Facebook Twitter
త్రిపురనేని గోపీచంద్

   త్రిపురనేని గోపీచంద్

  డా.ఎ. రవీంద్రబాబు


    
తెలుగు సాహిత్యానికి సమున్నతమైన నవలను అందించాడు గోపీచంద్. ఆధునిక కథ, నవలాసాహిత్యంలో చిరస్థాయిగా మిగిలిపోయే రచనలు చేశాడు. జీవితంలో అనేక సిద్ధాంతాలతో వాదులాడి... వాటిని తన అభిప్రాయాలకు అనుభవాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. తండ్రి నుంచి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నా, ఎక్కడా ఆ ప్రభావం తన రచనలపై పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఇలాంటి అమూల్యమైన కథ, నవలాకారుడు త్రిపురనేని గోపీచంద్.
       గోపీచంద్ సెప్టెంబరు 8, 1910 కృష్ణాజిల్లా అంగలూరులో జన్మించాడు. తండ్రి ప్రముఖ హేతువాద నాయకుడు, సంఘసంస్కర్త, రచయిత త్రిపురనేని రామస్వామి. తల్లి పున్నమాంబ. గోపీచంద్ బి.ఎ. చదివాడు. ఆ తర్వాత లా పూర్తి చేశాడు. న్యాయవాద వృత్తిని కొంతకాలం చేపట్టాడు. బి.ఎ. చదువుకునే టప్పుడు 1932లో శకుంతలను వివాహం చేసుకున్నాడు.
      గోపీచంద్ జీవితంపై అనేక సిద్ధాంతాలు, వాదాల ప్రభావం ఉంది. తన తండ్రిద్వారా 'ఎందుకు?' అని ప్రశ్నించడాన్ని అలవాటు చేసుకున్నాడు. అలా మొదట హేతువాదంతో ఏకీభవించాడు. తర్వాత కమ్యూనిజంపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ ప్రభావంతో చాలా రచనలు చేశాడు. రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఈ కాలంలోనే పత్రికల్లో రాజకీయ కథలు, వ్యాసాలూ రాశాడు. చివరకు అరవిందుని పట్ల విశ్వాసంతో ఆధ్యాత్మిక భావాలవైపు మొగ్గు చూపాడు.
       గోపీచంద్ వ్యక్తిగత, ఉద్యోగ జీవితం కూడా వైవిధ్యంగానే కనపడుతుంది. న్యాయవాద వృత్తిని వదిలేశాక, చలన చిత్రరంగంలో ప్రవేశించాడు. నిర్మాతగా, దర్శకునిగా కొన్ని చిత్రాలు నిర్మించాడు. 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టరుగా, 1956లో ఆధ్రప్రదేశ్ సమాచారశాఖకు సహాయక డైరెక్టరుగా కూడా పనిచేశాడు. 1957-62లలో  ఆకాశవాణిలో పనిచేశాడు. అయితే గోపీచంద్ మొదటి నుంచి చివరి వరకు ఏ రంగంలో ఉన్నా సాహితీ రచనను మాత్రం వదలుకోలేదు. కాలేజ్ లో చదువుకునే రోజుల్లో తండ్రి రాసిన 'శంభుక వధ' నచ్చి దానిపై కాలేజ్ మ్యాగజేన్ కు వ్యాసం రాశారు.
      వీరి రచనలను మూడు భాగాలుగా చూడవచ్చు 1. నవలలు 2. కథలు 3. తాత్విక, సామాజిక రచనలు
     నవలల విషయానికి వస్తే- అసమర్థని జీవయాత్ర, గడియపడని తలుపులు, చీకటి గదులు, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా, పరివర్తన, యమపాశం, శిథిలాలయం వంటి నవలలు రాశారు. అయితే వీటిలో గోపీచంద్ కు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన నవల 'అసమర్థుని జీవయాత్ర'. తెలుగులోనే మొదటి వైజ్ఞానికి నవల ఇది. గోపీచంద్ ఈ నవలను 'ఎందుకు?' అని ప్ర శ్నించడం నేర్పిన తండ్రికి అంకితం ఇచ్చాడు. ఇక 'పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా' నవలకు 1963లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
       కథల విషయానికి వస్తే- 'భార్యల్లోనే ఉంది', 'దేశం ఏమయ్యేటట్లు' లాంటి కథా సంపుటాలు వెలువరించారు. 'ధర్మవడ్డీ' లాంటి ఎన్నో అమూల్య కథారత్నాలను అందించాడు. వీరి కథల్లో సామాజాకి, తాత్విక కోణాలు కనిపిస్తాయి. పాత్రలు కూడా ఆయా నేపథ్యాలకు ప్రాధాన్యాన్ని వహించేవిగా ఉంటాయి. కథల్లో వ్యగ్యం, ఆలోచన సమపాల్లలో కనిపిస్తాయి. చమత్కారం, నాటకీకరణ, చక్కటి భాషతో వీరి శైలే ప్రత్యేకంగా ఉంటుంది. ఎం.ఎన్. రాయ్ ప్రభావంతో తెలుగులో మొదటగా రాజకీయ కథలకు శ్రీకారం చుట్టారు.
'కార్యశూరుడు' కథ పేదల గురించి, శ్రామికోద్యమం గురించి చెప్తుంది.
'పిత్రార్జితం' కథ సొంత ఆస్తిని నిరసిస్తుంది.
'మన కవి' కథ ప్రేయసి గురించి భావకవిత్వం అల్లే వారిని హేళన చేస్తుంది.
'సరే కానివ్వండి' కథ విప్లవాన్ని సమర్థిస్తుంది.
'పరివర్తన' కథ మనిషికి ఉండాల్సిన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుంది.
'గోడమీద మూడోవాడు' కథ హిందూముస్లీముల మధ్య ఐక్యతను కోరుకుంటుంది.
'ఒక వెంకటాచలం' కథ చలం పాత్రను విమర్శకు పెడుతుంది.
'నేనూ - భూతం' కథ సినిమా వాళ్లలోని నీతిరాహిత్యాన్ని వెక్కిరిస్తుంది.
       ఇలా కథల్లో విభిన్నతను చాటాడు గోపీచంద్. ప్రపంచ సాహిత్యాన్ని, తాత్విక సిద్ధాంతాల్ని అధ్యయనం చేసినా, ఆ జ్ఞానాన్ని తన కథల్లో, నవలల్లో శిల్పం దెబ్బతినకుండా ప్రవేశపెట్టాడు. వీరి కథల్లో చెప్పదలచుకున్న అంశానికి అనుగుణంగానే పాత్రలు, కథ ప్రారంభం, ముగింపు ఉంటాయి.  
      సామాజిక, తాత్విక రచనలు- పోస్టుచేయని ఉత్తరాలు, తత్త్వవేత్తలు, మాకూ ఉన్నాయి స్వగతాలు.
      ఇక సినిమాలు- చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు, పేరంటాలు, గృహప్రవేశం, రైతుబిడ్డ, సినిమాలకు పనిచేశారు.
   తన రచనల గురించి గోపీచంద్ చెప్తూ 'జీవితంలో నాకు ఒక ప్రత్యేక పద్ధతి లేనట్టు నా కథా రచనకూ లేనట్టనిపిస్తుంది. కొన్నింటిని నేనే సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి వ్రాస్తే మరికొన్నింటికి సంభాషణలకు ప్రాధాన్యమిచ్చి చిత్రించాను.మరికొన్నింటిని మనస్తత్వము, వాతావరణము, ప్రధానముగా రూపొందించాను. అన్నింటి ప్రభావము నాపై కలదు.' అన్నాడు.
       హేతువాదం నుంచి హ్యూమనిజం... తర్వాత మతవాదంలోకి వచ్చినా కథకుడిగా గోపీచంద్ మార్గం మాత్రం ఉదాత్తమైనదే...
     'నాకు జీవితం పై ఆశైతే వుందిగాని, తెలివిగా బతకడం చేతకాదు. అందుచేత బంధం మీద బంధం చుట్టుకుంటూ వెళ్తుంటాను. చివరికి ఊపిరి సల్పని స్థాయిలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఎవరో ఒకరు వీపుమీద ఫెళ్లున చరుస్తారు.తుళ్లిపడి లేస్తాను. ఒళ్లు విదుల్చుకుంటాను. ఈ విదిలింపే నా పుస్తకాలు'. అని తన రచనలను పరిచయం చేస్తాడు గోపీచంద్.
   నవలాకారుడు, కథకుడు, తాత్వికుడు, నాటకకర్త, హేతువాది అయిన గోపీచంద్ నవంబర్ 2, 1962న మరణించాడు. ఆయన శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం సెప్టెంబరు8, 2011లో తపాళబిళ్లను విడుదల చేసింది.
      'జ్ఞానం కత్తిలాంటిది. ఉపయోగించుకోగల శక్తి ఉంటే ఆత్మరక్షణ చేస్తుంది. దుర్వినియోగం చేసుకుంటే ఆత్మహత్యకు అక్కరకు వస్తుంది' అని జ్ఞాన పరమార్థాన్ని ఈ ప్రపంచానికి అందించిన గొప్ప తాత్వికుడు, రచయిత త్రిపురనేని గోపీచంద్.