Facebook Twitter
మధురాంతకం రాజారాం

మధురాంతకం రాజారాం

  - డా.ఎ.రవీంద్రబాబు

 


 
    రాయలసీమ కథారత్నం మధురాంతకం రాజారాం. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజల భాషకు పట్టం కట్టిన రచయిత. కథల్లో ఓ జీవితానికి సరిపడా వైవిధ్యాన్ని నింపిన ఘనుడు. ఎక్కడా ఊహలకు, అతీతాలకు, అవాస్తవాలకు పోకుండా నేలబారు తీరుగా కథలను రచించిన వాస్తవికవాది. 300లకు పైగా కథలు రాసినా దేని ప్రత్యేకత దానిదే. పోలీకలేని మానవులే మనకు దర్శనమిస్తారు. తెలుగులో మలితరం కథా రచనలో రాజారం గారిదొక భిన్నమైన స్వరం.
      మధురాంతకం రాజారాం చిత్తూరు జిల్లాలోని మొగరాల
(రమణయ్యగారి పల్లె) గ్రామంలో అక్టోబరు 5, 1930లో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. ఆ వృత్తిలో ఉండటం వల్లే రాజారాం కు పల్లెలతో, గ్రామీణ జీవితాలతో, వారి మధ్య ఉన్న సంబంధాలతో పరియం ఏర్పడింది. ఆ నేపథ్యం నుంచే వీరు కథా వస్తువును ఎన్నుకున్నారు. అధ్బతుమైన శిల్పంతో కథలు రచించారు. ఎక్కడా నేల విడిచి సాము చేయని రచనా మార్గాన్ని స్వీకరించారు. నాగేంద్ర, దత్తాత్రేయ లాంటి కలం పేర్లతో కూడా రచనలు చేశారు. మధురాంతకం రాజారాం కథలు మాత్రమే కాదు రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, వ్యాసాలు కూడా రాశారు. తమిళ రచనల్ని అనువదించారు. వీరి కథలు తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదాలయ్యాయి. రాజారాం రచించిన 'చిన్నప్రపంచం - సిరివాడ' నవల రష్యన్ భాషలోకి అనువాదమైంది.
         వీరి కథలు పలు సంపుటాలుగా వెలువడ్డాయి.
 1. వర్షించిన మేఘం (7 కథలు)      2. ప్రాణదాత (5 కథలు)

 3. కారణభూతుడు (2 కథలు)        4. కళ్యాణకింకిణి (11 కథలు)
 5. పునర్నవం (10 కథలు)           6. తాము వెలిగించిన దీపాలు (8కథలు)

 7. వక్రగతలు ఇతరాలు(7 కథలు)     8. వగపేటిక... (6 కథలు)

9. మధురాంతకం రాజారాం కథలు (40 కథలు)
10. మధురాంతకం రాజారాం కథలు (22 కథలు)
11. పాంథశాల ( 23 కథలు)      
12. జీవితానికి నిర్వచనం (29 కథలు)
13. కూనలమ్మ కోన (4 కథలు)
    నేడు వీరి కథలు మొత్తం నాలుగు సంపుటాలుగా లభిస్తున్నాయి.
          ' కథకి వస్తువుగా ఓ వ్యక్తి జీవితాన్ని మధిస్తే ఓ కథ పుట్టొచ్చు' అన్న మధురాంతకం రాజారాం అదే సత్యాన్ని ఆచరించి కథలు రాశారు. అందుకే అవి భిన్నంగా ఉంటాయి.
        సర్కసు డేరా కథ- సర్కసు ఫీట్లకంటే ప్రమాదకరమైన ఫీట్లు బయట బతుకుకోసం చేస్తున్నారని చెప్తుంది.
        ఎడారి కోయిల కథలో తండ్రి విదేశాలలో స్థిరపడినా కొడుకు గ్రామీణ వాతావరణాన్ని వెతుక్కుంటూ వస్తాడు.
        పులిపైన స్వారీ కథ జాతకాలను నమ్మి సినీ నిర్మాత మోసపోవడాన్ని వివరిస్తుంది.
        ఓటుకత కథలో ఒక్కసారి కూడా ఓటు వేయలేని పశువుల గంగప్ప గురించి చెప్తుంది.
        కొండారెడ్డి కూతురు కథలో తులసి భర్తను చంపడానికి వచ్చిన మనుషులకు అన్నం పెట్టి, రక్షణ కల్పించి, వాళ్లను మనసులను మారుస్తుంది.
          అందుకే రాజారాం కథలు తిట్టవు, అతి తెలివిని ప్రదర్శించవు, సందేశాలు ఇవ్వవు, కంటతడిపెట్టిస్తాయి. చదివేవారి గుండెలను బరువెక్కిస్తాయి. స్వచ్ఛంగా, అచ్చంగా, మన చుట్టూ ఉన్న జీవన స్రవంతినే మనకు చూపెడతాయి. పంచదార గుళికల్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఆ సారం మనలో ఇంకిపోయి మనసుకు హాయిని కలిగిస్తాయి. పలు రకాల మనుషులు, భిన్న మనస్తత్వాలు, గ్రామీణ జీవితాలు, మధ్యతరగతి మానవులు, సగటు మనిషి సమస్యలు... ఇవీ వీరు కథల అంతఃచిత్రం.
       అసలు వీరి కథలు చదువుతుంటే ఆరుబయట నానమ్మో, అమ్మమ్మో ఒడిలో కూర్చోబెట్టుకుని కథ చెప్పినట్లు ఉంటుంది. ఆకట్టుకునే శైలి, శ్లేషతో కూడిన వాక్యాలు, సన్నని నవ్వుతో జీవితసారాన్ని మాటల్లో కూర్చినట్లు తోస్తుంది. పెద్ద బాలశిక్షలా జీవిత జ్ఞానాన్ని బోధిస్తాయి. వీరి కథల్లో స్త్రీ పాత్రలకు ప్రత్యేకత ఉంది. అవి ఆటపట్టిస్తాయి. చిరుకోపంతో అలుగుతాయి, ఒక్కోసారి మురిపిస్తాయి. ప్రేమాభిమానాల్ని పంచుతాయి, అవసరమైతే సుతిమెత్తగా మందలిస్తాయి. మనతోపాటు సహజీవనం చేస్తాయి. అత్యంత సహజంగా, స్వచ్ఛంగా ప్రవర్తిస్తాయి. మొత్తం మీద అనుబంధాలతో అల్లుకపోతాయి. అందుకే అవి ఎక్కడో ఒకచోట మనతో తారసపడినట్లే ఉంటాయి.
         మధురాంతకం రాజారాం కథలు తీపి, వగరు, కారం, పులుపు కలబోసిన ఉగాది పచ్చడి లాంటివి. రాయసీమ గ్రామీణ నేపథ్యం నుండి పుట్టిన కథల్లో ' బీగాలు, ఈసిళ్లు, యిర్లవాడు, తబిళ్ల, బిన్నె, దేవళం, పులుసన్నం... ...' లాంటి చిత్తూరు జిల్లా పదాలు సహజ సుందరంగా కనిపిస్తాయి. ' తీసుకో తీసుకో' అని కుర్రవాడిని వూరించి, వాడు దగ్గరకి వచ్చేలోపుగానే మనం దాచిపెట్టుకునే తినుబండారంలా అంతలో మృత్యుదేవత చిక్కి బిక్కరించబోయి ఇంతలో దూరంగా వెళ్లి వెక్కిరించడమేనా మానవ జీవితం...' అంటాడు మధురాంతకం రాజారాం జీవితానికి మృత్యువుకు ఉన్న సంబంధాన్ని నిర్వచిస్తూ...
 రాజారాం ఏప్రిల్ 1, 1999లో చనిపోయారు. కథా రచయితగా ఎన్నో ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు.
1968లో ' తాను వెలిగించిన దీపాలు' కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు.
1991లో గోపీచంద్ సాహితీ సత్కారం
1993లో ' రాజారాం కథల' కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

1994లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు

  1996లో అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్ వారి బహుమతి వీరిని వరించాయి.
   వీరి స్మృతికి నివాళిగా ' కథాకోకిల' పేరిట కథా విమర్శలో, కథా రచనలో ప్రముఖులకు ప్రతి ఏడాది అవార్డులు ఇస్తున్నారు. వీరి కథల నిండా ఎన్నో పాత్రలు, వాటి వైవిధ్య స్వభావాలు, భిన్నత్వాలు, సంక్లిష్టతలు... అందుకే వీరి కథలు ప్రతి ఇంట్లో, గ్రంథాలయంలో తప్పక ఉండాల్సిన అవసరం ఉంది.