Facebook Twitter
ధర్మవడ్డీ

ధర్మవడ్డీ

  - త్రిపురనేని గోపీచంద్

 

 

    ఆధునిక తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కథ, నవలల్లో గోపీచంద్ ది ప్రత్యేకముద్ర. రచనను ప్రారంభించడంలో, ముగించడంలో ఆయనదో ఒరవడి. గోపీచంద్ కథల్లోనే కాదు, తెలుగు కథా సాహిత్యంలో కూడా 'ధర్మవడ్డీ' చెప్పుకోదగిన కథ. మనిషిని ధనం అనే మహమ్మారి ఎలా ఒంటరిని చేసి, ఆత్మహత్య చేసుకునేలా చేస్తుందో గోపీచంద్ ఈ కథలో అద్భుతంగా చెప్పారు రచయిత.
      కథలోకి ప్రవేశిస్తే- 'నేను ఆ ఊరు ఎందుకు వెళ్లానో, నాకిప్పుడు జ్ఞాపకం లేదు కాని... ' అని అనుభవాల్లోంచి కథను నడిపిస్తాడు గోపీచంద్. అతను, అతని స్నేహితుడు కలిసి ఇంట్లో మాట్లుడుకుంటూ ఉంటే సూరయ్య ప్రవశిస్తాడు. అతని దగ్గరున్న మూటను విప్పి 'ఇదిగోనోయ్ డబ్బూ...' అని రాళ్లను ఇచ్చి పైగా 'నూటికి రూపాయిన్నర వడ్డీ... మళ్లీ యిరవై సోమవారం నాటికి దమ్మిడీతో సహా యిచ్చెయ్యాలి' అని ఒట్టేయించుకుని వెళ్లిపోతాడు. అలా బయటకు వెళ్లి మళ్లీ వస్తాడు. 'ఏదీ నా డబ్బు...? ఎన్నాళ్లయింది?. పరువు మర్యాదా వుండక్కర్లేదా? కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అని తిట్టి, ఇచ్చిన రాళ్లను, వడ్డీ కింద ఇంకొన్ని రాళ్లను తీసుకొని వెళ్లిపోతాడు.
         ఈ తతంగం అంతా చూసిన స్నేహితుడు 'అతనికి ఏమైంది?' అని విస్తుపోయి అడుగుతాడు. స్నేహితుడు చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. సూరయ్య తండ్రి మంచితనంతో ఉన్న ఆస్తినంతా దానధర్మాలు చేసి దిక్కులేకుండా చనిపోతాడు. దాంతో సూరయ్య కసితో డబ్బు సంపాదించడం ప్రాంరభించి ఊళ్లో వాళ్లకు వడ్డీలకిచ్చేవాడు. కానీ ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా, కాపురాలు నాశనం అయినా చలించకుండా బాకీలు వసూలు చేసేవాడు. క్రమంగా ఊళ్లో వాళ్లకి సూరయ్య మీద అసూయ, అసహ్యం పెరుగుతుంది. సూరయ్య చంద్రయ్య అనే మద్యతరగతి రైతుకు అప్పు ఇచ్చి ఉంటాడు. అతను కొద్దిగా పలుకుబడి కలిగిన వ్యక్తి. చంద్రయ్యకు బాకీ రెండువందలు ఇవ్వకుండా 'నీకు చేతనైంది చేసుకుపో' అంటాడు. కోపంతో సూరయ్య టౌనుకెళ్లి కేసుపెడ్తాడు. వచ్చే టప్పుడు రాత్రిపూట చంద్రయ్య పదిమందితో వెళ్లి సూరయ్యని కొటడతాడు. ఈ వార్త ఊరంతా పొక్కుతుంది. దాంతో సూరయ్య పరువు పోతుంది. చులకనై పోతాడు. పిల్లలు కూడా 'సూరయ్య వడ్డీ చంద్రయ్య లాఠీ' అని ఏడిపించే స్థితికి వస్తాడు. ఊళ్లో మిగిలిన వాళ్లూ బాకీలు ఎగేస్తారు. క్రమంగా సూరయ్య పేదవాడై పోతాడు. తనకు రావలసిన ఆస్తి రాదనుకొని అల్లుడు సూరయ్య కూతుర్ని ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు. ఊళ్లో కొంతమంది సూరయ్య మీదున్న కసితో కూతుర్ని మానభంగం చేస్తారు. ఆ అవమానాన్ని బరించలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది కూతురు. భార్య కిరోసిన్ పోసుకుని చనిపోతుంది. దాంతో సూరయ్యకు గుండెలు పగిలి పిచ్చి పడుతుంది. ఇంటికి, బావి దగ్గరకు తిరుగుతూ ఉంటాడు. రాళ్లనే డబ్బులని వడ్డీలకు ఇస్తూ వుంటాడు.
             ఈ కథంతా విన్న తర్వాత బయట ఏదో గొడవగా ఉంటే స్నేహితులు ఇద్దరూ బయటకు వస్తారు. సూరయ్యను పిల్లలు గోలచేస్తూ ఉంటారు. సూరయ్య రాళ్ల మూటతో నేరుగా వెళ్లి బావిలో దూకుతాడు అని  గోపీచంద్ కథను విసాదాంతంగామ ముగిస్తాడు.
          కథలో ప్రథాన పాత్ర స్వభావాన్ని, వచ్చిన మార్పును పూసగుచ్చినట్లు మరో పాత్రతో చెప్పించడం ఈ కథలోని గొప్ప టెక్నిక్. కథను ఉత్తమ పురుషలో ప్రాంరంభించినా ప్రథమ పురుష ద్వారా చెప్పించాడు. చెయ్యి తిరిగిన రచయిత గోపీచంద్ కథా నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథను 'రాళ్లను డబ్బులుగా వడ్డీకి' ఇచ్చే సన్నివేశంతో ప్రారంభించి పాఠకునిలో ఉత్కంఠను కలిగించాడు. చివరకు మరణంతో విషాదవీచికను మనలో నింపాడు. అంతేకాదు సూరయ్య ప్రవర్తనకు కారణాన్ని తండ్రిలో వెతుక్కోమన్నాడు. పాత్రౌచితభాష, సంభాషణా లౌక్యం, వాస్తవిక చిత్రణ కథకు జీవాన్ని పోశాయి. గోపీచంద్ వాక్యం ఆగదు. అలాగని పరుగెత్తదు. నెమ్మదిగా నడిపిస్తుంది. 'పిల్లికి బిచ్చం పెట్టడు', 'అరిచి గీపెట్టినా దమ్మిడీ వదలడు' లాంటి పిసినారి తనానికి చెందిన లోకోక్తులు సందర్భోచితంగా కనిపిస్తాయి. 'క్షణాల మీద యీ వార్త వూరంతా పొక్కింది' లాంటివి లోకంలోని మనిషి స్వభావానికి అద్దం వంటివి.
        సూరయ్య రెండోసారి వచ్చినప్పుడు 'ఆపాద మస్తకం వొణికిపోతున్నాడు, కళ్లు యెర్రగా జ్యోతుల్లా వున్నై, గాలి తెగ పీలుస్తున్నాడు... 'లాంటి ఎన్నో పాత్ర భౌతిక వర్ణనలు అలకరించని అలంకరణలే. ఈ కథ నాటకంగా కూడా టీవీలో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమాజ స్వభావానికి, మనిషి పేరాశకు ఈ కథ ప్రతిబింబిం వంటిది. ప్రతి మనిషి చదివి తనను తాను ఉన్నతంగా మార్చుకోడానికి ఉపయోగపడుతుంది.
                                           
- డా.ఎ.రవీంద్రబాబు