Facebook Twitter
ముదిగంటి సుజాతారెడ్డి

ముదిగంటి సుజాతారెడ్డి
                                                   

- డా. ఎ. రవీంద్రబాబు


           కథ, నవల, విమర్శ, సాహిత్య చరిత్ర, సమీక్ష, పరిశోథన, యాత్రాచరిత్ర, సంపాదకత్వం ... ఇది వెరసి ముదిగంటి సుజాతారెడ్డి సాహితీ చిత్రపటం. నేడు ప్రాంతీయ చైతన్యం గల రచనా మార్గానికి ఆమె ఒక మైలురాయి లాంటిది. తెలంగాణ సాహిత్య చరిత్ర రచనలో తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఎక్కడా అలసట, నిరాశ, నిస్పృహ చెందకుండా నేటికీ యువ సాహితీ వెేత్తలతో కలిసి పనిచేస్తున్నారు. మార్గదర్శకాలనే కాదు, తనూ ఓ చేయి వేసి తెలంగాణ కథ, నవలా చరిత్రకు సంబంధించిన కృషీ చేశారు. చేస్తూనే ఉన్నారు.
           ముదిగంటి సుజాతారెడ్డి మే 25, 1942లో నల్లగొండ జిల్లాలోని నకరేకల్ దగ్గరున్న ఆకారం గ్రామంలో జన్మించారు. అక్కడే బి.ఏ మొదటి సంవత్సరం వరకు చదువుకున్నారు.  1959లో గోపాల్ రెడ్డితో వివాహం అయింది. తర్వాత హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ రెండో సంవత్సరంలో చేరి ఎం.ఏ. వరకు చదుకున్నారు. 1975లో తెలుగు సాహిత్యంలో పిహెచ్.డి. చేసి డాక్టరేట్ కూడా పొందారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి 2000లలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేశారు.
         సుజాతారెడ్డి కేవలం కథా రచయిత్రి మాత్రమే కాదు తెలుగు సాహిత్యానికి సంబంధించి అనేక విలువైన గ్రంథాలు రచించారు.
         శ్రీనాథుని కవితా సౌందర్యం
         సంస్కృత సాహిత్య చరిత్ర
         ఆంధ్రుల సంస్కృతి - సాహిత్య చరిత్ర
         నాటక లక్షణాలు
         తెలుగు నవలానుశీలన
         వేమన నాథ సంప్రదాయం
         ముద్దెర (వ్యాస సంపుటి)
         ఆద్యతన దృష్టి (సాహిత్య వ్యాసాలు)         
         తొలినాటి కతలు (తొలితరం తెలంగాణ కథలు 1, 2)
         వట్టికోట ఆళ్వారుస్వామి కథల (జైలు లోపల) కు సంపాదక బాధ్యతలు వహించారు
         ముసురు (ఆత్మకథ)
         వీరి ఆత్మకథ 1940-50లలోని తెలంగాణ సాంఘిక జీవితాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది. అంతేకాదు 1960లలోని జర్మనీ గురించి కూడా వివరిస్తుంది.
         ఇక సృజనాత్మక రచనలు నవల, కథల గురించి-
         మలుపు తిరిగిన రథ చక్రాలు(1994) - నవల. ఇది  1946-86 ల మధ్యగల తెలంగాణ బతుకు చిత్రం
         సంకెళ్లు తెగాయి(1994) - నవల.  ఇది సంఘసంస్కరణను బోధించే విధంగా ప్రబోధాత్మకంగా సాగుతుంది.
         ఆకాశంలో విభజన రేఖలు లేవు (1995) - నవల. ఇది స్త్రీ పురుష సంబంధాలు, స్త్రీల అభ్యుదయం, స్వేచ్ఛ, సమానతలను కోరుకునే దిశగా సాగుతుంది.
         సుజాతారెడ్డిగారికి కథా రచయితగా కూడా మంచి పేరు ఉంది. వీరి కథలు సంపుటాలను వెలువరించారు.
         విసుర్రాయి (1998). ఇవి స్త్రీల జీవన విధానాన్ని అద్భుతంగా చిత్రించిన కథలు. వీటికి విశేషమైన స్పందన లభించింది. హిందీ బాషలోకి కూడా అనువాదం అయ్యాయి.
         మింగుతున్న పట్నం (2001). ఇవి బహుళజాతి కంపెనీలు అభివృద్ధిపేరిట సృష్టిస్తున్న విధ్వంసాన్ని తెలియజేస్తాయి.
         వ్యాపార మృగం. ఈ కథా సంపుటి ప్రపంచీకరణ పేదవాళ్లను మరీ పేదరికంలోకి నెట్టివేయబడటాన్ని బట్టబయలు చేస్తుంది.
         మరో మార్క్స్ పుట్టాలే...! ఈ కథా సంపుటి గడిచిన రెండు దశాబ్దాల సామాజిక జీవన వైవిధ్యానికి అద్దం పడుతుంది.
        వీరి కథలు మొత్తంమీద తెలంగాణ నుడికార సౌందర్యాన్ని పట్టి చూపిస్తాయి. మానవ సంబంధాల్లోని ఆర్ద్రతను పాఠకులకు కలిగిస్తాయి. సందేశాలు ఇచ్చే దిశగా సాగుతాయి. వీరు ఇటీవల రాసిన కథలు సాప్ట్ వేర్, రియలెస్టేట్, లాభసాటిగా మారిన రాజకీయాలు, సినిమాలు, మార్కెట్ మాయజాలంలో కొట్టుకుపోతున్న యువ ప్రపంచాన్ని మన కళ్లముందు ఉంచుతాయి. వీటి వెనుక ఉన్న రహస్యాలను విప్పి చూపుతాయి. వాస్తవాలను వెలికి తీసి మన కళ్లముందు పెడతాయి. ఉదాహరణకు 'న్యూ ఆనంద్ హోటల్ పాస్ట్ ఫుడ్ సెంటర్' కథను చూస్తే- ఆధునికీకరణ, ప్రపంచీకరణ వల్ల చీకట్లోకి, విషాదం లోకి నెట్టవేయబడుతున్న కుటుంబాలు కనపడాయి. ఈ కథలోని పాత్ర లాలయ్య ఆవేదన కూడా ఇదే.
         ఇంకా చెప్పాలంటే సుజాతారెడ్డి సృజనాత్మక రచనలు (కథలు, నవలలు) జీవన వైరుధ్యాలను చిత్రిస్తూ, పాఠకుల మనసుల్లో ప్రశ్నలు ఉదయించేలా చేస్తాయి. ఇదే వీటి గొప్పతనం. పత్రికల్లో వీరు రాసిన కాలమ్స్ కూడా ఇదే ధోరణిలో సాగాయి. 1999లో వీరి 'తెలుగు నవలానుశీలన' గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం అవార్టు వచ్చింది. ఇదే ఏడాది అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డూ లభించింది. వీరి 'రస సిద్ధాంతం - నవల' వ్యాసం విమర్శకుల ప్రశంసలు పొందింది. ముదిగంటి సుజాతారెడ్డి సాహిత్య కృషికు ఇంకా పలు బహుమతులు, సత్కారాలూ వరించాయి.
            సుజాతారెడ్డి ఇప్పటికీ హైదరాబాదులో నివశిస్తూ తెలుగు సాహిత్యానికి, తెలుగు కథకు... అస్తిత్వాన్ని ముందుకు తెచ్చిన తెలంగాణకు సేవ చేస్తూనే ఉన్నారు. సాహిత్య సభలు, సమావేశాలలో రచయితలు, కవులు, విద్యావేత్తలతో మాట్లాడుతూ... తన రచనలను కొనసాగిస్తూ ఉన్నారు. నేటి యువతరానికి మార్గాన్ని చూపుతున్నారు.