Facebook Twitter
కేతు విశ్వనాథరెడ్డి

  కేతు విశ్వనాథరెడ్డి
                                                   

  డా. ఎ.రవీంద్రబాబు

 


                ఆయన విద్యావేత్త, సాహితీవేత్త, అపారమైన బోధనానుభవం కలిగిన అధ్యాపకులు. కథా రచనలో, విమర్శలో, సంపాదకత్వంలో పేరొందిన అనుభవశాలి. రాయలసీమ కథను మున్ముందుకు తీసుకెళ్లడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న రచయతే డా. కేతు విశ్వనాథరెడ్డి. రాయల సీమభాషను, అక్కడి ఇతివృత్తాన్ని, అక్కడి ప్రజల జీవన శైలుల్ని తన కథలతో మనకు అందించిన ప్రతిభావంతులు. ఎంతో మంది అనుంగు శిష్యగణాల ఆప్యాయతలను పొందిన స్నేహ స్వభావి.
                ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి జులై 10, కడపజిల్లా కమలాపురం దగ్గరున్న రంగశాయిపురంలో జన్మించారు. అనేక కష్టాల కోర్చి విద్యాభ్యాసాన్ని సాగించారు. తండ్రి డాక్టరు చేయాలని తపనడినా కడపజిల్లా గ్రామనామాల మీద పరిశోధన చేసి డాక్టరేటును పొందారు. వీరు ఎస్.ఎస్.ఎల్.సి చదివే సమయంలో పద్యాలు రాసినా,  ఇంటర్మీడియట్ లో వచన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. తొలి కథ అనాదివాళ్లు కథ 1963లో సవ్యసాచి పత్రికలో ప్రచురితమైంది. కొంతకాలం విశ్వనాథరెడ్డి పాత్రికేయునిగా కూడా పనిచేశారు. తర్వాత అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు. డాక్టర్ బి.ఆర్. అబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అయినా రచనలు చేయడం మాత్రం కొనసాగిస్తూ తన సాహిత్యాభిలాషను మాత్రం కొనసాగిస్తున్నారు.
  వీరి కథాసంపుటాలు
జప్తు (1974), కేతు విశ్వనాథరెడ్డి కథలు (1991), ఇచ్ఛాగ్ని (1997), కేతువిశ్వనాథరెడ్డి కథలు 1998-2003 (2004) మొదలైనవి...
వీరి నవలలు వేర్లు, బోధి మొదలైనవి...
         వేర్లు మొదటి సారిగా రిజర్వేషన్లలోని క్రీమీలేయర్ మీద వెలువడిన నవల.
విశ్వనాథరెడ్డి కథలు హిందీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, బెంగాళీ, మరాఠీ, రష్యన్ భాషల్లోకి అనువాదాలయ్యాయి. రాయలసీమ సామాజిక మూలాల్ని, సాంస్కతిక లక్షణాలను తన కథల్లో అత్యంత ప్రతిబావంతంగా చిత్రించారు. సీమలోని ముఠాకక్షలను, హింసా రాజకీయాలను, ఫ్యాక్షనిజం సృష్టిస్తున్న సంక్షోభాన్ని రెండు దశాబ్దాల కిందటే రచనల ద్వారా వివరించారు. ఫ్యాక్షన్ కు మూలకారణాలను ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాల నుంచి ఆలోచించాలని గమనించిన కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి. వీరి  పీర్లచావిడి, దాపుడుకోక, నమ్ముకున్న నేల, కూలిన బురుజు, జప్తు వంటివి గొప్ప రచనలు. వానకురిస్తే కథ రాయలసీమలోని నీటి సమస్యను వివరిస్తుంది. గడ్డి కథ రైతుకు, భూమికి ఉన్న సంబంధాన్ని చిత్రించింది. కూలిన బురుజు కథ ఫ్యాక్షన్ నేపథ్యంతో సాగింది. విశ్వనాథరెడ్డి కథల్లో పల్లె వాతావరణం ప్రతిబింబిస్తుంది. వాటికి అమ్మ సహకారం, ప్రోత్సాహం లబించిందని అంటారు. యాసలు ఎన్ని ఉన్నా తెలుగు భాష ఒక్కటే ముఖ్యం అని, ఆ విశాల దృష్టితోనే రచనలు చేస్తున్నారు.
           వీరి అమ్మావారి చిరునవ్వు కథ ఎక్కువ విమర్శలకు, చర్చలకు, విశ్లేణలకు, వివాదాలకు గురైంది. విశ్వనాథరెడ్డి కథా శైలి నిరలంకారంగా, నిరాడంబరంగా, విపరీతమైన వర్ణనలు, అనవసరమైన నాటకీయత లేకుండా సాగుతుంది. అయినా మనిషిని ఆలోచింపజేస్తుంది. అందుకే వీరి కథల గురించి కాలీపట్నం రామారావు  ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాదు, పుట్టు కథలు రాసేవారనిపిస్తుంది అన్నారు. సింగమనేని నారాయణ వీరి కథల్లో కథుండదు. కథనం వుంటుంది. ఆవేశం వుండదు. ఆలోచన వుంటుంది. అలంకారాలు వుండవు. అనుభూతి వుంటుంది. కృత్రిమత్వం వుండదు. క్లుప్తత వుంటుంది అన్నారు.
         కేతు విశ్వనాథరెడ్డి కేవలం కథలు, నవలలు మాత్రమే కాకుండా వ్యాసాలు, సంపాదకీయీలు, ముందుమాటలు కూడా రాశారు. అవన్నీ సంగమం ( వ్యాసాలు, ప్రసంగాలు), పాత్రికేయం (సంపాదకీయాలు), పరిచయం (ముందుమాటలు, సమీక్షలు) పేరిట వివిధ పుస్తకాలుగా వచ్చాయి. ఆధునిక కథా రచయితల్లో ముఖ్యుల గురించి దీపధారులు అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మనభూమి పత్రికకు సంపాదకులుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఈ భూమి పత్రికకు సంపాదకునిగా ఉన్నారు.
            కేతువిశ్వనాథరెడ్డి ఎన్నో కరికులం కమిటీలలో ప్రధాన పాత్ర పోషించారు. పాఠ్యపుస్తకాలో ఆధునికత ఉండేందుకు కృషి చేశారు. పాఠ్యపుస్తకాల గురించి, అందులోని విషయాల గురించి వీరికి కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. మంచి వచనం రాయడమనేది ఎప్పుడూ అవసరం. అది సైన్సు విద్యార్థి కావచ్చు, కామర్సు విద్యార్థి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. మేము తీసుకున్న నిర్ణయాలలో ముఖ్యంగా స్త్రీలను అగౌరవ పరిచే పాఠాలు, దళితులను కించపరిచే పాఠాలు ఉండకూడదని నిబంధన విధించాము. పాఠాల మూలంగా విద్యార్థుల్లో మార్పు రావాలని, కొన్ని నిబంధనలు ఉండకూడదని నిర్దాక్షిణ్యంగా ఖండించాము అని చెప్తారు. అంతేకాదు వీరు జ్ఞానపీఠ్ అవార్డు ఎంపికల కమిటీలో సభ్యులుగా కూడా ఉన్నారు. అనువాదాలు వస్తేనే తెలుగు రచనల గురించి ఇతర భాషీయులకు తెలుస్తుంది అంటారు.
        విశాలాంధ్ర తెలుగు కథ 1910 - 2000 సంకలనానికి సంపాదక బాధ్యతలు వహించారు. అంతేకాదు కొడవటిగంటి కుటుంబరావు రచనలను 14 సంపుటాలుగా సమీకరించి సంపాదక బాధ్యతలు నిర్వహించారు. చలం, బుచ్చిబాబు, గురజాడ, రావిశాస్త్రి, కుటుంబరావు రచనలను ప్రేమిస్తారు. వీరు ఎన్నో ప్రశంసలు, సత్కారాలు అందుకున్నారు. 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు, 1996లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇంకా వీరికి కలకత్తా వారి భారతీయ భాషా పరిషత్తుల పురస్కారం, రావిశాస్త్రి అవార్డు, రితంబరీ అవార్డు, విశ్వవిద్యాలయం అధ్యాపకులుగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక పురస్కారం లభించాయి. 2009లో అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారి జీవిత కాలం పురస్కారం అందుకున్నారు.
      కథా సాహిత్యంలో కేతు విశ్వనాథరెడ్డి నేటితరం రచయితలకు సూచనలు ఇస్తూ రచయితలకు వినయం, నిగ్రహం అవసరం అంటారు. జీవితాన్ని, సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి రచనలు చేయాలని సూచిస్తారు.