Facebook Twitter
మేఘాపహరణం

   మేఘాపహరణం (కథ)
                                        

- మాలతీచందూర్  

 

                             

             

మాలతీ చందూర్ పలు పత్రికలలో కాలమిస్ట్ గా పనిచేశారు. నూజివీడులో జన్మించి మద్రాసు నగరంలో స్థిరపడినా తెలుగు భాషకు, సాహిత్యానికి దూరం కాలేదు. పైగా అపారమైన సేవ చేశారు. ఆంధ్రప్రభ పత్రికలో వీరు సుదీర్ఘకాలం రాసిన 'ప్రమదావనం' గిన్నీసు రికార్డుకెక్కింది. 400ల ఆంగ్ల నవలల్ని తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిని ఘనత కూడా మాలతీ చందూర్ గారిదే.

       మాలతీ చెందూర్ ఎన్ని రచనలు చేసినా వారికి కథా రచయిత్రిగా మంచి పేరు ఉంది. 150 కథలు పైగా రాశారు. వీరి కథలు ప్రకృతి, మానవ సంబంధాలు, ప్రపంచీకరణ... ఇలా పలు అంశాలును వివరణాత్మకంగా, ఆసక్తిగా, హాస్యంగా వివరిస్తాయి. మాలతీ చందూర్ రాసిన 'మేఘాపహరణం' కథ మనిషి ప్రకృతిని నాశనం చేయడం వల్ల కలిగే అనర్థాలను అర్థవంతంగా తెలియజేస్తుంది.
        'మేఘాపహరణం' కథ 'ఆ వూర్లో వర్షపు చుక్కపడి మూడేళ్లయింది' అని మొదలవుతుంది. తర్వాత రచయిత్రి వర్షాలు పడటానికి ఆ వూరి ప్రజలు ఏం చేశారో చెప్తారు. 'కప్పలకి పెళ్లిళ్లు చేయడం, విద్వాంసుడు ఆపకుండా ఫిడేలు వాయించడం' ఇలాంటివి ఎన్నో చేస్తారు. కానీ వరుణదేవుడు కరుణించడు. కొంతమంది వలసలు వెళ్లిపోతారు. ఒకరోజు ఆకాశంలో నల్లటి మేఘాలు కనిపిస్తాయి. వర్షం పడుతుందని అందరూ ఆశపడతారు. ఆ నల్లటి మేఘాలలో విమానాలు కూడా తిరుగుతుంటాయి. మేఘాలు వచ్చినా వర్షం ఎందుకు పడటం లేదో..,!? విమానాలు ఎందుకు తిరుగుతున్నాయో...!? ఎవరికీ అర్థం కాదు.
      వయసుకొచ్చిన ఆడపిల్లలు పరిమళ, రేఖ ఆ విమానాల్లోంచి తమకోసం రాకుమారుడు లాంటి పెళ్లికొడుకు దిగివస్తాడని కలలు కూడా కంటారు. ఈ తతంగం మొత్తం ఆ వూర్లోనే ఉంటున్న అడ్వకేటు సాంబమూర్తికి కూడా బోధపడదు. పైగా ఆవూరు రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. చివరకు రహస్యాన్ని బావమరిది ద్వారా తెలుసుకుంటాడు. 'పక్కరాష్ట్రం వాళ్లు క్లౌడ్ సీడింగ్ చేసి బలవంతాన వర్షాలు కురింపించుకుంటున్నార'ని. అంతే... వెంటనే చలపతిరావు 'స్వరాష్ట్రంలో మబ్బుల్ని పొరుగు రాష్ట్రం తమవైపుగా  తర్లించుకుపోయి, దొంగతనంగా తమ రాష్ట్రంలో వర్షం కురిపించుకుంటున్నార'ని పొరుగు రాష్ట్రం మీద దావా వేస్తాడు.
       అనేక తర్జనభర్జనల తర్వాత కేసు సుప్రిింకోర్టుకు వెళ్తుంది. 'ఆకాశ మండలంలోని, సూర్యచంద్రులు, నక్షత్ర మండలం, గాలి, మబ్బులూ ఇవి సర్వ మానవాళికీ చెందుతాయి ... ... కానీ పొరుగు రాష్ట్రం మబ్బుల్ని తరలించి వాటిపై కార్బన్ డయాక్సైడ్ క్రిస్టల్ చల్లి, వర్షం కురిపించారు.  అది చల్లడానికి రోజూ విమానాలను పంపారు. అందువల్ల పొరుగు రాష్ట్రం చేసింది తప్పు' అని కేసు రుజువు అవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తీర్పు చెప్పేటప్పుడు మబ్బుల్ని కూడా దొంగలించే పరిస్థితికి మానవుడు ఎందుకు చేరుకున్నాడు... ఎలా దిగజారి పోయాడు... అని జడ్జీలు ఆలోచన చేసి తీర్పు ఇస్తారు.
          'ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో చెట్లు నాటి, వాటిని పెంచి వృద్ధి పరచగల బాధ్యత నేరం చేసిన రాష్ట్రంపైన ఉంచుతున్నాం.' అంటారు.
        ఈ కథ ఒకప్పుడు ప్రభుత్వం కుత్రిమంగా వర్షాలు కురిపించడానికి చేసిన ప్రయత్నం పై చురక. మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని, చెట్లను, నదులను...లాంటి సహజవనరులను నాశనం చేస్తే చివరకు ఏమౌతుందో...? మాలతీ చందూర్ పరిష్కారంతో సహా వివరించారు. అందమైన వాక్యనిర్మాణం, సహజంగా సాగిపోయే శైలి. కథా నిర్మాణానికి సంబంధించి ప్రారంభానికి, ముగింపుకు సంబంధం. పాత్రల భావోద్వేగాలు... అన్నీ ఈ కథను గొప్పకథగా తెలుగు కథానికా సాహిత్యంలో నిలిపాయి అనడంలో ఏమాత్రం అనుమానం లేదు.  
                                                     డా.ఎ. రవీంద్రబాబు