ఓ పువ్వుపూసింది
- డా.ఎ.రవీంద్రబాబు
.png)
స్త్రీ స్వేచ్ఛకోసం పోరాడి, వారి అణచివేతలను తన రచనల ద్వారా ఎండగట్టిన రచయిత చలం. కథ, నవల, నాటిక... ఏది రాసినా స్త్రీ. స్త్రీ ఆనందమే లక్ష్యంగా తెలుగు సమాజాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి చలం. నేటి స్త్రీవాద భావజాలానికి ఆనాడే సాహిత్యంలో బలమైన పునాదిని నిర్మించాడు. చలం అనగానే ఏపాటి అవగాహన ఉన్నా మొదట గుర్తొచ్చే నవల 'మైదానం', కథ 'ఓపువ్వు పూసింది'.
'ఓపువ్వు పూసింది' ప్రతీకాత్మక కథ. చలం పువ్వును స్త్రీకి ప్రతీకగా తీసుకుని అద్భుతమైన వర్ణనలతో, అపూర్వమైన సౌందర్యవంతంగా ఈ కథను తనదైన శైలిలో రచించాడు. ప్రకృతిలోని అందాన్నంతా కథలో నింపి, స్త్రీ జీవితాన్ని విశ్లేషించాడు. తుమ్మెదను పురుషుడికి ప్రతీకగా తీసుకుని అతని ధాష్టీకాన్ని చెప్పాడు. కానీ కథను విశ్లేషణాత్మ దృష్టితో చదివితే అనేక తాత్విక, సౌందర్య భావనలు మనలో ద్యోతకమవుతాయి.
కథ- 'అర్థరాత్రి అడవిలో పువ్వుపూసింది' అని ప్రారంభమవుతుంది. ఆ పువ్వు... చుట్టూ ఉన్న ప్రకృతిని కొత్తగా, వింతగా చూస్తుంది. తల్లి తీగతో
'భయమేస్తుంది. కిందికి పడిపోతానా...' అని అడుగుుతంది.
'నేను పట్టుకున్నాను కదూ' అని తల్లితీగ భరోసా ఇస్తుంది.
'ఆకలేస్తుంది అమ్మా' అని అడిగితే
పువ్వునోట్లోకి వెచ్చగా, తియ్యగా, వొంటినంతా సంతోషంతో నింపుతో పాలు వస్తాయి.' ఇలా తీగ పువ్వును లాలిస్తుంది. పెంచుతుంది. సూర్యోదయంతో వెలుగు కిరణం పువ్వును సోకగానే పువ్వుకు యవ్వన దశ వచ్చేస్తుంది. 'తన రేకుల్లో తళతళలు, తన యీనెల్లో నున్నటి వుబుకు, తన బొడిపెల్లో పగలడానికి సిద్ధమైన మదపు సౌరభం, తన తొడిమలో విశాలమౌతున్న బలం, తన సమస్తంలో ఆగని, అంతులేని, కారణం లేని కాంతి అకస్మాత్తుగా తనని ముంచుతో, చీలుస్తో పైన దొర్లి సముద్రం అలల మల్లే మూర్ఛలు తెప్పించే పరిమళం'
స్త్రీ మాతృత్వపు భావన, పిల్లలపై ఆమెకుండే మమకారం, ప్రకృతిలోని సహజమైన యవ్వన దశ, స్త్రీ మానసిక ఉద్విగ్నత... గర్భం దాల్చే సృష్టి క్రియ... చివరకు మరణం... ఈ దశలను ఒక రోజులో పువ్వును ప్రతీకగా చెప్పాడు రచయిత.
అర్థరాత్రితో ప్రారంభమైన కథ పొద్దుగూకడంతో ముగుస్తుంది. ఇదో అద్భుతమైన కథా టెక్నిక్.
అలానే కథ చివరిలో కథ చివరిలో 'అనంతమైన ఆ ఆనందాన్ని ఆ ఆకాశంలో తేలుతూ, భక్తితో, అతని మొహం వంక చూసి ఫక్కు నవ్వింది- ఆనందాన్ని అణచుకోలేక' అని అంటాడు. ఇవి రెండూ అద్వైత భావనని తెలిపే తాత్విక వర్ణనలు. మరో విధంగా చూస్తే సృష్టికి పూర్వం, సృష్టి తర్వాత స్త్రీ పురుషులు మమేకమై ఉంటారనే అలౌకిక భావన.
'అలల మల్లే కాంతి విడుచుకు పడుతోంది లోకం మీద'.
'గాలిమీద చిందులు తొక్కుతుంది ఎండ'
'అన్నీ అబద్ధాలు. కానీ, ఎంత మధురమైన అబద్దాలు...' ఇలాంటివి కథ నిండా కోకొల్లలు. అందుకే ఈ కథ ఎప్పుడు చదివినా మన మనసులో కూడా ఓ పువ్వు పూస్తుంది. పరిమళాలలను సుగంద భరితంగా మనలో వెదజల్లుతుంది.



