Facebook Twitter
సురవరం ప్రతాపరెడ్డి

     సురవరం ప్రతాపరెడ్డి
                              
                           

డా.ఎ. రవీంద్రబాబు


   

 

తెలంగాణలో రాజకీయ, సాంఘిక, సాహిత్య చైతన్యానికి సురవరం ప్రతాపరెడ్డిని ఆద్యుడిగా భావించాలి. సాహిత్యాన్ని, చరిత్రను, రాజకీయాలను, సామాజిక చైతన్యాన్ని కలగలిపి ఒక్కచేత్తో వాటికోసం ఉద్యమించిన తెలంగాణ వైతాళికుడు. బహుభాషా వేత్త. మొక్కవోని ధైర్యంతో ఆనాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా తెలుగుభాష, సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన సాహసి. తెలంగాణలో సాంస్కృతిక వికాశానికి బాటలు వేసిన మార్గదర్శి. రచయిత, సంపాదకుడు, పరిశోధకుడు అంతేకాదు అసామాన్య ప్రజ్ఞావంతుడు.
     సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివాడు. ఆ తర్వాత తిరువాన్ కూరులో బి.ఎల్. పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఉర్దూ, ఆంగ్లం, తెలుగు, పారశీ, హిందీ, సంస్కృతం భాషల్లో పాండిత్యాన్ని సంపాదించాడు.
      ఆనాటి నిజాం పాలనలో ఉర్దూరాజ్య భాష. ఎక్కడో ఒకటోరెండో తెలుగు పత్రికలు మాత్రమే వచ్చేవి. అది గమనించి 1926లో 'గోలకొండ' పత్రికను స్థాపించారు. 1947 వరకు దాని బాధ్యతను నిర్వహించారు. తన సంపాదకత్వాలతో నిజాం దురాగతాలను నేరుగా ప్రశ్నించాడు. అనేక సవాళ్లను సూటిగా ఎదుర్కొన్నాడు. తెలంగాణలో తెలుగు భాష వికాసం చెందేలా పత్రికను తీర్చిదిద్దారు. తెలంగాణలో కవులు లేరన్న ముండబ వెంకట రాగవాచార్యుల ప్రశ్నకు సమాధానంగా 1934లో 354 మంది కవులతో 'గోలకొండ కవుల చరిత్ర'ను ప్రకటించాడు. అంతేకాదు 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర', 'హిందువుల పండుగలు', 'హైందవ ధర్మవీరులు', 'గ్రంథాలయోద్యమం' లాంటి చరిత్ర, సంస్కృతిని విశ్లేషించే రచనలూ చేశాడు. 'భక్తతుకారాం', 'ఉచ్చల విషాదము' అనే నాటకాలు కూడా రాశాడు.
          ముఖ్యంగా భావకుడైన ప్రతాపరెడ్డి వీటితోపాటు కవితలు, కథలు, వ్యాసాలు కూడా రాశాడు. 'రామాయణ కాలంనాటి విశేషాలు' వీరి మరో ముఖ్యమైన రచన. ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలంనాటి సామాజిక పరిస్థితులకు దర్పనం. అసలు తెలంగాణలో తెలుగ కథ సురవరం తోనే వికాశదశకు చేరుకుందని చెప్పాలి. ప్రతాపరెడ్డి  1930 నుంచి కథలు రాశారు. వీరు మొత్తం 25 కథలు రాస్తే ప్రస్తుతం 21 కథలు మాత్రమే లభిస్తున్నాయి. వీటిని 1987లో ఆంధ్రసారస్వత పరహిషత్ వాళ్లు పుస్తక రూపంలో తెచ్చారు.
          ఈ కథల్లో రెండు భాగాలున్నాయి. 11 కథలు 'మొగలాయి కథలు' మిగిలిన 9 కథలు 'సురవరం కథలు'. 'మొగలాయి కథలు' తెలంగాణ మొగలాయిల పాలనలో ఉన్నప్పుడు నుంచి వ్యాప్తిలో ఉన్నవి. వీటిలో 'గ్యారా కద్దూ బారా కొత్వాల్', 'రంభ' లాంటివి ముఖ్యమైనవి. 'రంభ' కథలో బీజాపూర్ సుల్తాను అదిల్షా రంభ అనే స్త్రీని ప్రేమిస్తాడు. కానీ చెప్పుడు మాటలు విని ఆమె శీలాన్ని శంకిస్తాడు. కిటికిలోంచి దూకమంటాడు. ఆమె భవనం కిటికీలోంచి దూకుతుంది. అయినా బతుకుతుంది. కానీ అవమానాన్ని బరించలేక కత్తితో పొడుచుని చనిపోతుంది. ఈ మొగలాయి కథల్లో ముఖ్యంగా అధికారుల లంచగొండితనం, క్రౌర్యం, ప్రజలను పీడించడం, దుష్టపాలన, ప్రజల నిస్సహాయత, అమాయకత్వాలే ఎక్కువగా కనిపిస్తాయి.
          'సురవరం కథల'లో ఎక్కువ స్త్రీల జీవితాల్లోని ఆటుపోటులను చిత్రించినవే. స్త్రీలను నమ్మించి వేశ్యాగృహాలకు అమ్మడం, బాల్యవివాహాలు, మత మార్పిడులు, స్త్రీ  ఉద్దరణ లాంటివే ఈ కథల్లో కనిపిస్తాయి. 'నిరీక్షణ' కథలో ప్రేమించిన యువకుడు పెళ్లికి ముందు సముద్రంలో వేటకు వెళ్తాడు. ప్రియురాలు మాత్రం చేపల కూర వండుకుని ఆచారం ప్రకారం సముద్రపు ఒడ్డున ఎదురు చూసి చూసి చనిపోతుంది. 'హాసన్ బీ' కథలో కామాక్షి దొంగ స్వాముల్ని నమ్మి మోసపోతుంది. ఓ సాహెబును వివాహం చేసుకుంటుంది. పేరును హసన్ బీగా మార్చుకుని సంతోషంగా జీవిస్తుంది. 'మెహ్దీబేగం' కథలో జబ్బారు ప్రేమించిన వ్యక్తితో పారిపోతుంది, కానీ అన్నలు తెచ్చి ఇంట్లో బంధీని చేస్తారు. చివరకు వేశ్యగా మిగిలిపోతుంది. ఇలా ఈ కథలన్నీ నిజాం కాలం నాటి స్త్రీల బాధలను సమాజంలోని వారి స్థితిగతులను తెలియజేసేవే. 'సంఘాల పంతులు' కథ శిల్పం దృష్ట్యా అద్భుతమైంది.
          కొన్ని కథల్లో సురవరం ప్రతాపరెడ్డి పాత్రల వేషభాషలు చిత్రీస్తే, మరికొన్ని కథల్లో వాటి ఆంతరంగిక సంఘర్షణల్నీ రాశాడు. ఇవి పేజీలకొద్దీ ఉండవు. చిన్నచిన్న కథలు. సరళమైన భాషలో సాగిపోతాయి. ప్రతాపరెడ్డి అవసరం కొద్ది అప్పడు వ్యాప్తిలో ఉన్న ఉర్దూ పదాలను కథలలో వాడారు. నౌకరీ, మస్తు, ఖాళీ, జిమ్మా, ఖజానా వంటివి మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడక్కడా తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన పలుకుబడులు కూడా కనిపిస్తాయి, అందుకే వీరి కథల్లో వాడిన భాష తెలంగాణ ప్రామాణిక భాషగా చెప్పొచ్చు.
        సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో గ్రంథాలయోద్యమంలో  ప్రముఖపాత్ర వహించాడు. 1942లో జరిగిన ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు ఆధ్యక్షత వహించాడు. 1951లో 'ప్రజావాణి' పత్రికను స్థాపించాడు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో వనపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆగస్టు 25, 1953లో మరణించాడు.
        ఆయన మరణించిన తర్వాత 1955లో వీరి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి సాహిత్య, సామాజిక సేవకు గాను హైదరాబాదు ట్యాంక్ బండిపై వీరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.