
- డా. ఎ. రవీంద్రబాబు
ఆనందం అర్ణవమైతే
ఆంబరం ఆటస్థలమైతే
పువ్వుల నవ్వుల జల్లుల్లారా
వికసించే ఆత్మీయ బంధాల్లారా
మీ మనసుల నక్షత్రాలు ప్రకాశిస్తే
మీ అమాయకపు చేష్టలు అవలోకిస్తే
ఎన్ని సుమధుర నాదాలు
ఎన్ని సృజనాత్మక చిత్రాలు
ఎన్ని మనోరంజ మకరంద మాలలు
ఈ సృష్టియవనికపై, మా హృదయ కవాటాలపై
మనో నేత్రాల దీవుల్లో, ప్రకృతి పులకింతల్లో
ఆడిపాడి... లయించి, స్మరించి, ధ్యానించే
పాపం, పుణ్యం ఎరగని బుడతల్లారా
ఆత్మీయ నేస్తాల్లారా... ఆనందపు పొలిమేర్లల్లారా
వానవీణ మీటిన చిరుగాలి సితారాలా
రంగు రంగుల సీతాకోక చిలుకల నాట్యాల్లా
ఆ దేవుడ్ని మించిన మా పాలకుల్లా
నిలిచే, పిలిచే, ఎదిగే, నడిచే
పిల్లల్లారా... పాలనవ్వుల పొంగుల్లారా
తోటలో పూసిన పసి ప్రాణుల్లా
ఎద లోతుల్లో విరిసిన జ్ఞానంలా
కాలం కలిపిన కరదీపికలా
భవిష్యత్ దారికి చుక్కానుల్లా
కలిసి ఎదుగుదాం...
ఆత్మీయ స్పర్శలా...
అనురాగపు సింధువులా...
అనుబంధాలకు చిరునామాలై...



