Facebook Twitter
సింగమనేని నారాయణ

సింగమనేని నారాయణ
                              
                     

డా. ఎ. రవీంద్రబాబు

 


         

రాయలసీమ కరువును, రైతుల దైన్యాన్ని తన కథల్లో విషాదభరితంగా చిత్రించిన రచయిత సింగమనేని నారాయణ. నేలవిడిచి సాము చేయకుండా వాస్తవాన్ని రచనలో నిరాడంబరంగా చెప్పగల దిట్ట. కృత్రిమత, అలంకారిక పదాల శోభ ఆయనకు నచ్చవు. ఏ కథ రాసినా పాఠకుని గుండె తడి అవ్వాల్సిందే... క్లుప్తంగా, సూటిగా అనంతపురం మాండలిక భాషతో కలిసి వీరి కథలు సీమ నేపథ్యాన్ని నిర్మొహమాటంగా మనముందు ఉంచుతాయి.
          సింగమనేని నారాయణ అనంతపురం జిల్లాలోని బండ్లమీద పల్లె గ్రామంలో జన్మించాడు. తెలుగు ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. ఆ వృత్తిలో ఉంటూనే అపారమైన సాహితీ వ్యవసాయాన్ని చేశారు. ప్రాచీన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశాడు. పురాణాల్ని, ప్రబంధాల్ని పరిశీలించాడు. శ్రీశ్రీ, చలం, కొ.కు, బుచ్చిబాబు లాంటి  సాహితీ వేత్తల లోతుల్ని పట్టుకున్నాడు. అన్నిటికీ మించి రాయసీమ సామాజిక స్వరూపాన్ని, ఆర్థిక న్వభావాన్ని, ప్రజల స్థానిక సమస్యలను అర్థం చేసుకున్నాడు.

             సంగమనేని నారాయణ కథలు పలు సంపుటాలుగా వచ్చాయి. వీరి రచనలు అన్నీకలిపి సుమారు 40కి పైగా ఉన్నాయి.
           జూదం (12 కథలు) ఈ సంపుటి 1988లో వచ్చింది. దీనిలోని జూదం కథ చదివితే సీమనేల మీద, మనుషుల మీద అపారమైన సానుభూతి కలుగుతుంది.
           సింగమనేని నారాయణ కథలు (18 కథలు) ఈ సంపుటి 1999లో వచ్చింది.
           అనంతం కథల సంపుటి అనంత ప్రజల జీవన విధానంలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది.                
           నీకు నాకు మధ్య నిశీధి కథా సంపుటిలోని కథలు స్త్రీవాదాన్ని చదివి అర్థం చేసుకుని సహానుభూతిని ప్రకటించేవిగా ఉన్నాయి. మధ్యతరగతి స్త్రీలపై జరుగుతన్న హింస, వరకట్నం, దౌర్జన్యాలు, పురషాధిక్య భావాజాలం... వంటి వస్తువులనే కథలుగా మలిచారు. 
            వీరి తరగతిలో తల్లి కథ ఉపాధ్యయుడు పిల్లల్ని ఏవిధంగా ఆకట్టుకొని చదువు చెప్పాలో నేర్పిస్తుంది. అందుకే ప్రతి టీచరు ఈ తప్పక చదవాల్సిన కథ ఇది.
            మకరముఖం కథ దళితులు తమ కులం పేరు చెప్పుకోడానికి ఎలాంటి తిప్పలు పడుతున్నారో చక్కగా వివరిస్తుంది.
              సింగమనేని నారాయణ కథలు వాస్తవ జగత్తును చిత్రిస్తాయి. అనంతపురం జిల్లా భాషను రుచి చూపుతాయి. కథలు తగినంత వర్ణనలతో క్లుప్తంగా ఉంటాయి. కథ ఎప్పుడూ విపరీత పోకడులకు పోకుండా తనవెంట తాను పోతుంది. వీరిని తమ కథా సాహిత్యం గురించి అడిగితే- 'నాకు కథా రచన సహజంగా అబ్బలేదు. గట్టిగా సాధన చేసి నేర్చుకున్నాను' అంటారు. అందుకే వీరి కథలు చదివితే రాయలసీమ నేపథ్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని, అందులోని మానవీయతను సున్నితంగా తనకథల్లో స్పర్శించినట్లు అర్థం అవుతుంది. ఈ కథలు చదువుతుంటే మన ప్రశాంతతకు భగ్నం కలుకుతుంది. అవి మెదడులో చేరి గగ్గోలు చేస్తాయి. ముఖ్యంగా రైతుల జీవితాల్లోని కన్నీటి చారికల్ని తుడుస్తాయి. మట్టి పరిమాళాల్లోని ముళ్ల బాధను కలిగిస్తాయి. నీళ్లులేని కరువు దృశ్యాలు మన ముందు కరాళనృత్యం చేస్తాయి. అందుకే సింగమనేని కథా జీవితం రైతు జీవితం అప్పులమయం నుంచి రైతు జీవితం ఆత్మహత్యలమయం వరకూ కన్నీళ్లతోనే ప్రయాణించింది అని చెప్పొచ్చు.
         నారాయణ కథలు కన్నడ, హిందీ, మళయాళం భాషల్లోకి అనువాదాలు అయ్యాయి. 
         సింగమనేని నారాయణ కథలు రాయడమే కాదు. కథా సంకలనాలకు కూడా సంపాదకత్వం వహించాడు. వీరు సీమ కథలు పుస్తకాన్ని 1992లో ప్రచురించినా అది 1994, 2010లో కూడా పునర్ముద్రణలు పొందింది. ఈ కథలు రాయలసీమ గ్రామల యదార్థ వ్యథలను, బతుకు అనుభవాలను పిండిన కథా రవ్వలు. తెలుగు కథలు - కథన రీతులు సంకలనాలకు కూడా సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర వారి తెలుగు కథకు కూడా సంపాదకత్వ బాధ్యతలు వహించారు.          
         సింగమనేని నారాయణ విమర్శకుడు కూడా- 'కొల్లాయి గ్టటితేనేమి', 'జానకి విముక్తి' నవలలు, చాసో, రారా, మధురాంతకం రాజారం తదితర కథకుల గురించి విమర్శ రాశారు. వీరి విమర్శ కటువుగా ఉన్నా సాహిత్య కారులకు కర్తవ్యాన్ని బోధిస్తుంది. వీరిది విమర్శలో కూడా వాస్తవిక దృష్టి. ప్రగతివాద విమర్శ. అందుకే సింగమనేనిది కొడవటిగంటి, రారాల మార్గం అని చెప్పొచ్చు. సంభాషణ పేరుతో వీరి వ్యాస సంపుటి కూడా వెలువడింది.
          ప్రజలు ఆంగ్ల భాషపై వ్యామోహం వీడి తెలుగభాషపై మక్కువ పెంచుకోవాలన్నది సింగమనేని నారాయణ అభిప్రాయం. వీరి శైలి- 'పొలం దున్నతున్నప్పుడు నాగేలులా సాగిపోతుంటుందని, కథ చదువుతున్నంతసేపు సీమపొలాల్లో నడుస్తున్నట్లుంటుంద'ని విమర్శకులు అభిప్రాయపడ్డారు. వీరి సాహిత్య కృషికి అప్పాజోస్యుల విష్ణుబొట్ల కందాళం పౌండేషన్ వారి పురస్కారం లభించింది. మరెన్నో పురస్కారాలు కూడా వచ్చాయి. నిత్యం సాహితీ సభలు, సమావేశాలకు వెళ్తూ ఉపన్యాసాల ద్వారా తెలుగు సాహిత్యాన్ని విశ్లేషిస్తుంటారు.
             రచయిత, కథకుడు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, సామాజిక కార్యకర్త అయిన సింగమనేని నారాయణ రాయలసీమలో సాహిత్య వాతావరణం ఏర్పరచడానికి శ్రమించాడు. అనేకమంది రచయితలకు మార్గాన్ని చూపాడు. అసలు ఆయనతో పది నిమిషాలు మాట్లాడితే ఓ కథా నేపథ్యం దొరుకుతుందట. అర్ధగంట మాట్లాడితే నవలే రాయొచ్చట. ఇదీ సింగమనేని జీవిత, సాహిత్యానుభవం.    

వీరికి పేరుప్రఖ్యాతులు తెచ్చిన