Facebook Twitter
కరుణ కుమార

కరుణ కుమార


                              
                  

- డా.ఎ. రవీంద్రబాబు


   
రాయలసీమ మాండలిక పదాలను తొలిసారిగా కథాలోకానికి పరిచయం చేసిన రచయిత కరుణకుమార. ఉన్నత స్థాయి నుంచి నిరుపేదల వరకు సమాజంలోని అన్ని పాత్రలను తన కథల్లో సృష్టించిన కథకుడు కరుణకుమార. మనిషిని, మానవ ఔన్నత్యాన్ని ఉన్నతంగా రచనల్లో చూపించిన దార్శనికుడు కరుణకుమార. కరుణ కుమార అసలు పేరు కందుకూరి అనంతం.
       కరుణకుమార ఏప్రిల్ 17, 1901 పశ్చిమగోదావరి జిల్లాలోని కాపవరంలో జన్మించారు. బహుశా హైస్కూలు విద్యతోనే చదువుకు స్వస్తి చెప్పారు. తర్వాత బతకడం కోసం బస్సుకండెక్టరుగా, కచ్చేరి గుమాస్తాగా పనిచేశారు. చివరకు తహసీల్దారుగా ప్రభుత్వం ఉద్యోగం చేశారు. కానీ ఏ పనిచేసినా అక్కడి సమాజాన్ని, ప్రజల జీవితాలను సూక్ష్మంగా పరిశీలించేవారు.  ఆ అనుభవాలనుండే కథలను రాసేవారు.
       కరుణకుమార కథలు 1961లో 'సన్నజీవాలు' పేరుతో 6 కథలు, 1998లో 'కరుణకుమార కథలు'గా 10 కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి. ఆ రోజుల్లో భారతి, ఆంధ్రప్రభ పత్రికల్లో విరివిగా వీరు కథలు రాసేవారు. అప్పటి బ్రాహ్మణ అగ్రహారాలు, కాపుపల్లెలు, మాలవాడలు... ఇలా సమస్త ప్రజల జీవన విధానాలను, ఆయా మనుషుల చిత్తవృత్తులను సహజంగా చిత్రించారు. అంతేకాదు వీరి కథల్లో ఇతని పేరుకు తగ్గట్టుగానే కరుణరసం అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈయన కథలు చదువుతుంటే ప్రారంభ నుంచి ఉత్కంఠ భరితంగా సాగుతుంటాయి. సన్నివేశం తర్వాత సన్నివేశం చిత్రాల్లా కదిలిపోతుంటాయి. కయ్య-కాలువ, రిక్షావాలా, బిళ్ళల మొలతాడు, టార్చిలైటు వంటివి వీరి కథల్లో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.
     కరుణకుమార లోకంలో చూసిన ప్రతి సన్నివేశాన్ని, సంఘటనను వదలకుండా కథల్లో బిగించాడేమో అనిపిస్తుంది. పట్టణాలకు వచ్చినా పల్లెటూరి ఆచారాలను వదలలేని మనుషులు, చిన్నచిన్న బస్తీల్లో జనాలు పడే అగచాట్లు, ఆకలి కేకలు వీరి కథల్లో ప్రధానంగా కనిపిస్తాయి. అందుకే వస్తు వైవిధ్యం ఉన్న ప్రపంచం వీరి కథాలోకం.
     వీరి కథ్లలో ఎక్కువ నెల్లూరు జిల్లా పదాలు కనిపిస్తాయి. అక్కడి ప్రజల్లోని సొగసైన మాండలిక పదాలను సాహిత్యం పీఠం ఎక్కించిన ఘనులీయన. ఎగ్గు, ఎడపిల్ల, బదనాయం, ఆమైన... లాంటి పదాలు ఎన్నో కనిపిస్తాయి.
        'బిళ్ళలమొలతాడు' కథలో ధనవంతురాలైన లక్ష్మమ్మకు కొడుకు రామిరెడ్డి, పాలేరు సుబ్బడు రెండు కళ్లు. అయితే రామిరెడ్డి కన్ను సుబ్బడి భారపై పడుతుంది. ఆమెను లొంగదీసుకోడానికి ప్రయత్నిస్తాడు. కుదరదు. కోపంతో సుబ్బడిపై బిళ్ళలమొలతాడు దొంగలించాడనే నేరాన్ని మోపి కోర్టుకీడుస్తాడు. లక్ష్మమ్మ మాత్రం కోర్టులో సాక్ష్యం చెప్పి సుబ్బడిని రక్షిస్తుంది. కోర్టు నుంచి నేరుగా యానాదిగూడెం సుబ్బడి ఇంటికి వెళ్తుంది. ఇలా మానవీయతకు విలువ ఇచ్చే పాత్రలు కురుణకుమార కథల్లో ఎక్కువగానే కనిపిస్తారు.
       'రిక్షావాలా' కథలో రిక్షావాళ్ల దయనీయ పరిస్థితులనే కాకుండా తెలుగువారి సంస్కృతికి అద్దంపట్టే సంక్రాంతి పండుగ విశేషాలు వర్ణించారు. భోగి, పెద్ద పండుగ, కనుమ నుంచి పిల్లలు తల స్నానాలు చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, భోగిమమంటలు... పిండి వంటలు గురించి... లడ్డు, మిఠాయి, బొబ్బట్లు, పెరుగువడలు, అరిసెలు, దధ్యోదనం, చక్రపొంగలి... ఇవే కాకుండా పప్పు, ఆవకాయ, గొంగూర, క్షీరాన్నం... ఇలా తెలుగువారి సంపూర్ణ భోజనాన్ని వివరించారు కరుణ కుమార. డిసెంబర్ 1956లో కథా ప్రపంచాన్ని, తెలుగునేలను వదిలి వెళ్లిపోయారు.
         అయితే, గుర్తుంచుకొని చదవాల్సిన కథా రచయిత కరుణకుమార అని చెప్పడం అతిశయోక్తి కాదు. వారి కథల్లో మారిన, మారుతున్న సమాజం మనకు దర్శనం ఇస్తుంది. అందుకే తెలుగు కథా ప్రపంచంలో కరుణకుమార స్థానం ఎప్పటికే పదిలమే...