Facebook Twitter
బోన్ సాయ్ బ్రతుకు

  బోన్ సాయ్ బ్రతుకు
                              
             

  

  - అబ్బూరి ఛాయాదేవి

 


  
        స్త్రీల జీవితాల్లోని చిన్నచిన్న సంఘటనలను, వాటి వెనకున్న అంతరార్థాన్ని, సమాజ భావజాలాన్ని మంచి కథలుగా చిత్రించారు అబ్బూరి ఛాయాదేవి. వీరి ప్రతి కథ చక్కని భాషతో, శైలితో ప్రకాశిస్తుంది. కుటుంబానికే పరిమితమైన స్త్రీలను, కుటుంబంతోపాటు, ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆధునిక స్త్రీల జీవితాలను దగ్గరగా పరీక్షించి, ఆ ఇతివృత్తాలతోనే అద్భుతమైన కథలు రాశారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్త్రీకి కూడా విద్య, ఉద్యోగం అవసరమని తెలిజేప్పేదే 'బోన్ సాయ్ బ్రతుకు' కథ.
        రచయిత్రి ఇంటిపని, వంటపని చేసుకునే స్త్రీకి ప్రతీకగా ఈ కథకు ఆపేరు పెట్టారు. కథ మొత్తం ఉత్తమ పురుషలో సాగుతుంది.
           కథ- భారత రాజధాని ఢిల్లీల్లో ఉద్యోగం చేస్తున్నచెల్లెలికి ఇంటికి రాగానే ఉత్తరం కనిపిస్తుంది. అది అక్కరాసిన ఉత్తరం. చించి చదివితే అక్క, బావ వస్తున్నారన్న వార్త తెలుస్తుంది. ఆ విషయాన్నే భర్తతో కూడా ఆనందంగా పంచుకుంటుంది. భర్తకూడా సంతోషిస్తాడు.
        అక్కను వాళ్ల నాన్న అయిదో తరగతి తోటే చదువు మాన్పించి ఉంటాడు. 'ఆడపిల్లలకు చదువేమిటి... చాకలి పద్దు రాయగలిగితే చాలదా' అనుకునే రోజులవి. కానీ చెల్లెలు పుట్టేనాటికి పరిస్థితులు మారతాయి అందుకే ఈమెను చదివిస్తాడు. అక్కకు పల్లెటూరి సంబంధం కుదురుతంది. ఆమె భర్త చదువుకున్నా ఆదర్శభావాలతో, ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూర్లోనే స్థిరపడతాడు. చెల్లెలు ఉద్యోగం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని, చదివిన చదువుకు సార్థకత, సంపాదన ఉండాలనే కోరికతో తనూ ఉద్యోగం చేస్తుంటుంది.
           అక్క వస్తూ వస్తూ పల్లెటూరి నుంచి దోసకాయలు, గోంగూర, వడియాలు, ములక్కాడలు... లాంటివి ఎన్నో తెస్తుంది. చెల్లెలు వాటిని చూసి సంబరపడతుంది. 'ఇవన్నీ చేయడానికి నాకు అసలు తీరికే ఉండదక్కా.. ఆఫీసు నుంచి సోలిపోయి వస్తాను. వెధవ ఉద్యోగం' అని తన స్వానుభవాన్ని అక్క ముందు వెళ్లబోసుకుంటుంది. అంతా విన్న అక్క 'అలా అనకు. నువ్వు అదృష్టవంతురాలివి. మగాడితో సమానంగా ఉద్యోగం చేస్తున్నావు. చేతినిండా సంపాదనా.. దర్జాగా బ్రతగ్గలవు' అంంటుంది.
            బాల్కనీలో పూలకుండీలలో తురాయి. దానిమ్మ మొక్కలను చూసి ఆశ్చర్యపడి 'ఇవేంటి... నిక్షేపంలా పెరట్లో పెరగాల్సిన చెట్లని పూలకుండీల్లో మరగుజ్జుల్లా తయారు చేశావు' అంటుంది అక్క. తన గొప్పతనం అక్కకు తెలియాలనే ఉద్దేశ్యంతో చెల్లెలు 'ఇదో స్పెషల్ పద్ధతి. వీట్ని బోన్సాయ్ అంటారు. మహా వృక్షాన్ని కూడా పూలకుండీల్లో పెంచొచ్చు. ఇదో గోప్పకళ' అనిచెప్తుంది. అంతలో గాలి వర్షం రావడంతో చెల్లెలు ఆ కుండీలను లోపలికి, చూరి కిందకు లాగుతుంది. అక్క కిటికీతీసి దూరంగా వాతావరణాన్ని చూస్తుంది. దూరంగా తురాయి చెట్టుకింద వర్షానికి తడవకుండా ఎంతో మంది నిలబడి ఉంటారు. వాళ్ళని చెల్లెలకు చూపిస్తూ... 'నీ బోన్ సాయ్ కుదురుగా, ముచ్చటగా సంసారపక్షపు స్త్రీలా ఉంది. నువ్వు వెయ్యి కళ్లతో కాపాడాలి. కాస్త తుఫానుకి కూడా తట్టుకోలేదు. ఒకరి మీద ఆధారపడి, మరొకరికి ఏమివ్వగలదు.... ఆడదాని బ్రతుక్కూడా... బొన్సాయిలా మారింది.' అని అంటుంది. చెల్లెలకు పంజరంలోంచి చిలకను స్వేచ్ఛగా బయటకు వదిలేసినట్లు బోన్సాయికి కూడా విముక్తి కలిగించాలన్న ఆవేశం కలుగుతుంది.
           ఛాయాదేవి కథ నిడిపిన తీరు రాసే భాషలో కాకుండా, మాట్లాడే భాషలో సాగుతుంది. కథ మొదట్లో లేఖల గొప్పతనం వివరిస్తూ రచయిత్రి...  'ఉత్తరాలను చూస్తే ఆత్మీయులు ఎదురై ఆప్యాయంగా పలకరించినట్లు', 'కూనిరాగం తీస్తూ కులాసాగా కాఫీ తాగొచ్చు' అంటుంది. ఇలాంటివి మనసుకు తేనీరులా తాకుతాయి. ప్రారంభం నుంచి అక్క పాత్రను పల్లెటూరి స్త్రీగా చెప్పి, చివరకు ఆమె ద్వారానే కుటుంబ స్త్రీ జీవితాన్ని 'బోన్సాయి' మొక్కతో పోల్చడం అద్భుతమైన కథా శిల్పంలోని సుగుణం. నేటి సమాజంలో కుటుంబాన్ని, ఉద్యోగ బాధ్యతను నిర్వరిస్తున్న స్త్రీకి చెల్లెలు ప్రతినిధి, గ్రామాలలో కుటుంబ బరువును మోస్తున్న స్త్రీకి అక్క ప్రతిరూపం. అందుకే వీరి మధ్య సాగే సంభాషణలు నేటి సమాజంలోని ఎందరో స్త్రీల జీవితంలోని ఆలోచనలకు, అంతగంగాలకు ప్రతిబింబాలు.
            'ఈదురో దేముడా', 'పిల్లాపీచు గొడ్లూ గోతం పట్టలూ', 'కుచేలుడు లాగా పట్టగరావటం', 'పంచభక్ష్య పరమాన్నాలు', 'దూరపు కొండలు నునుపు', 'బూడిదలో పోసిన పన్నీరు...' లాంటి నుడికారాలు కథలో కలకండ పలుకుళ్లా పాఠకుడి హృదయాన్ని తీపిచేస్తాయి. అంతేకాదు 'ఆడపిల్లకు చదువేంటి... చాకలి పద్దు రాయగలిగితే చాలు', 'మగవాడి చెప్పు కింద తేలులాగా పడి ఉండాల్సిందే...' వంటి పురుషాధిక్య భావజాల సమాజం కల్పించిన పదజాలాన్ని కథలో సందర్భోచితంగా పదును తేలిన బాణాల్లా వాడారు ఛాయాదేవి. అందుకే ఈ కథ స్త్రీల జీవితానికి స్వచ్ఛమైన వ్యాఖ్య లాంటిది.

                              
                 

  - డా.ఎ. రవీంద్రబాబు