Facebook Twitter
చక్రి ... ఓ సింహం లాంటి మ్యూజిక్ డైరక్టర్

  చక్రి ... ఓ సింహం లాంటి మ్యూజిక్ డైరక్టర్
                              
                     

-  డా. ఎ. రవీంద్రబాబు


   

  అతి చిన్నవయసులోనే సినీ సంగీత ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. అటు క్లాస్ ను, ఇటు మాస్ ను ఆకట్టుకొనేలా మెలోడీలకు జీవం పోస్తున్నాడు. పక్కా నాటు పాటను కూడా అలవోకగా అందిస్తున్నాడు. సన్నివేశానికి తగిన ట్యూన్, సంఘటనకు తగిన బ్యాంగ్రౌండ్ మ్యూజిక్, హీరో ఇమేజ్ ను ఓ మెట్టు ఎక్కించే బాణీ... టోటల్ గా చిత్రం విజయంలో సంగీతానికి అతనో ఐకాన్ గా ముందుకెళ్తున్నాడు సినీ సంగీత దర్శకుడు చక్రి. అతి తక్కువ సమయంలోనే సెంచరీ చిత్రాల మ్యూజిక్ డైరక్టర్ గా ప్రేక్షకుల గుండెలపై ఆయన పాటలు నృత్యం చేస్తున్నాయి.
      చక్రీ అసలు పేరు చక్రధర్. సొంతవూరు పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలోని వరంగల్ జిల్లా వనపర్తి మండలంలోని కంభాలపల్లి గ్రామం. తండ్రి సాధారణ ఉపాధ్యుడు వెంకటనారాయణ, తల్లి విద్యావతి. తల్లి ఉగ్గుపాలతో, జోలపాటలతో సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు. తండ్రి నుంచి సంగీత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. సంగీతం పై ప్రేమతో ఎనిమిదో తరగతిలోనే మురళికి అందే పలుకులను ఒంటబట్టించుకున్నాడు. ఆపై ఇంటర్మీడియట్ లో కర్ణాటక సంగీతాన్ని, వయోలీన్ ను అవపోసన పట్టాడు. స్కూల్ రోజుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాలకు శిక్షణ ఇచ్చేవాడు. 18 ఏళ్లకే ఒకే జాతి మనదిరా... ఒకే బాట మనదిరా అంటూ పాటరాసి, కంపోజ్ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఊళ్లో సొంతగా ఒక ఆర్కెస్ట్రాను కూడా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చాడు. డిగ్రీ చదివే రోజుల్లోనే సొంతగా అనేక సొంత ట్యూన్లూ కట్టాడు.
            డిగ్రీ పూర్తి అయ్యాక పరిస్థితుల వల్ల1985, జూన్ 14న హైదరాబాదు వచ్చాడు. అతికష్టం మీద ఓ హాస్పెటల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా 1300 రూపాయలకు ఉద్యోగం సంపాదించాడు. కానీ మనసు అంతా మ్యూజిక్ పైనే, తన ఆత్మకు తనే దూరమవుతున్నానే బాధ. దాంతో ఉద్యోగం మానేసి, ఆల్బమ్స్ చేయడానికి పూనుకున్నాడు. సుమారు 40 వరకు  ఆల్బమ్స్ చేశాడు. వాటిలో చిరునవ్వుతో, వందేమాతరం అనేవి చక్రీకి మంచి పేరుతెచ్చాయి. కానీ అందరిలాగే తనూ సినిమా కష్టాలు పడ్డాడు. తన మ్యూజిక్ డైరక్షన్ లో వచ్చిన నేనింతే సినిమాలో చెప్పినట్లు కృష్ణానగర్ లో ఇల్లు. ఆకలి, అద్దెకట్టలేని దైన్యం, ఆల్బమ్స్ కోసం హైదరాబాద్ కోటీలోని షాపుల చుట్టూ తిరుగుళ్లు. సినీ కంపెనీల చుట్టూ ప్రదక్షణలు. వారి కల్లబొల్లి మాటలు నమ్మి జేబులో ఉన్న డబ్బులు ఖర్చు చేసేవాడు. చివరకు నిరాశ, నిస్పృహ. వెరసి ఓ చిన్నసైజు నరకాన్ని సంగీతం పై ఉన్న అభిమానంతో, ఆరాధనతో ఆనందంగా భరించాడు. కానీ సొంత ఊరికి వెళ్లాలను కోలేదు. చావో బతుకో సంగీతమే తన ప్రాణం, ప్రణవం అనుకున్నాడు. ఎప్పుడూ మనస్సును చెదరనివ్వలేదు. సంగీతం పైనుంచి దృష్టిని పక్కకు తిప్పలేదు.
            చివరకు ఏ స్వరసురవాణో కరుణించినట్లు 2000 సంవత్సరంలో లిటిల్ హార్ట్స్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే సత్యదేవ్ ద్వారా దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పరిచయం. అలా చివరకు బాచి సినిమా అవకాశం చక్రీని వరించింది. ఇక చక్రి వెనుతిరిగి చూడలేదు. నేటికీ సినీ ఆకాశంలో తన స్వరఝరిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. పాటలకు సరిగమల సొబగులద్దుతున్నాడు. సన్నివేశాలకు తన సంగీతంతో స్వరరచన చేస్తున్నాడు. పాత్రల హావభావాలకు అంతర్గతంగా భావోద్దీపన కలిగిస్తున్నాడు. నేడు తెలుగు సినీ చరిత్రలోనే కాకుండా దక్షిణాది భాషల్లో కూడా చక్రీకి ఓ సముచిత స్థానం ఉంది. అంటే దాని వెనుక అనేక పరాజయాల సోపానలు ఉన్నాయి. ఆకలి కేకలు ఉన్నాయి. అన్నిటికి మించి చక్రి మొక్కవోని ధైర్యం ఉంది.
           మళ్లి కూయవే గువ్వా అని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో వినే మెలోడీని తెలుగు ప్రేక్షకులు మళ్లీమళ్లీ విన్నారు. ఇడియట్ లో టీజింగ్ సాంగ్ యువతను కేరింతలు కొట్టిచ్చింది. వంశీ అంటే పదహారణాల తెలుగు సినిమాకు మరోరూపం. ఆయన టేకింగ్, మేకింగ్ అలాంటిది మరి. గోదావరిని గోముగా పలకరిస్తాడు. అలాంటి వంశీతో కలిసి ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాకు చక్రి పనిచేశారు. ఆ సినిమా విజయంలో పాటలే ప్రధానం. ఎన్నెన్నో అందాలు అన్నింట్లో అందాలు అని పాడుకున్నా, వెన్నెల్లో హాయ్.. హాయ్... మల్లెల్లో హాయ్.. హాయ్... అని హీరోహీరోయిన్లు చెప్పుకున్నా అది చక్రీ సంగీత చలువే. దేశముదురు చిత్రంలో అంటాటోడే.. ఇట్టాంటోడే అని నేటి యూత్ కు తగిన బాణీని కూర్చాడు చక్రీ. ఇదే చిత్రంలో సత్తే ఏగొడవా లేదూ అని హీరోతో ఎంట్రీ సాంగ్ పాడించాడు. అసలు సత్యం సినిమాలో ఓ మగువా నీతో దోస్తీ కోసం అన్న పాటతో ఎంతో మంది లేడీస్ ఫాలోవర్స్ ఏర్పడ్డారు చక్రీకి. వంశీ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా గోపి గోపిక గోదావరి. దీనిలో నువ్వక్కడంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల పాటతో చక్రీకి మెలోడీ బ్రహ్మగా గుర్తింపు వచ్చంది. శివమణి లో నాగార్జున లాంటి సీనియర్ నటుల ఉద్వేగాలకు సరైన మ్యూజిక్ ను పలికించాడు.  వైవీయస్ చౌదరి తీసిన సినిమా దేవదాసు. రామ్, ఇలియానా తొలి పరిచయం. దేవదాసు బంపర్ హిట్. అడిగి అడగలేక  అన్నా, ఓ నేస్తం కావాలే అన్నా హీరో హీరోయిన్లు గోముగా అడిగే ప్రేమకు చక్రీ అందమైన ట్యూన్ ఇచ్చాడు. ఇలా ఈ విజయానికి చక్రీ మ్యూజిక్కే కారణం అంటే తప్పక నమ్మల్సిందే. గోలీమార్ సినిమాలో హీరోయిన్ ద్వారా మగాళ్లు వట్టి మాయగాల్లే అని పాడిచ్చిన పాటకు చక్రి ఇచ్చిన ట్యూనే యుత్ లో క్రేజీని సృష్టించింది. ఇక చక్రం. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. దీనిలో జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.. అని సిరివెన్నెల రాసిన భావానికి చక్రి ఇచ్చిన గమకాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాయి. ఇక సింహా చిత్రం అఖండ విజయాన్ని అందిస్తే... దానికి చక్రి సంగీతం బంగారు కొండ. సింహం అంటి చిన్నోడే వేటకొచ్చాడే అని తన సంగీత వేటతో పాటు, మగువతో మగాళ్ల వేటను కూడా కొనసాగించే ట్యూన్ ను ఇచ్ాడు చక్రి. తెలంగాణ ప్రాంతానికి చెందిన చక్రీ ఆ అభిమానంతో జై బోలో తెలంగాణ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మ్యూజిక్ కు కీ చక్రీ. ఆయన గురించి చెప్పకుంటే పోతే స్వరాలు నవనాడుల్లో నాదాన్ని పుట్టిస్తాయి. మనసులు వెన్నెల్లో ఊరేగుతాయి. మగాళ్లని మాయగాళ్లు చేసి ప్రేయసుల వెంట తిప్పుతాయి.
            ఎన్ని మంచి పాటలు కూర్చినా, ఎన్ని మంచి చిత్రాలకు సంగీతం అందించినా చక్రీకి మాత్రం ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ అంటే ఇష్టం. ప్రాణ స్నేహితులు చిత్రంలోని స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా... పాటంటే ప్రాణం. ఎన్ని సంగీత వాయిద్యాలను మీటినా పిల్లనగ్రోవి అంటేనే మమకారం. సాగరసంగమం సినిమా అంటే మళ్లీమళ్లీ చూడాలనిపించేటంత పిచ్చి. చక్రీ కేవలం సినీ సంగీత దర్శకుడే కాదు ఆయనలో సామాజికి స్పృహకూడా ఉంది. చక్రి ఛారిటబుల్ ట్రస్టు స్థాపించాడు. తనకు స్ఫూర్తి ప్రధాత అయిన వివేకానందుడి పుట్టిన రోజున సేవాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. రక్తదానం, అన్నదానం వంటివి చేపడుతున్నాడు.            స్వరాల్ని పారిజాతాల్లా మార్చగల చక్రికీ ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. సత్యం సినిమా లోని ఓ మగువా నీతో స్నేహం కోసం పాటకు సౌత్ ఇండియా వారి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు వచ్చింది. శంకర్, జయకిషన్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డులు అందుకున్నారు. సంతోషం అవార్డులు వంటివి లభించాయి. సింహా సినిమాకు నంది అవార్డు సైతం ఆయన ముందు ఆనందంగా వాలింది. తనకు తోడుగా శ్రావ్యమైన శ్రావణీని జీవితభాగస్వామిగా ఎన్నుకున్నాడు.
       చక్రి పాటలు రాశాడు, పాడాడు, ట్యూన్సు కట్టాడు. ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఉవ్వెత్తున ఎగసిపడే స్వరాలను తన వేళ్లపై పలికించాడు. ప్రేక్షకుల ఎదలను మీటాడు. తన స్వరంలో నుంచి సప్తస్వరాలకు తనదైన శైలిలో ప్రాణం పోశాడు. ఆ సువాసననలో ఎంతో మంది అభిమానులు తడిసి ముద్దయ్యారు. అందుకే ఆయన పుట్టిన రోజు తెలుగు సినీ స్వర సరస్వతి, తనూ జన్మదినం జరుపుకుంటున్న ఆనందాన్ని పొందుతుంది అని భావిద్దాం. చక్రీకి, ఆయన సంగీతానికి జోష్ గా తెలుగు ఒన్ డాట్ కమ్ ద్వారా హాపీ బర్తడే విషెష్ ...