Facebook Twitter
అమ్మ అంటే ఎవరు? - శారదా అశోకవర్ధన్

అమ్మ అంటే ఎవరు?


- శారదా అశోకవర్ధన్

 

అమ్మ అంటే

నీకు జన్మ నిచ్చిన పునీత!

నవమాసాలు మోసి

తన రక్తాన్ని నీకు పంచి

ప్రాణం పోసిన దేవత

తన ఒడి నిన్ను భద్రంగా

దాచుకునే గుడి

నీకు మాట నేర్పేబడి

అది నీకు నడక నేర్పే మైదానం

నీకు నడత నేర్పే విద్యాలయం

అమ్మ పెట్టే ముద్దు కొండంత హాయినిస్తుంది

అమ్మ కౌగిలింత నునువెచ్చగా చుట్టుకుంటుంది

అమ్మ తలపే ఒక ఊయల

బొమ్మగా చేసి నిన్ను ఊగిస్తుంది

అమ్మ పిలుపే ఒక పాట

పలికిస్తుంది వేనవేల రాగాలు నీ నోట

ఆపదలో వున్నా ఏ పనిలో వున్నా

అమ్మా అనే మాట

అలుపు తీరుస్తుంది

ఆనందాన్నిస్తుంది

మకరందంలోని తీయదనంలా

మమతలను పంచుతుంది

అమ్మ రూపం కనిపించే దైవం

అమ్మలో ఒక భాగం జీవమున్న మనం

అందుకే-

అమ్మని అవమానపరచకు

అవస్థ పెట్టకు

పాలుతాగిన రొమ్మునుంచి

రక్తాన్ని పీల్చకు

గుండె గాయపరచకు

ఆమెకు పెట్టే పట్టెడు మెతుకులకు

లెక్కలు కట్టకు!