Facebook Twitter
డాక్టర్ సి. నారాయణరెడ్డి

  డాక్టర్ సి. నారాయణరెడ్డి

 


                                                 
 

- డా.ఎ.రవీంద్రబాబు


    

నేటి ఆధునిక, అత్యాధునిక సాహిత్య ప్రపంచాలకు వారధి ఆయన. ఎన్నో సాహితీ గవాక్షాలను తెరిచిన తేజోమూర్తి. అపూర్వమైన చిత్ర రాజాలను తన పాటలతో ఊరేగించిన పాటల వీరుడు. విద్యలో, వినయంలో, మాటలో, చేతలో, రాతలో, రూపులో అతనిదో ప్రత్యేకమైన శైలి. అతనే డాక్టర్ సి. నారాయణరెడ్డి. తెలుగు నేలపై సాహితీ వ్యవసాయం చేస్తున్న నిత్యకృషీవలుడు.
        కరీనంగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో జులై 29, 1931న జన్మించారు నారాయణరెడ్డి. ప్రాథమిక విద్యను గ్రామంలో, మాధ్యమిక విద్యను కరీనంగర్ లో పూర్తి చేశారు. ఆపై హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలంలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు - ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ ను పొందారు. అయిుతే ప్రాథమిక విద్య నుంచి బి.ఎ. వరకు ఉర్దూలో చదివినా తెలుగుపై ఉన్న అభిమానమే వారిని నడిపించింది. సాహితీ మూర్తిని చేసింది.
         గ్రామంలోని జానపద బాణీలు, సాంస్కృతిక కళారూపాలతో ముడివేయబడిన బాల్యం నారాయణరెడ్డిది. స్వతహాగా భావకుడైన అతనికి వీటి ప్రభావంతో కవిత్వం రాయడం అలవోకగా అబ్బింది. వీరి తొలి కవిత జనశక్తి పత్రికలో అచ్చైంది. 1953లో తొలి నృత్యనాటిక నవ్వనిపువ్వు పాఠకలోకానికి అందించారు. అప్పటి నుంచి ఎన్నో అపూర్వమైన, అమూల్యమైన కవిత్వ ఫలాలాను అందిస్తూనే ఉన్నారు. పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, వచనకవితలు, యాత్రాకథనాలు, నృత్య రూపకాలు, గజళ్లు, విమర్శ, అనువాదం... ... ఇలా ఎన్నో కవితాప్రక్రియలు వారి కలం నుంచి జాలువారి తెలుగునేలను పుణీతం చేశాయి.
            రామప్ప
            కర్పూర వసంతరాయలు
            విశ్వనాథనాయకుడు
            నాగార్జున సాగరం
            రెక్కల సంతకాలు
            మట్టి మనిషీ ఆకాశం
           మంటలు-మానవుడు
            మధ్యతరగతి మందహాసం
            ప్రపంచపదులు

            మార్పు నాతీర్పు
            మనిషీ - చిలుక
            ఆరోహణ
            కలం సాక్షిగా
            ముఖాముఖి
 

             వ్యక్తిత్వం   

            అన్నిటిని మించి జీవునని వేదనను ఆధ్యాత్మిక, చారిత్రక వాస్తవ దృక్కోణంలో వివరించే విశ్వంభర... ఇలా 70 గ్రంథాలు వీరి నుంచి వెలుగు చూశాయి. నేటికీ తన పుట్టిన రోజున ఒక పుస్తకాన్ని ప్రచురించడం నారాయణరెడ్డికి ఆనవాయితీ. ఈ పుస్తకాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి.
           ఇక నారాయణరెడ్డిలోని మరో అంశం సినీగేయ రచయిత. 1962లో గులేభకావళి చిత్రానికి అన్ని పాటలు రాసి చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆతర్వాత ఆయన కలం వెనుతిరిగి చూడలేదు. ఆత్మబంధువు, కర్ణ, లక్షాధికారి, అమరశిల్పిజక్కన్న, రాముడు భీముడు, కోడలు దిద్దిన కాపురం... ఇలా రెండు దశాబ్దాలు వెండితెరను పాటల రచయితగా ఏలారు. ఏకవీర చిత్రానికి మాటలు కూడా అందించారు. స్వాతి ముత్యంలో లాలిలాలి వటపత్ర శాయికి వరహాల లాలి అని జోలపాట పాడారు, వరనకట్నం చిత్రంలో వరకట్నాన్ని వ్యతిరేకిస్తూ- ఇదేనా మన సంప్రదాయమిదేనా... అని ప్రశ్నించారు. అమరశిల్పి జక్కన్నలో ఈ నల్లనిరాళ్లలో ఏ కన్నులు దాగెనో అని రాళ్లకున్న మనసును వెలికితీశారు. రేపటి పౌరులు చిత్రంలో రేపటి పౌరులం రేపటి పౌరులం అని విద్యార్థుల భావి జీవితానికి మార్గాన్ని నిర్మించారు. ఒసే రాములమ్మలో ముత్యాలరెమ్మ... అంటూ తన కలంలో వాడివేడి తగ్గలేదని నిరూపించుకున్నారు. 2009లో అరుంధతిలో జేజేమ్మా పాట ఆ చిత్రవిజయానికి ముఖ్యభూమికైంది.  ప్రేమించు చిత్రంలోని కంటేనే అమ్మంటే ఎలా..., సీతయ్య చిత్రంలోని ఇదిగొ రాయలసీమగడ్డ పాటలకు నంది అవార్డులు సైతం వీరికి వచ్చాయి. వీరు రాసిన పాటల గురించి వీరే ఓ పత్రికలో పాటలో ఏముంది నామాటలో ఏముంది అనే శీర్షికను నిర్వహించారు. అది నేడు పుస్తకంగా కూడా లభ్యమవుతుంది.
              ఇక సాహితీ, విద్యావేత్తగా వీరికొచ్చిన బహుమతులకు లెక్కే లేదు. 1997లో పద్మశ్రీ 1978లో కళాప్రపూర్ణ, 1988లో రామలక్ష్మీ, 1992లో పద్మభూషణ్... ఇలాంటివన్నీ నారాయణరెడ్డి ప్రతిభకు కొలమానాలు లాంటివి. 1989లో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీట్ వీరి విశ్వంభర కావ్యానికి వచ్చిది. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశాయి. ప్రపంచంలోని ముఖ్యదేశాలు సందర్శించారు. ఇవన్నీ వారి కృషికి చిన్నపాటి సత్కారాలు మాత్రమే... 
            రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు
            పోతూపోతూ రాస్తాను వపసు వాడే వరకు  అన్నసాహితీ జ్ఞిజ్ఞాస వారిది. తెలుగు జాతి, తెలుగుభాషే కాదు...యావత్ భావతదేశం గర్వించదగిన వ్యక్తి డాక్టర్ సి.నారాయణరెడ్డి.