Facebook Twitter
బుచ్చిబాబు

     బుచ్చిబాబు
                              
                                              

డా. ఎ. రవీంద్రబాబు

 

 


 
           తెలుగు కథ, నవలా సాహిత్యాన్ని రెండో దశకంలో ప్రభావితం చేసిన రచయితల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బుచ్చిబాబు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగుకు నూతన పోకడలు, లక్షణాలను నిర్దేశించిన రచయిత. ఎక్కడా తెలుగు ప్రాంతీయ శోభ తగ్గకుండా ఆధునిక సాహిత్య విలువలను నర్మగర్భితంగా వెలిబుచ్చిన ప్రతిభామూర్తి. తెలుగు నవలకు, కథకు నవ్య పంథాను చూపిన వారిలో బుచ్చిబాబు ఒకరు. ఎందరో భవిష్యత్ రచయితలకు, విమర్శకులకు మార్గదర్శకులు.
         బుచ్చిబాబు అసలు పేరు శివారాజు వెంకట సుబ్బారావు. జూన్ 14, 1916న ఏలూరులో జన్మించాడు. తల్లి వెంకాయమ్మ, తండ్రి సూర్యప్రకాశరావు. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ఎస్.ఎస్.ఎల్.సి. వరకు కంకిపాడు, పాలకొల్లులో చదివాడు. ఇంటర్మీడియట్, బి.ఏ. గుంటూరలోని ఆంధ్ర క్రిష్టియన్ కళాశాలలో చదువుకున్నాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. ఆనర్సు పూర్తిచేశాడు. తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషులో ఎం.ఎ. పట్టా సంపాదించాడు. కొంతకాలం అనంతపురం, విశాఖపట్నాలలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేశాడు. అటు పిమ్మట 1945 నుంచి 1967 మరణించే వరకు ఆలిండియా రేడియోలో పనిచేశాడు.
          కథ, నవలా రచయిత, నాటక కర్త, వ్యాసకర్తగా పేరొందిన బుచ్చిబాబు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే మ్యాగజేన్ కోసం ఆంగ్లంలో కవితలు, 'పశ్చాత్తాపం' లేదు అనే తెలుగు కథను రాశాడు. సుమారు 80కి పైగా కథలు, 40 వ్యాసాలు, 40 నాటికలు, నాటకాలు రాశాడు. పీఠికలు, పరిచయ రచనలు, స్వీయచరిత్ర కూడా కొంతభాగం చేశాడు. వీరి రచనల్లో ముఖ్యమైనవి-
       చివరకు మిగిలేది
       అజ్ఞానం
       ఆద్యంతాల మధ్య దారి
       నా అంతరంగ కథనం
       షేక్ స్పియర్ సాహిత్య పరామర్శ...

       చివరకు మిగిలేది నవలను తెలుగు  సాహిత్యంలో తొలి మనో వైజ్ఞానిక నవలగా విమర్శకులు చెప్తారు. పాఠకులకు జీవితంపై ఓ దృక్పథం ఏర్పరచడం కోసమే ఈ రచన చేశానని బుచ్చిబాబు చెప్పాడు. నవలలో ప్రధాన పాత్ర దయానిధిని తల్లి చేసిన అపచారం నీడలా వెంటాడుతుంది. అతని జీవితాన్ని కలుషితం చేస్తుంది. దయనిధి అన్నిటిని ఎదుర్కొని జీవితానికి సంబంధించిన కొన్ని విలువలను సాధిస్తాడు. నవలలో కథంతా ఇతనికి చెందిన తాత్విక కోణంలో నడుస్తుంది.
        'వాంఛ దైహికం, ప్రేమ మానసికం. వాంఛలో స్వార్థం వుంది. ప్రేమలో త్యాగం వుంది.' ఇలాంటి వాక్యాలు నవలలో ఎన్నో కనిపిస్తాయి. మనకు జీవన తత్వాన్ని బోధిస్తాయి. నవలంతా ప్రథమ పురుషలో సాగినా దయానిధి ఆంతరంగిక కథనం కనుక ఉత్తమ పురుషలో ఉన్నట్లు కనిపిస్తుంది. జీవితం పుట్టిన క్షణం నుండీ మరణం వరకూ సాగే ప్రయాణం. అయితే ఈ నవల జీవితానికి అర్థం లేదు. చివరకు ఏమీ మిగలదు అని చెప్తూనే జీవితాన్ని సౌందర్యవంతంగా అనుభూతి చెందాలంటుంది. ఇదే దయానిధి సిద్ధాంతం.
        కథల విషయానికి వస్తే బుచ్చిబాబు కథ మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యంలా సాగాలని చెప్పారు. వీరి కథలు-
 

         నన్ను గురించి కథ వ్రాయవూ

         అరకులోయలో కూలిన శిఖరం
         దేశం నాకిచ్చిన సందేశం
         మేడమెట్లు
         పొగలేని నిప్పు
         అడవి గాచిన వెన్నెల
         పాతనీరు-కొత్త వంతెన... ఇలాంటి చాలా కథలు సార్వ జనీనం, సర్వ సాలికం. ఇతి వృత్తాలు అనంతం. స్త్రీ, పురుషుల మధ్య ఉండే ప్రేమానురాగాల్ని, ఆంతరంగిక జగత్తులోని కల్లోలాలని, సౌందర్యాన్వేషణను, స్వేచ్ఛామానసాన్ని, ప్రకృతి ప్రేమను హృదయానికి హత్తుకనేలా, ద్రవించేలా రాస్తాడు.
         వీరు కథాచిత్రణలో పడికట్టు పదాలను, పాత చింతకాయ పచ్చడిని వాడరు. సానబట్టిన వజ్రంలా కొనసాగిస్తారు. ప్రపంచ సాహిత్య పోకడల్ని తెలుగు కథకు పరిచయం చేస్తాడు. 'చైతన్య స్రవంతి', 'గాజుమేడ' లాంటి కథలు ఈ కోవకు చెందినవే... 'మనిషికి మనిషికి మధ్యలోనే కాదు గోడలుండటం, ప్రతి మనిషిలోనూ ఒక పల్చటి పొర వుంటుంది. ఆ తెర ఊడి పోకుండా సంఘం కాపలాకాస్తుంది.' అని మనిషి సమాజంలో ఉంటూనే జీవితాన్ని సౌందర్యభరితం చేసుకోవాలంటాడు బుచ్చిబాబు. అందువల్లేనేమో... కథల్లో కల్పనా జగత్తుకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న పొరను చీల్చి వేయడానికి ప్రయత్నించాడు. ప్రతి పదం, వాక్యం, నిర్మాణం, పోలిక అన్నీ కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యంతో పాటు అనుభూతికి లోను చేశాడు. ఊహల్లో విహరింపజేస్తూనే గుండెను పట్టేస్తాడు. భావోద్వేగాలను చిక్కగా కురిపిస్తాడు.
           'తనకేం కావాలో తెలీనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు. ఏం కావాలో తెలిస్తే, ఆ వొస్తువును ప్రేమించి, దాన్ని పొందడం కోసం ప్రయత్నిస్తాడు. తెలీనప్పుడు హృదయంలో మిగిలేది ద్వేషం. అక్కర్లేదని తెలుసుకుంటే ద్వేషం ఉండదు.' ఇలాంటి జీవన సత్యాలు వీరి రచనల్లో కోకొల్లలుగా మనకు దొరుకుతాయి. జీవితాన్ని చక్క దిద్దుకోమంటాయి.
          బుచ్చిబాబు తన రచనా వ్యాసంగం గురించి చేప్తూ- 'బాహ్య జగత్తులోని విషయాలు అంతరంగంలోకి ప్రవేశించి, ఒక మూల నక్కి ఉండి ఎప్పుడో ఒకసారి బైట పెట్టమని ఒత్తిడి జరిగినప్పుడే అవి కథలుగా అవతరిస్తాయి' అని చెప్పుకున్నాడు. బుచ్చిబాబు కథని మూడుముక్కల్లో చెప్పడు. విపులంగా, కులంకషంగా, లోతుగా చెప్పడం ఆయనకు అలవాటు. జీవితంలో సంతృప్తిని సూత్రీకరణ చేస్తూ- 'సంతోషం సంచలనాత్మకమైనది. సంచలనాత్మకమైన దానికెప్పుడూ అవతలి పక్షం వుంటుంది. సంతోషం జారిపోతే దుఃఖం కలుగుతుంది. కానీ హృదయ లోతుల్లోంచి జన్మించే సంతృప్తికి దీటైనది ఏదీ లేదు.' అంటాడు.

       బుచ్చిబాబు ఇంద్రజాలికడు. దాన్ని తన రచనల్తో చేసి చూపించాడు. శైలి, సన్నివేశం, పాత్ర, ఔచిత్యం, ప్రారంభం, నడక, ముగింపు ... ఇలా  కథనాన్ని, వస్తువును మమేకం చేసి చూపించే కళాద్రష్ట బుచ్చిబాబు. ఎక్కడో పుట్టి క్రమంగా ఉదృతమై పారే జలపాతం పంటపొలాల్ని తడిపనట్లు మన హృదయాలను చల్లగా తడుపుతాయి వీరి కథలు. రచనలు.