Facebook Twitter
మల్లాది రామకృష్ణశాస్త్రి

 మల్లాది రామకృష్ణశాస్త్రి
                                              

- డా.ఎ. రవీంద్రబాబు


        ఆయనది చక్కనైన తెలుగు భాష. అందమైన పలుకుబడులు, నుడికారాలతో ఆయన రచనలు తొణికిసలాడుతుంటాయి. అవసరమైన కొలది సంస్కృత పదాలు వాడినా అవి పంటికింద రాళ్లలా అనిపించవు. హాయిగా సముద్రపు గాలిలో తేలుతున్నట్లు ఉంటాయి మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలు. కథ రాసినా, పాట రాసినా, మాటలు రాసినా మల్లాది వారిని ఇట్టే పట్టేయవచ్చు. తెలుగు కథా కథనా రీతుల్లో మల్లాది వారి స్థానం మామిడిపండు లాంటిది అంటారు ఆయన కథలు చదివిన అభిమానులు.
           మల్లాది రామకృష్ణశాస్త్రి జూన్ 16, 1905లో కృష్ణాజిల్లాలోని మచలీపట్నం దగ్గరున్న చిట్టిగూడూరు గ్రామంలో పుట్టారు. మచలీపట్నంలోనే బి.ఏ. వరకు చదువుకున్నారు. మద్రాసు వెళ్లి అక్కడ సంస్కృత, తెలుగు భాషల్లో ఎం.ఏ పట్టాలు పొందారు. అంతేకాదు ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో మంచి పాండిత్యాన్ని సంపాదించాడు. నలభైకి పైగా భాషలను అభ్యసించిన ఘనుడాయన. వివిధ శాస్త్రాల్లో పాండిత్యాన్ని సంపాదించి మద్రాసులోని పానగల్ పార్కులో అనేకమందికి వాటిని బోధించేవాడు. సంపన్న కుటుంబంలో పుట్టినా లేమిరికాన్ని అనుభవించాడు. పత్రికల్లో అనేక ఉద్యోగాలు చేశాడు. అనేక చిత్రాలకు అజ్ఞాతంగా సేవలను అందించాడు. 1920లో వెంకటరమణను వివాహం చేసుకున్నాడు.
               మల్లాది వారు 'కృష్ణాపత్రిక'లో ఛందోబద్దమైన కవిత్వాన్నే కాదు, 'చలువ మిరియాలు' లాంటి వ్యంగ్య వ్యాసాలూ రాశారు. పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. 'దేశాభిమానం' పత్రికకు కొంతకాలం ఉపసంపాదకులుగా పనిచేశారు. ఆహల్యా సంక్రందనము, హంసవింశతి గ్రంథాలకు పీఠికలు వెలయించారు. 19 సంవత్సరాల వయసులో కథారచనను ప్రారంభించాడు. సుమారు 250 కథలు రాశాడు. 'తేజోమూర్తులు', 'కృష్ణాతీరం' నవలల్ని కూడా రచించాడు. వీరి కథలు-
            దోదమ్మ (1963)
            వనమాల (1963)
            రసమంజరి (1970)
            రామకృష్ణ శాస్త్రి కథా సంపుటాలు 1, 2... (1984-2000) పేరిట ముద్రితమయ్యాయి. వీరి కథల్ని రెండు రకాలుగా విభజించి చూడవచ్చు.
       1. పురాణాలు, ఇతిహాసాల ఇతివృత్తాలతో కూడినవి.
        'వనమాల', 'స్వరమేళ', 'రంగవళ్లి', 'డు.ము.వు.లు.' లాంటివి
       2. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, మానవీయ నేపథ్యంతో కూడినవి.
          వీరి కథల్లోని ఇతివృత్తం ఎక్కవ స్త్రీ, పురుష సంబంధాల చుట్టు తిరుగుతుంటుంది. కొందరు స్త్రీలు భోగవస్తువులుగా కనపడితే, మరికొందరు విలక్షణ వ్యక్తిత్వంతో ప్రకాశిస్తుంటారు. 'కనక జానకి' కథలో 'నేనెందుకు మీతో లేచిపోవాలీ... కావలిస్తే మీరే రండి నాదగ్గరకు' అని సవాల్ చేస్తుంది స్త్రీ. తెలుగు సమాజంలో 20వ శతాబ్దంలో వచ్చిన మార్పులు వీరి కథా జగత్తలో సంపూర్ణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు 'చైత్రరథం' కథలో ఆనాటి రాజకీయాలు, రాజకీయ నాయకుల చిత్తవృత్తులను వివరంగా చిత్రించాడు. అందుకే వీరి పాత్రలు వైవిధ్యంతో నిండి మానవ సాంఘిక పరిణామాన్ని చలన చిత్రంగా చూపుతాయి.
           వీరి రచనలు మరో భాషకు లొంగవు. కథల్లోని సంభాషణలను అర్థం చేసుకోవాలంటే కామాలు, సెమీకోలన్స్, చిన్నచిన్న గీతలు, ఆశ్చర్యార్థకాలు, ప్రశ్నార్థకాలు అన్ని పాటిస్తూ చదవాలి. మల్లాది వారి కథలు ఎక్కువ మధ్యమ పురుషలో నడుస్తాయి. 'ఖామోష్' కథ మాండలిక భాషలో సాగుతుంది. 'ఆడకూతురికి ఓ కంట యెన్నెలుండాలి. ఓ కంట కత్తులుండాలి. గొెంతులో కోయిల లుండాలి, కొరడా ఉండాలి...' ఇలా బాధలో, కోపంలో సాగే స్వచ్ఛమైన తెలుగులో ఉంటుంది ఈ కథ. వీరి కథలు ఎక్కవ కృష్ణా జిల్లా వ్యవహారిక భాషలో సాగుతాయి. మల్లాది వారి కథల మరో లక్షణం సన్నివేశం, సంఘటన జరిగినప్పుడు దాని తాలూకూ  పాత్రల మనోభావాలను, పరిణామాలను, వాతావరణాన్ని విశ్లేషించేవిగా ఉంటాయి.
            మల్లాది రామకృష్ణ శాస్త్రిది భావనా జగత్తు. పాత్రలు ఊహల్లో విహరిస్తుంటాయి. ఇతి వృత్తాలు శృంగారభరితంగా ఉంటాయి. కథలు గురించి మల్లాది వారే స్వయంగా చెప్తూ... 'కథకు తలా తోకా ఉండాలా... అది పాత్రల ఇష్టం. కథని మొదలు పెట్టడం వరకే రచయిత బాధ్యత. ఆ తర్వాత పాత్రలే కథను నడిపిస్తాయి.' అన్నారు. 'చూర్ణిక' కథలో- 'మానాన్న చూశావ్. బయట పరమ సాధువు. ఇంట ఫాలాక్షుడు... ఎవరి మీదా కోపం కాదు. ఎందుకో ఒకందుకని కాదు. ఎప్పుడు ఒకటే ధుమధుమ... అలా అని పెళ్లాన్ని వేపుక తినేవాడా... అక్కడ పిల్లి... నా మీద మాత్రం ఒంటికాలి మీద లేచేవాడు...' అంటూ తమాషాగా చమత్కారంగా పాత్ర గురించి రాస్తాడు.
   వీరి 'డు.ము.వు.లు' కథ 40 భాషల్లోకి అనువాదం అయింది.                    మల్లాది రామకృష్ణశాస్త్రి సినీ జీవితానికి వస్తే- 39 చిత్రాలకు సుమారు 200 పాటల్ని రాశారు. వీరు మొదట 1952లో 'చిన్నకోడలు' చిత్రంలో 'పిల్లనగ్రోవి పాటకాడ...' అనే పాటతో చలన చిత్రరంగంలోకి అడుగుపెట్టాడు. ఆఖరిత్రం 1968లో వచ్చిన 'వీరాంజనేయ'. కానీ తర్వాత కూడా వీరి పాటలను 'రహస్యం', 'అత్తగారు-కొత్తకోడలు' చిత్రంలో వాడుకున్నారు. చాలాకాలం సముద్రాల దగ్గర ఘోస్ట్ రచయితగా చాలా సినిమాలకు పనిచేశారు. అసలు ఘోస్ట్ రచనా పద్ధతి వీరితోనే తెలుగుచిత్రసీమలో మొదలైంది అని చెప్తారు. శ్రీశ్రీ కూడా మల్లాదివారే తనను సిినిమాలకు పరిచయం చేసిన గురుతుల్యులు అని చెప్పుకున్నారు.
              వీరి పాటల్లో సన్నజాజుల సౌకుమార్యం, సంపెంగపూల సౌరభం కలిసి ఉంటాయి. 'చిరంజీవులు' (1956) చిత్రంలో 'తెల్లవార వచ్చె తెలియక పరుండేవు లేరా...' పాట మార్మిక భక్తికి మరో మచ్చుతునక. అలానే 'జయభేరి' (1959) చిత్రంలోని 'రాగమయీ రావే అనురాగమయీ రావే...' పాట ప్రతీకలతో నిండి ప్రియుడు పాడుకునే ప్రణయగీతంగా ప్రసిద్ధికెక్కింది. 'దేశద్రోహులు' (1964) సినిమాలో 'మన స్వతంత్ర భారతం, మహామహుల త్యాగఫలం...' పాట దేశభక్తి గీతాలకు ఓ వరవడిని సిద్ధం చేసింది. ఇలా వీరి పాటలు కూడా సరళమైన పదప్రయోగంతో, అందమైన అనుప్రాసలతో స్వయం ప్రకాశంగా వెలుగొందుతున్నాయి.
         రామకృష్ణ శాస్త్రి గురించి ఆరుద్ర- 'రామకృష్ణ శాస్త్రి గారు సముద్రుడి కన్నా గొప్పవాడు. తనలో ఎన్నో నిధి నిక్షేపాలున్నా గొప్పవాడినంటూ సముద్రిడిలా ఘోష పెట్టడు. రామకృష్ణ శాస్త్రి అగస్త్యుడికన్నా గొప్పవాడు. అగస్త్యుడు సముద్రాలను పుక్కిట పట్టి వదిలి పెట్టేశాడు. శాస్త్రి గారు భాషా సముద్రాలను తనలోనే నిలబెట్టుకున్నారు'. అని చెప్పారు. ఇంతకంటే మల్లాది వారి గురించి చెుప్పడం కష్టసాధ్యమేమో...
           సెప్టెంబరు 12, 1965లో మల్లాది రామకృష్ణశాస్త్రి మరణించినప్పడు ఆత్రేయ స్మృతిగీతం రాస్తూ-
           'తెలుగు పోయింది... తెలుగుదనం పోయింది
           తెలుగు ధనం పోయింది... తెలుగు లిపి సొగసు పోయింది
           తెలుగు చిలిపి పొగరు పోయింది...
           తెలుగు రచన కొయ్యబారింది... తెలుగు రసన బండబారింది
           తెలుగు నుడికారం తెల్లవారి పిడికెడు తెల్లబూడిదయ్యింది.  
                               అని బాధపడ్డారు.
          ఇది నేటికీ అక్షర సత్యం.