Facebook Twitter
చలం

చలం
                              
        

 - డా.ఎ. రవీంద్రబాబు.


             తెలుగు సమాజాన్ని ఊగించి, దీవించి, తన రచనలతో పెను తుపాను సృష్టించాడు చలం. కలానికి, జీవితానికి మధ్య కత్తి అంచుపై నడిచాడు చలం. నేను ఎవరు? అని ప్రశ్నిస్తూనే... తీవ్ర అశాంతితో, ఆవేదనతో అలమటించిన సౌందర్యవాది చలం. సంఘంలోని కుటీలనీతిని తూర్పారపట్టి, ఒంటరి వేదనలో బాధను సైతం ఆనందంగా స్వీకరించిన తాత్వికుడు చలం. స్త్రీ తరఫున వకాల్తా పుచ్చుకొని, ఆమె స్వేచ్ఛకోసం పరితపించిన ప్రేమికుడు చలం.
            అనుక్షణం ప్రశ్నలతో, అశాంతితో జీవిస్తూ... ఆనందం కోసం కలలుగన్న చలం పూర్తిపేరు గుడిపాటి వెంకటచలం. మే 18, 1894న మద్రాసులో పుట్టాడు. తల్లి వేంకట సుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివరావు. అయితే తాతయ్య గుడిపాటి వెంకట చలం దత్తత తీసుకోవడం వల్ల ఇంటిపేరు మారింది. పాఠశాల విద్య పూర్తికాకముందే ఇతిహాసాలు, పురాణాలను క్షణ్ణంగా చదువుకున్నాడు. పిఠాపురంలో చదువుకుంటూ, కాలేజీ రోజుల్లో బ్రహ్మసమాజం వైపు ఆకర్షితుడయ్యాడు. చిన్న వయసులోనే రంగనాయకమ్మను పెళ్లి చేసుకున్నాడు.
          చిన్నతనంలో తండ్రి తనను కొట్టడం, తండ్రే తల్లిని వేధించడం, చెల్లెలు పెళ్లి ఆగిపోవడం... ఇలాంటివి చలం పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చలం మద్రాసులో బి.ఎ. చదువుకునే రోజుల్లో భార్యను కూడా చదవించాడు. ఇది తెలుసుకుని 'ఆడపిల్లకు చదువేంటి?' అని చలాన్ని బంధువులు  దూరంగా ఉంచారు. తర్వాత చలం కాకినాడలో ట్యూటర్ గా, హోస్పేట టీచర్ గా పనిచేశాడు. తర్వాత రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజ్ లో ఉద్యోగం చేశాడు. పాఠశాల తనిఖీ అధికారిగా కూడా కొంతకాలం పనిచేశాడు.
             చిన్నతనం నుండే చలానికి సమాజంలోని ఆచారాలు, కట్టుబాట్లు, నీతినియమాలు, వాటి వెనుక దాగిన రహస్యాలు గిట్టేవి కావు.  ప్రతి క్షణం ఆయనను బాధపెట్టేవి. ఆలోచింపజేసేవి. ఎదురపడే సంఘటనలు, స్త్రీల జీవితాల్లోని బాధలు నిద్రపోనిచ్చేవి కావు. వ్యక్తిగత జీవితంలో సమాజ ప్రభావం తీవ్ర మానసిక వేదనను కలిగించేది. చదవటం, సమాజంలోని ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి అనుభవాలతో పోల్చుకోవడం, ఈశ్వరుడికోసం వెతకడం ప్రారంభించాడు. కానీ చలానికి ఎక్కడా ప్రశాంతత దొరకక అశాంతిలో మునిగిపోయేవాడు. కళ్లెదుట స్త్రీలు పడే అగచాట్లు, కష్టాలు అతనిని బాధించేవి... ... ఇలా తన మనసు తనలో తను చేసుకునే అనేక వాద ప్రతివాదాలతో రచనా ప్రపంచంలోకి అడుగు పెట్టాడు చలం.
    కీర్తికోసమో, ధనం కోసమో రచనలు చేయలేదు. తన బాధను, వేధిస్తున్న ప్రశ్నలను, స్త్రీ అణచివేతను భరించలేక వాటినే అక్షరాల్లోకి ప్రవేశ పెట్టాడు. ఎటువంటి అధికారాలకు, ప్రలోభాలకు, ప్రభావాలకు లొంగకుండా జీవించమన్నాడు. సరిహద్దులు లేని మానసిక, భౌతిక ప్రేమను, స్వేచ్ఛను పొందాలన్నాడు. దాని కోసమే తపించాడు. పిల్లలకు బాల్యంలో సంపూర్ణ స్వేచ్ఛను ఇవ్వాలన్నాడు.
       శిశిరేఖ, మైదానం, వివాహం, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, అమీనా, అరుణ, జీవితాదర్శం, సీతతల్లి, ఆమె పెదవులు, బిడ్డల శిక్షణ, చలం, మ్యూజింగ్స్, టాగూర్ గీతాంజలి (అనువాదం), ప్రేమలేఖలు, పురూరవ, సావిత్రి, స్త్రీ, పాపం, ఆ రాత్రి, ప్రేమ పర్యవసానం, యవ్వనవనం, ఆనందం, విషాదం, భగవద్గీత. జెలసీ, వేదాంతం... ఇలా ఎన్నో పుస్తకాలు కథలు, నవలలు, నాటకాలు, నాటికలు, జీవితచరిత్ర, డైరీలు, ఉత్తరాలుగా... ... రాశాడు. 
కుటిలనీతుల మధ్య, కుటుంబ గౌరవాల మధ్య, కట్టుబాట్ల మధ్య, మృగరాజ్యాల మధ్య స్త్రీకి జరుగుతున్న అణచివేతల్ని, అన్యాయాల్ని ప్రశ్నించాడు.
      'స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి
     ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి
     ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం కావాలి'
      అని గట్టిగా వాదించాడు. తన జీవితంలో, రచనల్లో ఇచ్చి చూపాడు. రాజేశ్వరి, అరుణ, శశిరేఖ... లాంటి ఎన్నో చలం పాత్రలు సమాజం విధించిన బంధాలు తెంచుకున్నాయి. ఆజ్ఞలు లేని స్వేఛ్ఛలో విహరించాయి. బాధలు, కష్టాలు, కన్నీళ్లు బరించాయి. వాటిల్లో ఆనందాన్ని అనుభవించాయి. సమాజాన్ని వెలివేశాయి. సమాజం చేత వెలివేయబడ్డాయి. అపార్థాలకు, అన్యాయాలకు గురయ్యాయి.
         చట్టం పేరుతో, బంధం పేరుతో, సమాజం పేరుతో ఇద్దరిని కట్టిపడేసే బంధాలలో ఇరుక్కొని నరకం అనుభవించే కంటే... ఎక్కడ శరీరం మనసును నిర్లక్ష్యం చేయదో, ఎక్కడ ఆరాధన, ఆప్యాయత కట్టుబాట్లకు లొంగిపోదో అక్కడకు పొమ్మంటాడు చలం. 'మైదానం' నవలలో రాజేశ్వరిలా...
      నేటి అత్యాధునిక స్త్రీ గురించి చలం ఆరోజుల్లోనే వాస్తవంగా ఆలోచించాడు. 'భర్త అధికారం నుంచీ, భర్త ఆధీనం నుంచి తప్పించుకుంటున్న నవీన స్త్రీ, షోకులకీ, సంఘగౌరవానికీ, ఫాషిన్సీకి బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కింద నుంచుని (ఆ పురుషుడికి బానిస అయితేనేం గాక) లోకాన్ని ధిక్కరించ గలిగే ఇల్లాలు, ఈనాడు సంఘగౌరవం పేర, ఉద్యోగం పేర, ఫాషిన్సీపేర వెయియమందికి దాస్యం చేస్తోంది. నవీన స్త్రీకి - తన చుట్టూ స్త్రీలందరూ అత్తలైనారు.' అని అన్నాడు
          హిపోక్రసీలు, దుర్మార్గాలు, హింసలు, స్వార్థాలు, దౌర్జన్యాలు లేని మనుషుల్ని, మనసుల్ని, సమాజాన్ని చలం కోరుకున్నాడు. అన్నీ మర్చిపోయి ఒకరిలో ఒకరు ఐక్యమయ్యే ప్రేమ, తృష్ణ కావాలన్నాడు. అందుకే ఆ రోజుల్లో చలం స్వేచ్ఛ పేరుతో విశృంఖలాన్ని చెప్తున్నాడని, బూతుల్ని రాస్తున్నాడని ప్రచారం జరిగింది. చలం సాహిత్యాన్ని బహిరంగంగా చదవడానికే సమాజం భయపడింది.
          చలంలో కేవలం స్త్రీవాదే కాదు, ఒక తాత్వికుడు, దార్శనికుడు, హేతువాది కూడా... సాహిత్యం మీద, కళ మీద చలానికి సొంతవైన, గాఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. 'మహాప్రస్థానా'నికి చలం రాసిన ముందుమాట నిజంగా యోగ్యతాపత్రిమే... 'నెత్తురు, కన్నీళ్లు కలిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తాయారుచేశాడ'న్నాడు శ్రీశ్రీ. 'శ్రీశ్రీ బాధ ప్రపంచపు బాధ, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ' అని చెప్పాడు. శ్రీశ్రీ కవిత్వంలో 'చీకట్లో మొహాలూ, తోకలూ, కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలి దెబ్బల కింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మరఫిరంగుల మరణధ్వానం' ఉన్నాయన్నాడు. 

           చలం రచనల్లో మరో గుప్పగుణం ఆయన శైలి. ఆయన చెప్పే విషయాలని ఇష్టపడని వాళ్లు కూడా, ఆ వాక్యాల కోసం చలం పుస్తకాల్ని చదివేవారు. బాధ నుండి, ఆర్తి నుండి, తీవ్రమైన మనో వేదన నుండి పొంగుకొచ్చిన కన్నీటి సముద్ర అలల నుండి ఆయన శైలి రూపుదిద్దుకొంది. అందుకే దానికి అంత సౌందర్యం. పరిమితులు, పరిధులు లేని భాష ఆయన సొత్తు.
         ఇంతగా స్వేచ్ఛకోసం, ప్రేమకోసం, హిపోక్రసీ లేని సమాజం కోసం... ... తపించిన చలం జీవితంలో ఒంటరి వాడిగానే మిగిలిపోయాడు. అవమానాలు పొందాడు. రచనల వల్ల, వ్యక్తిగత జీవితం వల్ల మానసికంగా సమాజం అతడిని కుంగదీసింది. జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టింది. అనారోగ్యంతో పెద్ద కొడుకు చనిపోయాడు. మరొక కొడుకు వ్యసనాలకు బానిసై ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కూతురు సౌరీస్ సన్యాసిగా మారిపోయింది. చలం ప్రేమ విషయలాతో విసుగుచెంది భార్య రంగనాయకమ్మ క్షోభ పడింది. తర్వాత వదిన పెద్ద రంగనాయకమ్మ మరణించింది. అన్ని విధాలా అతడిని తెలుగు సమాజం వెలివేసింది. చలం విజయవాడలోని సొంత ఇంటిని ఫిబ్రవరి9, 1950లోనే అమ్మి అరుణాచలం లోని రమణమహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయాడు.
     కానీ ఆయన రచనల మీద మమకారం తీరక అనేకమంది అక్కడకు వెళ్లి ఆయనను చూసి, మాట్లాడి వచ్చేవారు. చలం కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు నచ్చిన వాళ్లతో జరిపేవాడు. చివరకు ఆధ్యాత్మిక భావనలోని సౌందర్యంలో మునిగి మే4, 1979లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
          స్త్రీల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రతిక్షణం అలమటించి, అక్షరయజ్ఞం సాగించాడు చలం. 'నేను' అనే భావనను త్యజించాలని ప్రయత్నించి, అన్వేషణ సాగించాడు. అనుభవ పూర్వకమైన సౌందర్యం వెంట పరుగులు తీశాడు. సమాజాన్ని పొరలు పొరలుగా విడదీసి లోపాలను ఎండగట్టాడు. సరిహద్దుల్లేని స్వేచ్ఛా మానసం కోసం పరితపించాడు. ఇలా చలాన్ని ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆయన రచనలు వారికి అలా కనిపిస్తాయి. అందుకే చలం పుట్టి 120 ఏళ్లు అయినా, ఇంకా అతని రచనలపై వాదోపవాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఉంటాయి.
         తిట్టడానికో, పొగడ్డానికో, ఆ అర్ణవంలో పడి కొట్టుకపోవడానికో... తాత్వికంగానైనా, ప్రేమను తెలుసు చేసుకోడానికైనా, స్త్రీని కొంత అర్థం చేసుకోడానికైనా, హిపోక్రసీని వదులుకోడానికైనా... నిన్ను నీవు మలచుకోడానికి, సమాజాన్ని ఎలానో ఒకలా, కుహనా విలువల వలువలు విప్పి చూడటానికి చలాన్ని తప్పక చదవాల్సిందే....