Facebook Twitter
పండగ - శారదా అశోకవర్ధన్

పండగ


- శారదా అశోకవర్ధన్

 

ఉగాదినా మరేదైనా

కొత్త అనేది రోజులో లేదు

సంవత్సరంలో లేదు-

సూర్యుడు కొత్త రంగు పులుముకొస్తాడా

గాలి కొత్త వాసనలు చిమ్ముకొస్తుందా

అవే పూలు అవే కాయలు

అవే రుచులు అవే గతులు

మనిషి కోరుకునే కొత్తదనానికి

ముద్దు పేరు - పండగ!

రొటీన్ జీవితం బోరుకొట్టక

బయట పడే మార్గం - పండగ

తనకు తానే నియమ నిబంధనల హర్మ్యాన్ని

నిర్మించుకోవడానికి దోహదం - పండగ

స్నేహ సంపదను పంచుకోవడానికి

పదిలంగా పెంచుకున్న నిండిన 'పాదు'-పండగ

మానవత్వం పాలు పంచుకోవడానికి

'పొదుగు'-పండగ

నూతనత్వం గుండెనిండా

అడుగడుగునా నింపుకుంటూ

కష్టసుఖాలను సమంగా ఎంచుకుంటూ

సాగిపోయే బాటసారికి

ప్రతినిత్యం పండగే -

మనిషిగా జీవించడమే

మనకు అసలైన పండగ