Facebook Twitter
పి. సత్యవతి

     పి. సత్యవతి

                                                - డా. ఎ. రవీంద్రబాబు
 
 
 
           తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ఉద్యమం ఓ ప్రధాన భూమిక. సమాజాన్ని, సాహిత్యాన్ని స్త్రీ కోణం నుంచి చూడటాన్ని అలవాటు చేసిన వాహిక. ఈ దృష్టితోనే ఎందరో రచయిత్రులు కథలు, కవితలు, విమర్శ, పరిశోధన రంగాలలో విశేష కృషి చేశారు. వీరిలో ప్రధానమైన రచయిత్రిగా చెప్పకోవాల్సిన వాళ్లలో పి. సత్యవతిగారు ఒకరు. స్త్రీని, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు సత్యవతి. ఆమె కథల్లో, నవలల్లో, వ్యాసాల్లో మారుతున్న సమాజంలో మానసిక వేదనలకు గురౌతూ ఎదుగుతున్న స్త్రీలే మనకు కనిపిస్తారు.
           పి. సత్యవతి గుంటూరు జిల్లా కొలకలూరులో 1940 జులై 2న జన్మించారు. ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో ఎం.ఎ. ఇంగ్లిషు పూర్తి చేశారు. విజయవాడలోని ఎస్.ఎ.ఎస్. కాలేజ్ లో అధ్యాపకులుగా పని చేసి పదవీవిరమణ పొందారు. ఆమెకు అపారమైన బోధానానుభవమే కాదు, తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై పూర్తి పట్టు ఉంది. అన్నిటికి మించి తెలుగు సమాజాన్ని క్షుణ్ణంగా దగ్గరనుంచి పరిశీలిస్తున్నారు. అందుకే నాలుగు దశాబ్దాల తెలుగు స్త్రీ, వారి రచనల్లో మనకు కనిపిస్తుంది. వీరి తొలి కథ 1964లో ఆదివారం కోసం రాశారు. దీనిలో ఆదివారమైనా స్త్రీకి సెలవు ఉండాలని, అది వ్యక్తిగతమైన పనులు చేసుకోడానికి అవసరమని వివరిస్తుంది. 1975లో మర్రినీడ కథా సంపుటి వీరిని రచయిత్రిగా పాఠకలోకానికి పరిచయం చేసింది. ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక ప్రచురించిన కథలలో పాఠకుల అభిప్రాయాల ద్వారా ఈ కథకు బహుమతి వచ్చింది. పి. సత్యవతి కేవలం కధా రచయిత్రే కాదు నవలలు, వ్యాసాలు, అనువాదాలు కూడా చేశారు.
        వీరి కథా సంపుటాలు ప్రధానంగా-
1995లో వచ్చిన ఇల్లలకగానే
1998లో వచ్చిన సత్యవతి కథలు
2003లో వచ్చిన మంత్రనగరి.... ఇవన్నీ వివిధ కోణాలలో స్త్రీలు సమాజంలో అనుభవిస్తున్న బాధలను చిత్రించినవే... ఈ కథల్లో కొన్ని మధ్యతరగతి స్త్రీ, పురుషస్వామ్య చట్రంలో గురువతున్న మోసాలను తెలిజేస్తాయి. మరికొన్ని కథలు ఆ చట్రాన్ని బద్దలు కొట్టి స్వశక్తితో ఎదిగేలా సాగుతాయి. ఇంకొన్ని కథలు జెంటర్, చాపకింద నీరులా స్త్రీలను ఎలా నియంత్రిస్తుందో మ్యాజిక్ రియలిజం టెక్నిక్ లో వివరిస్తాయి. ఈ కథలను ఒకసారి చదివి మర్చిపోలేము అవి మనలో నిప్పును రాజేస్తూనే ఉంటాయి.
 
        భూపాల రాగం కథ పేద, మధ్య, ధనిక వర్గ స్త్రీల వర్గవిభేదాలను, కష్టాలను చిత్రిస్తుంది. తాయిలం కథ పురుషుడి విజయం వెనుక ఉన్న స్త్రీ తనకు తానుగా ఏమి కోల్పోతుందో వివరిస్తుంది. గాంధారి రాగం, బదిరి, గణితం, పహరా, ముసుగు లాంటి కథలు పురుషుల ప్రతిభలో దాగి బైటకు రాని స్త్రీల అనుభవాలను చెప్తాయి. సూపర్ సిండ్రోమ్, తిమింగల స్వర్గం, మంత్రనగరి వంటి కథలు అమెరికా సామ్రాజ్య భావాలను ఎండగడతాయి.
 
          సత్యవతి ఆరు నవలలు కూడా రాసింది. ఇవి కూడా ప్రధానంగా స్త్రీ వాదానికి చెందినవే. ఇవి 1973-1988ల మధ్య కాలంలో రాసింది. పద్మవ్యూహం నవలలోని సరస్వతి పాత్ర ఆర్థిక, కుటంబ పరిస్థితులు అనుకూలించక ప్రేమ రాహిత్యంతో బాధపడే స్త్రీ ఎటువంటి ప్రలోభాలకు లోనవుతుందో వివరిస్తుంది. పడుచుదనం రైలుబండి నవలలోని నాగమణి పాత్ర కూడా ఇలాంటిదే. గొడుగు, ఆ తప్పునీది కాదు నవలలు కూడా పూర్తిగా స్త్రీ చైతన్యానికి సంబంధించినవే. అన్నపూర్ణ నవవలో స్త్రీలు ఆత్మగౌరవంగా అభివృద్ధి చెందుతున్నా, సమాజంలో ఉన్న విలువలతో సమన్వయం సాధించలేక తత్తరపాటు పడటాన్ని చెప్తుంది.
 
      సత్యవతి రాగం భూపాలం పేరిట భూమిక పత్రికలో స్త్రీల సమస్యలను వివరిస్తూ కాలం రాసింది. ఆహ్వానం పత్రికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీవాద సాహిత్యాన్ని పరిచయం చేసింది. దీని ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న స్త్రీల జీవితాలు ఆయా సాహిత్యాలలో ఎలా ప్రతిబింబించాయో తెలుగు పాఠకులకు తెలిసింది. వీరు వ్యాసరచన కూడా చేశారు. ఇవన్నీ స్త్రీ కోణం నుంచే సాగుతాయి. ఇవి సమాజంలో, కుటుంబంలో... ప్రతిచోటా స్త్రీ జీవితంలోని నియంత్రణ, హింసను బయటపెడతాయి. ఉదాహరణకు యాసిడ్ ప్ర్పూఫ్ ఫేస్ మార్క్ వ్యాసంలో సౌందర్య సాధనాలు సహజ అందాలను ఎలా నాశనం చేస్తున్నాయో వివరించారు. అంతేకాదు సత్యవతి కొడవటిగంటి కుటుంబరావు, కేశవరెడ్డి... మొదలైన వాళ్ల రచనలపై వ్యాసాలు కూడా రాశారు. అనువాదకురాలిగా కూడా సత్యవతికి మంచి పేరు ఉంది. ఈమె చేసిన అనువాదాలలో సిమోన్ ది బోవా రాసిన సెకండ్ సెక్స్ ముఖ్యమైనది. జ్ఞాన దాతకే జ్ఞానదాత అనే వ్యాసంలో బౌద్ధమతం కూడా స్త్రీలను దూరంగా ఉంచిందన్న విషయాన్ని తెలియజేసింది.
 
            సత్యవతి రచనలు పరిశీలిస్తే మూడు రకాలుగా మనుకు అర్థం అవుతాయి.
1. పితృస్వామ్య సమజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు.
2. నేటి సమాజంలో స్త్రీలు తమకు తాముగా కల్పించుకుంటున్న సమస్యలు.
3. నేటి సమాజం స్త్రీలపై బలవంతంగా రుద్దుతున్న అవమానాలు, పీడనలు.
 
           వీరు అనేక బహుమతులు అందుకున్నారు. పురస్కారాలు పొందారు. ముఖ్యంగా 1997లో చాసో స్ఫూర్తి అవార్డు, 2002లో రంగవల్లి విశిష్ట వ్యక్తి పురస్కారం, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం వారి బహుమతి వీరికి లభించాయి. 2008లో యుగళ్ల ఫౌండేషన్ వారి అవార్డు, 12012లో సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, అదే ఏడాది మల్లెమాల, గుంటూరు వారి గురజాడ పురస్కారాలు వీరు అందుకున్నారు.
 
           ఇన్ని రచనలు చేసి ప్రపంచంలోని స్త్రీలను, వారి జీవన వైవిధ్యాన్ని అధ్యయనం చేసి రచనల ద్వారా మనకు పంచింది పి. సత్యవతి. తెలుగులో స్త్రీ వాద ఉద్యమం ఇంకా బాల్యదశలోనే ఉందని, అదీ నగరాల్లో మాత్రమేనని సత్యవతి భావన. కానీ నేడు స్త్రీ బావజాలం గురించి కొంతైనా తెలుసుకోవాలంటే వీరి రచనలను తప్పక చదవాల్సిందే...