Facebook Twitter
కల - నిజం - అబద్దం

  కల - నిజం - అబద్దం (కవిత)
                              

                    - డా. ఎ. రవీంద్రబాబు
 

 కల... ఓ చేతన ప్రక్రియ
 నిత్యం గమ్యం చేర్చలేని అంతఃసంఘర్షణ
కావ్యం రచనలోనే కార్యం పుడుతుంది.
రాత్రిలోనే ఎప్పుడూ పొద్దుపొడుస్తూ వుంటుంది.
ఆకాశం పైన మాత్రమే కాదు
అలల ఒడిలో కూడా...

ఆరంభం ఎప్పుడూ గుణపాఠాన్నేే వల్లెవేసుకుంటుంది
నిర్వచనం జీవితాన్ని అన్వేషించుకుంటుంది
వినిర్మాణం చుట్టూఉన్న ప్రాకారాన్ని బద్దులుకొడుతుంది
ఏకశిల నదిలో నర్మగర్భితంగా నిదురబోతుంది.
ఎడతెగని పుటలు నిత్యం ద్రవిస్తూనే వుంటాయి.
ఆకృతులన్నీ మళ్లీ మళ్లీ పురుడు పోసుకుంటూనే వుంటాయి
ఎదంతా హాయిగా విరక్తితో నవ్వుకుంటుంది
నింగినేల పులకించే వేళ హృదయం మరోసారి జన్మిస్తుంది
వెన్నెలను దగ్గరకు తీసుకొని కథన కుతూహల రాగాన్ని ఆలపిస్తంది

ఎవ్వరూ పలకరు, ఏ ఆశ్వాదనా దరిచేరదు
ఏకాంతాన్ని సైతం జ్ఞాపకం స్పర్శిస్తూనే వికటాట్టహాసం చేస్తుంది
అప్పుడిక ఎవరికివారే ఒంటరిగా యుద్ధానికి సిధ్దం కావాలి
నిశీధిలో నిట్టూర్పులను ఆరగిస్తూ అలా... అలా...
నడుచుకుంటూనే సాగాలి ఎంత దూరమైనా సరే...
అప్పుడిక ప్రపంచం తనను తాను పునర్లిఖించుకుంటుంది.
                           పుర్లిఖించుకుంటూనే ఉంటుంది.