Facebook Twitter
కాళీపట్నం రామారావు

కాళీపట్నం రామారావు
                     
  

డా.ఎ. రవీంద్రబాబు

 


    కారా మాస్టారుగా సుపరిచితులైన కథా రచయితే కాళీపట్నం రామారావు. రెండోతరం తెలుగు కథా సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్రవేశాడు. కథాసేవే తన జీవిత మార్గంగా ఎన్నుకుని జీవిస్తున్న సాహిత్య సృజనశీలి. నిత్యం కథ గురించి మాట్లాడుతూ, కథ గురించి రాస్తూ, కథల్ని భద్రపరుస్తూ కథే జీవితమైన వ్యక్తి కాళీపట్నం రామారావు. గురజాడ బాటను కథల్లో మరింత ముందుకు తీసుకెళ్లి, దానికి అభ్యుదయ వాసనలు పూయించిన ఘనుల్లో కారా మాస్టారు ముఖ్యులు.
       కారా మాస్టారు శ్రీకాకుళం జిల్లా మురపాకలోనవంబరు 9, 1924లో జన్మించారు. వీరి నాన్న కరణం పేర్రాజు. అక్కడే ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదువుకున్నారు. విశాఖ జిల్లా భీమిలీలో టీచర్ ట్రైనింగ్ శిక్షణ తీసుకున్నారు. 1948లో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి 31 ఏళ్లపాటు ఎందరో విద్యార్థులకు పాఠాలు బోధించాడు. 1979లో ఉద్యోగ విరమణ చేశారు. మార్చి 19, 1946లో సీతామహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు. జీవితంలో అనేక సాధక బాధకాలు పడ్డారు.
          కారా మాస్టారు తన 19వ ఏట తొలికథ 'ప్లాటు ఫారమో...' రాశారు. ఇది 1943లో 'చిత్రగుప్త' పత్రికలో వచ్చింది. ఆ తర్వాత 'వీసంలో... అయితే గియితే' పేరుతో రెండో రాశారు. రామారావు మొదట స్వాతంత్ర్య పోరాటం, గాంధీ భావాలు, నెహ్రూ సోషలిస్టు భావాల ప్రభావంతో కథలు రాసినట్లు కనిపిస్తుంది. రాగమయి, అభిమానాలు, అభిశప్తులు, పలాయితడు... లాంటి కథలు ఇలాంటివే. 1967లో నక్సల్బరీ ఉద్యమం తర్వాత వీరి చూపులో మార్పు వచ్చింది. కారా గారికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన కథ 'యజ్ఞం' 1966లోనే వెలువడింది. తర్వాత ఈ భావాలతోనే హింస, నో రూమ్, ఆర్తి, భయం, చావు, కుట్ర, ఆయన చావు... లాంటి ఎన్నో కథలు వీరి నుంచి వచ్చాయి. ఇవన్నీ తెలుగులో శాశ్వతంగా నిలిచిపోయే రచనలు.
     వీరి రచనలు పలు సంపుటాలుగా ముద్రితమయ్యాయి. రాగమయి (1957), యజ్ఞం (1971), కాళీపట్నం రామారావు కథలు (1972), అభిమానాలు (1974), జీవధార-ఇతర కథలు (1974), కాళీపట్నం రామారావు కథలు (1986), యజ్ఞంతో తొమ్మిది (1993), కాళీపట్నం రామారావు కథలు( 1999). 2008లో వీరి రచనలు అన్నీ 567 పేజీల గ్రంథంగా వెలుగులోకి వచ్చింది.
          'యజ్ఞం' కథ తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథ. ఈ కథలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించారు. అందులో నిగూఢంగా కనిపించే ధనికవర్గం పక్షపాతాన్ని సూటిగా చెప్పారు. కథా లోతుకు, విస్తృతమైన పరిదికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ.
          'జీవధార' కథలో పేదవాళ్లు నీళ్లు దొరక్క నానా యాతన పడుతుంటే... శ్రీమంతులు విలాసం కోసం పెంచుకునే క్రోటను మొక్కలకు నీళ్లు వృధా చేస్తూ ఉంటారు. పేదవాళ్లందరూ కలిసి నీళ్లకోసం శ్రీమంతుల ఇంటికి వెళ్తారు. వాళ్లు జనశక్తికి బెదిరి అనుగ్రహించే దేవుళ్లలా పట్టుకోమంటారు. ఇలా సాగుతుంది కథ. ఈ కథలో లోతుగా వర్గ దృక్పథమే ఉంటుంది. కానీ రచయిత ఎక్కడా ప్రవేశించడు. తన భావాలను చెప్పడు. శిల్పం దృష్ట్యా కూడా ఇదో గొప్పకథ.
           కాళీపట్నం రామారావు ప్రత్యేకతే ఇది. రచయిత చెప్పదలచుకున్న భావం అంతర్లీనంగా పాఠకుడికి చేరుతుంది. భాష సరళంగా ఉంటుంది. జీవితంలో అనుభవించి, పరిశీలించి, కష్టాలను, సంఘర్షణలను కథల్లో రాశారు కారా. అట్టడగు వర్గాల జీవన సమరాన్ని పాత్రల్లో ప్రవేశపెట్టాడు. ఆరు దశాబ్దాలు తెలుగు కథను సుసంపన్నం చేసిన కారా మాస్టారి కథలు రష్యన్, ఇంగ్లీషు, ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదాలయ్యాయి. ఆంధ్రభూమి దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి ఎంతో మంది కొత్త రచయితలను ప్రోత్సహించారు.  
          కారా మాస్టారు తన కథా రచనకు కొడవటిగంటి కుటుంబరావును గురువుగా, రా.వి.శాస్త్రిని మార్గదర్శకునిగా భావిస్తారు. కానీ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మాత్రం వీరిని గురువుగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటిస్తే ప్రభుత్వ విధనాలు నచ్చక తిరస్కరించారు. 1995లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును స్నేహితుల కోరిక ప్రకారం అందుకుని ఆ డబ్బుతో ఫిబ్రవరి 22, 1977లో శ్రీకాకుళంలో 'కథానిలయా'న్ని స్థాపించారు. ఇక్కడ సుమారు ప్రముఖ తెలుగు పత్రికలన్నీ దొరుకుతాయి. 600ల మంది కథా రచయితల కథలు లభ్యమవుతాయి. రామారావు నేడు కథా రచయతల జీవిత విశేషాలను, ఛాయాచిత్రాలను భద్రపరిచే పనిలో ఉన్నారు. ఇదొక అపూర్వమైన కథా ప్రపంచం. తెలుగులో సుమారు 3000ల మంది కథా రచయితలు ఉన్నారని వీరి అంచనా...
       'జీవితానికి చాలా ముఖాలున్నాయి. ఆంతరంగిక జీవితం మనకొక్కడికి మాత్రమే. అది అందరికీ కాదు, కొందరికే తెలుస్తుంది. మన వ్యక్తిగత జీవితం చుట్టూ ఉండే వాళ్లకు కూడా కనిపిస్తుంటుంది. కౌటంబిక జీవితం చుట్టూ ఉండే కుటుంబ సభ్యులకూ, బంధుమిత్రులకూ తెలుస్తుంది. సామాజాకి జీవితం ప్రపంచానికి తెలిసేదైతే, వ్యవస్థాగత జీవితం స్పష్టమైన ప్రపంచ దృక్పథం ఉన్న వాళ్లకు మాత్రమే తెలిసేది' అని కథా రచన చేస్తున్న వారికి, కథా లోతుల్ని పసిగట్టే వారికి చెప్తారు కారా మాస్టారు.
          తెలుగు సాహిత్యం పై ఏమాత్రం అభిమానమున్న వారు ఒక్కసారైనా ఈ కథా నిలయాన్ని దర్శించాలి. కారామాస్టారును కలవాలి. 90 ఏళ్ల వయసులో ఆ నవ యవ్వనుడు చేస్తున్న కథా సేవను కళ్లారా చూడాలి. అదో అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుంది.