Facebook Twitter
స్త్రీ విద్య

స్త్రీ విద్య

                                           - భండారు అచ్చమాంబ


        సుమారు వంద సంవత్సరాలకు పూర్వం స్త్రీ చదువే ఇతివృత్తంగా వచ్చిన కథ 'స్త్రీ విద్య'. చాలాకాలం వరకు తెలుగు కథాసాహిత్యంలో ఇదే తొలికథ అనికూడా భావించారు. ఈ కథ డిసెంబర్ 1902లో 'హిందూసుందరి' పత్రికలో ముద్రితమైంది. రచయిత్రి భండారు అచ్చమాంబ. స్త్రీల చదువుకోసం తపించిన మనీషి. మహిళలకు చదువు వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో సవివరంగా వందేళ్ల క్రితమే ఈ కథలో చర్చించింది రచయిత్రి అచ్చమాంబ.
       ఈ కథ అప్పటి కాలమాన పరిస్థితులకు అద్దంపడుతుంది. భర్త పట్నంలో చదువుకుంటూ ఉంటాడు. అప్పటికే వివాహం అయి ఉంటుంది. ఇంటికి వచ్చి భార్యతో కొన్ని రోేజులు గడిపి, పరీక్షలు ఉండటంతో మళ్లీ పట్నానికి బయలుదేరుతాడు.
       అప్పుడు భార్య 'రేపు ఉండి ఎల్లుండి వెళ్లు' అంటుంది.
       'నేను రేపు వెళ్లాల్సిన అవసరం ఉంది.' అంటాడు భర్త. అందుకు భార్య 'నీవు వెళ్లగానే నీ క్షేమసమాచారాలు తెలియజేయి' అని అడుగుతుంది. అందుకు 'భర్త నేను రాసిన ఉత్తరం ఎలా చదువుకుంటావు?' అని అడుగుతాడు. భార్య 'మా తమ్ముడితో చదివించుకుంటాను' అని చెప్తుంది.  అప్పడు వాళ్లిద్దరి మధ్య స్త్రీ విద్యకు సంబంధించిన చర్చ ప్రారంభమవుతుంది.
        'చదువుకున్న వాళ్ల భర్త ఆయుష్షును హరిస్తారని శాస్త్రాల్లో ఉందట మా నాయనమ్మ చెప్పింది. అంతేకాదు ఇరుగుపొరుగు వాళ్లు నవ్వుకుంటారు. అసలు చదువుకోవడం వల్ల నాకు ఏమి లాభం' అని అడుగుతుంది. అందుకు భర్త 'అవన్నీ మూఢనమ్మకాలు, చదువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది'. అని చదువు అంటే ఏమిటి... జ్ఞానం అంటే ఏమిటి... చదువు వల్ల జ్ఞానం ఎలా వస్తుంది అనే విషయాన్ని సవివరంగా వివరిస్తాడు
      'అక్షరాలు రాయడం, చదవడం నేర్చుకున్నంతలో మనుషులు విద్యావంతులు కాలేరు. చాలామంది రాసిన ఉద్గ్రాంథాలను చదివి వాటి తాత్పర్యాలను జీర్ణించుకున్న వారే విద్యావంతులని పిలుచుకుంటారు. ఇట్లాంటి విద్యవల్ల బుద్ధి వికసిస్తుంది. అనేక మంచి పుస్తకాల్లోని అమూల్యమైన ఉపదేశ వాక్యాలు మనసులో నాటుకుని మనుషులను ఉదాత్తవంతులుగా మారుస్తాయి. వాళ్లలోని చెడుపోయి ఆ స్థానాన్ని మంచి ఆక్రమిస్తుంది. ప్రపంచ జ్ఞానం పొందటానికి వాళ్లు అర్హులవుతారు. కొన్ని పుస్తకాలు చదవటం వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. దీని వల్ల సంసారంలోని అనేక దుఃఖాలను కాసేపు మరిచిపోతారు.'
      ఇద్దరి మధ్యా పలురకాలుగా చర్చ జరిగిన తర్వాత భార్య భర్తమాట వింటుంది. చదువుకోడానికి అంగీకరిస్తుంది. 'చదువుకుంటాను. మీకు ఉత్తరాలు రాస్తాను. మిమ్మల్ని సంతోషపెడ్తాను' అని మాట ఇస్తుంది.
      రచయిత్రి కథను అంతటితో ముగించదు. భర్త భార్య చదువకున్న తర్వాత తన కాపురం ఎలా ఉండబోతుందో కలలు కంటాడు. ఈ కలల్లో రచయిత్రి అచ్చమాంబ విద్యావంతురాలైన స్త్రీ ఉన్న కుటుంబాలు ఎలా ఉంటాయో రాసింది. వీటిని అప్పటి సమాజ పరిస్థితుల దృష్ట్యానే అర్థం చేసుకోవాలి.
మొదటి కల- భార్య భర్తకు లేఖ రాయడం
       మొదట భయంతో సిగ్గుతో, అక్షరాలు సరీగా కుదరక వంకరటింకరగా రాస్తుంది. అది నచ్చక మళ్లీ మరో కాగితం తీసుకుని రాస్తుంది. చివరకు విసుగొచ్చి అదే లేఖని టపాలో వేస్తుంది.
రెండో కల- భార్య భర్తకు వ్యాసం చదివి వినిపించడం
      భర్త పడక కుర్చీలో కూర్చొని ఉంటే... భార్య పక్కనే కుర్చీలో కూర్చొని పత్రికలో అచ్చయిన వ్యాసాన్ని చదివి వినిపిస్తుంది. భర్త ఆనందం పొందుతాడు.
మూడో కల- భార్య పిల్లలకు చదువు చెప్పడం
     భార్య ప్రేమతో కొడుకు, కూతుర్ని దగ్గర కూర్చోపెట్టుకుని విద్యాబుద్ధులు చెప్తుంది. వీరి పిల్లలను చూసి మిగిలిన వాళ్లు మెచ్చుకుంటారు.
     ఇక కథలో చివరకు భార్య అయిదు నెలల తర్వాత మీకు ఉత్తరం రాయడం మొదలు పెడతాను. అని మాట ఇస్తుంది. దీపావళి పండుగకు భర్త ఇంటికి వస్తానని చెప్పడంతో కథ ముగుస్తుంది.
      ఇక శైలి, శిల్పం, భాష విషయానికి వస్తే... కథ గ్రాంథికభాషలో సాగుతుంది.
    'ఇఁక నేను మిమ్ముల నుండమని యననుగాని మీరు పోయినది మొదలు మూడునాలుగు దినములకొకసారి తప్పక క్షేమముఁ దెలుపుటకానను మఱువకుండుటకు వేడెదను. తమ కుశలవార్త తెలియకుండిననిట నా కెంత మాత్రమును దోఁచదు'
      కథ మొత్తం సంభాషణాత్మక రూపంలో ఉంది. ఇది మహత్తరమైన శిల్పం. చాలా కష్టమైన శిల్పం కూడా. కేవలం పాత్రల మాటల ద్వారా వారి మనోభావాలనే కాకుండా కథా నేపథ్యాన్ని, వాతావరణాన్ని సృష్టించాలి. ఇలాంటి శిల్పం కత్తిమీద సాము. కథమొత్తం ఏకబిగిన చదవిస్తుంది. వారిద్దరి సంభాషణ ఆసక్తికరంగా రాశారు అచ్చమాంబ. వీరి శైలి గ్రాంథికభాష అయినా చదువరిలో విసుగు పుట్టదు.
      ఇప్పటికీ చదువుకు దూరమవుతున్న స్త్రీలు చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లకే కాదు, ఛాందస బావాలతో అత్యాధునిక యుగంలో కూడా స్త్రీ చదువును అడ్డంకుంటున్న వారికి ఈ కథ ఓ గుణపాఠం.
                                                    

  - ఢా.ఎ.రవీంద్రబాబు