంతో పయనించి
అత్యున్నత శిఖరాలకు చేరుకున్న అరుదైన వ్యక్తిత్వం
రాజకీయంలో అందరాని అందలం ఎక్కిన ఘనుడు పివి

సమున్నత పరిపాలనా జ్ఞానంతో అధ్యయన శీలత్వంతో
నిరంతరంగా సహస్రాధిక ఆలోచనలను చేసిన అవధాని
ప్రాపంచిక చింతనపరుడైన సామాజిక లోచనుడు పివి

విప్లవాత్మక సంస్కరణలతో ప్రగతిపథంలో పయనింపజేసి
దేశాన్ని అత్యున్నతస్థాయిలో నిలిపిన మేధోసంపన్నుడు
భారతదేశ రాజకీయ సామాజిక సంస్కరణాభిలాషి పివి

రాజకీయరంగంలో ఎన్నో ఉన్నతపదవులను అలంకరించి
వాటికే అలంకారికతను సాధించిన నిరాడంబరమైన జీవి
రాజకీయాల్లో రాజనీతిజ్ఞతకు పెట్టింది పేరు మన  పివి 

అంతర్జాతీయ ఒప్పందాలను అవలీలగానే కుదిర్చి
వాణిజ్యలావాదేవీలను సరళీకృతం చేసిన సంస్కర్త
నేటి సంస్కరణఫలాలు నాడు పివి నాటిన విత్తనాలు

రాజకీయ రణరంగంలో ఎన్నో కుట్రలను కుతంత్రాలను
చాకచక్యంతో అధిగమించి అందలం ఎక్కిన అజేయుడు
విలక్షణనేతగా వాసికెక్కిన అపరచాణక్యుడు మన పివి 

తెలంగాణలో భూసంస్కరణల పర్వానికి పాదులు వేసి
నవసమాజ నిర్మాణానికి నడుంబిగించిన సంస్కరణశీలి
భూసంస్కరణలను అమలు చేసిన ధైర్యశాలి మన పివి

బాల్యంనుంచే ఉద్యమాల ప్రభావంతో పోరాటపటిమనెంచి
నాటి నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన గండరగండడు 
ఉడుకురక్తంతో ధిక్కారస్వరాలను వినిపించిన ధీరుడు పివి

తెలంగాణ పలుకుబళ్ళను లోకోక్తులను ప్రయోగించి
మరాఠీ నవలను తెలుగువాళ్ళకు అందించిన సృజనకర్త
అపురూప అనుసృజన సుగంధం పివి అబలా జీవితం

ఆయన ఆలోచనలు వేయిపడగలుగా పురివిప్పినందునే
భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా అలరారుతున్నది
నవీన భారతాన్ని ఆకాంక్షించిన భవిష్యత్తు ద్రష్ట మన పివి

బూర్గుల దగ్గర జూనియర్ న్యాయవాదిగా చేరుతూనే
రాజకీయ మెళకువలను నేర్చుకున్న నిత్య అభ్యాసి
సామాజిక మార్పుకోసం విశేష కృషిసల్పిన ధీశాలి పివి

రాజకీయంలో ఒంటరిపోరాటం చేసిన యోధుడుగా నిలిచి
దేశాభ్యున్నతికి అహరహం విశేషకృషి సలిపిన స్థితప్రజ్ఞుడు
అపార మేధాసంపత్తికి అసలుసిసలు నిర్వచనం మన పివి

రావణకాష్టంవలె రగిలిన అయోధ్య బాబ్రీమసీదు ఘటన
భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన వాస్తవిక సంఘటన
సత్యాసత్యాలను విశదీకరించిన పివి గ్రంథం అయోధ్య

బహుభాషా సాహితీప్రక్రియలలో విశేషమైన రచనలు చేసి
కవిపండితుడిగా వినుతికెక్కిన బహుభాషా కోవిదుడు
సాహిత్యంలో బహుముఖీన ప్రజ్ఞాపాటవాలకు ప్రతీక పివి

ఐరాసలో నిరాయుధీకరణపై చేసిన చారిత్రాత్మక ప్రసంగం
విశ్వనాయకుల హృదయాల మన్ననలను చూరగొన్నది
విశ్వానికి శాంతిమంత్రాన్ని ఉపదేశించిన శాంతిదూత పివి

క్రియాశీలక రాజకీయ రంగంలోకి నూతనంగా ప్రవేశించి
కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యుడిగా విజయుడయ్యాడు
అప్రతిహత రాజకీయ విజయాలకు అసలైన దిక్సూచి పివి

భారతదేశం తలెత్తుకునేలా ప్రధాన పదవిని చేపట్టి
దేశం దశదిశను నలుదిశలా చాటిన సంస్కరణల ఠీవి
భారతదేశ జెండాను విశ్వంలో ఎగురవేసిన ఘనుడు పివి

భారతదేశాన్ని ఒక సమున్నతమైన కుటుంబంగా భావించి
ఆసేతుహిమాచలం సమైక్యంగా నిలబెట్టిన రాజకీయదర్పం
భారతదేశాన్ని విశ్వయవనికపై రెపరెపలాడించిన ద్రష్ట పివి

అసాధారణ ప్రజ్ఞావంతుడిగా తెలంగాణావనిలో ప్రభవించి
బహుముఖీన వ్యక్తిత్వంతో వెలుగొందిన జ్ఞానతేజస్సు
స్వయంకృషితో సకలరంగాల్లో తేజరిల్లిన ప్రజ్ఞావతంసి పివి

                                                 - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్